క‌విత వ్యూహాత్మక ఎత్తుగ‌డ‌లతో బీఆర్ఎస్‌కు మ‌రింత న‌ష్టం.. ‘జై కేసీఆర్’ నినాదం ఎందుకు?

Best Web Hosting Provider In India 2024

క‌విత వ్యూహాత్మక ఎత్తుగ‌డ‌లతో బీఆర్ఎస్‌కు మ‌రింత న‌ష్టం.. ‘జై కేసీఆర్’ నినాదం ఎందుకు?

Anand Sai HT Telugu
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Facebook
Anand Sai HT Telugu

తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు చర్చంత కేసీఆర్ కుమార్తె కవిత గురించే. ఆమె చేసిన సంచలన వ్యాఖ్యలతో అందరూ షాక్ అయ్యారు. అయితే కవిత వేసే అడుగులు బీఆర్ఎస్‌కే నష్టం చేకూరుస్తాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

కేసీఆర్‌తో కవిత(ఫైల్ ఫొటో)

బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్‌కు గురైన ఎమ్మెల్సీ కల్వకుంట్ల క‌విత ఎమ్మెల్సీ పదవి, పార్టీ ప్రాథ‌మిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. అయితే దీనిపై బుధ‌వారం మీడియాతో మాట్లాడిన క‌విత చివ‌ర్లో వ్యూహాత్మకంగా ‘జై కేసీఆర్’ నినాదాన్ని ఎత్తుకున్నారు. క‌విత ఈ నినాదాన్ని కాక‌తాళీయంగా చేసిన‌ది కాద‌ని, జై కేసీఆర్ అని పార్టీ నుంచి స‌స్పెండ్ అయిన త‌రువాత కూడా నిన‌దించ‌డం ద్వారా బీఆర్ఎస్‌లోని అసంతృప్తి వ‌ర్గాన్ని త‌న‌వైపు తిప్పికొనేందుకు ఆమె వ్యూహాత్మక అడుగులు వేస్తున్నట్టు క‌నిపిస్తోంది.

కేసీఆర్‌పై గౌర‌వం ప్రదర్శించడం ద్వారా ఇప్పటికే క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జ్‌లు, సీనియ‌ర్లపై అసంతృప్తితో ఉన్న క్యాడ‌ర్‌లో త‌న‌పై సానుభూతి పెరిగి క‌చ్చితంగా త‌న‌కు అండ‌గా నిలుస్తార‌ని క‌విత భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. అందులో భాగంగానే వ్యూహాత్మకంగా జై కేసీఆర్ నినాదాన్ని ఎత్తుకున్నట్టుగా అర్థమవుతోంది. బీఆర్ఎస్ పార్టీలో నెల‌కొన్న రాజ‌కీయ సంక్షోభం, క‌విత వ్యూహాత్మ అడుగులు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌తోపాటు, స్థానిక సంస్థల ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్‌ను తీవ్రంగా దెబ్బతీస్తాయ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

రెండుగా చీలిన బీఆర్ఎస్ క్యాడ‌ర్‌!

పార్టీ వ్యతిరేక కార్యకలాపాల‌కు పాల్పడుతున్నార‌న్న కార‌ణంగా క‌విత‌ను కేసీఆర్ పార్టీ నుంచి స‌స్పెండ్ చేయ‌డంతో జిల్లాల వారీగా బీఆర్‌ఎస్ రెండు వర్గాలుగా చీలిపోయినట్టు కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఒక వర్గం కవితకు మద్దతుగా నిలిస్తుంటే, మరో వర్గం హరీష్ రావు, సంతోష్ రావు వంటి నాయకులకు సపోర్ట్ చేస్తోంది. ఈ ప‌రిణామాలు బీఆర్ఎస్ క్యాడ‌ర్‌ను రెండుగా విచ్ఛిన్నం చేశాయి.

అయోమయంలో క్యాడర్

త‌ద్వారా కల్వకుంట్ల కుటుంబంలోని అంతర్గత గొడవలు క్యాడ‌ర్‌ను పూర్తిగా అయోమ‌యానికి గురి చేసిన‌ట్టైంది. ఈ నేప‌థ్యంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌, స్థానిక సంస్థల ఎన్నిక‌లకు ముందు జ‌రుగుతున్న ఈ ప‌రిణామాలు బీఆర్ఎస్‌కు కోలుకోలేని న‌ష్టం చేస్తాయ‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

రెండు వర్గాల నిరసన

కవిత సస్పెన్షన్ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పోటాపోటీ నిరసనలు జరుగుతున్నాయి. కవిత మద్దతుదారులు, తెలంగాణ జాగృతి శ్రేణులు హరీష్ రావు, సంతోష్ రావు దిష్టిబొమ్మలను దహనం చేస్తూ నిరసనలు తెలుపుతున్నారు. మరోవైపు, హరీష్ రావు మద్దతుదారులు, బీఆర్ఎస్ శ్రేణులు కవిత ఫ్లెక్సీలు, దిష్టిబొమ్మలను తగలబెడుతున్నారు. హుస్నాబాద్ మల్లె చెట్టు చౌరస్తాలో బీఆర్‌ఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. జ‌గిత్యాల‌, నిజామాబాద్, మెద‌క్‌, కరీంనగర్, నల్లగొండ, వరంగల్ వంటి పలు జిల్లాల్లో ఈ నిరసనలు జరిగాయి. ఈ ఘటనలు రెండు వర్గాల మధ్య పెరుగుతున్న వైరాన్ని స్పష్టం చేస్తున్నాయి.

క్యాడ‌ర్‌ దూరం!

ఇప్పటికే గ‌త అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఓటమి, లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేక‌పోవ‌డం, కంటోన్మెంట్ ఉపఎన్నికలో సిట్టింగ్ స్థానం కోల్పోవ‌డం, ఇటీవ‌ల జ‌రిగిన ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో క‌నీసం పోటీ చేయ‌లేని దుస్థితి వంటి ప‌రిణామాలు, బీజేపీలో బీఆర్ఎస్ విలీన ప్రతిపాదన ప్రచారం, క‌విత స‌స్పెన్షన్ వంటి ప‌రిణామాలు క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్‌కు క్యాడ‌ర్‌ను దూరం చేస్తున్నాయి.

స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభావం!

ఇప్పటికే లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ ఓటు బ్యాంకు 16.7 శాతానికి ప‌డిపోవ‌డ‌మే అందుకు నిద‌ర్శనంగా విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. తాజాగా క‌విత స‌స్పెన్షన్‌తో ఇప్పటికే అయోమ‌యంలో ఉన్న క్యాడ‌ర్‌ బీఆర్ఎస్‌కు పూర్తిగా దూర‌మ‌వుతోంద‌ని, ఈ నేప‌థ్యంలో స్థానిక సంస్థల ఎన్నిక‌ల్లో పోటీకి ఆ పార్టీ నేత‌లు జంకుతున్నట్టుగా తెలుస్తోంది. పోటీ చేసినా ఓట‌మి త‌ప్పదనే భావ‌న‌లో బీఆర్ఎస్ నేత‌లు ఉన్నట్టు క‌నిపిస్తోంది. క‌విత వ‌ర్గాలు గ్రామాల్లో త‌మ‌కు ఖ‌చ్చితంగా న‌ష్టం చేస్తాయ‌నే భావ‌న‌తో పోటీకి బీఆర్ఎస్ నేత‌లు భయపడుతున్నట్టుగా తెలుస్తోంది.

Anand Sai

eMail
ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.

టాపిక్

Kavitha KalvakuntlaBrsHarish RaoKcrTs PoliticsKaleshwaram Project
మరిన్ని తెలంగాణ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, హైదరాబాద్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024