



Best Web Hosting Provider In India 2024

విద్యుత్ శాఖలో ఖాళీల భర్తీకి సీఎం చంద్రబాబు ఓకే.. అధికారులతో చర్చించిన మంత్రి గొట్టిపాటి!
ట్రాన్స్ కో ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి చేసి నిర్మాణ వ్యయం తగ్గించాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. కాంట్రాక్టర్లతో సమావేశం కావాలని చెప్పారు.
అమరావతిలో ట్రాన్స్ కో అధికారులతో మంత్రి గొట్టిపాటి రవి కుమార్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కీలక విషయాలపై చర్చించారు. ట్రాన్స్ కో ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి చేసి నిర్మాణ వ్యయం తగ్గించాలని అధికారులను మంత్రి గొట్టిపాటి ఆదేశించారు. ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు కాంట్రాక్టర్లతో సమావేశం అవ్వాలని అధికారులకు సూచించారు. ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో నాణ్యతా లోపం లేకుండా పనులు చేపట్టాలన్నారు.
రూ. 6 వేల కోట్లతో చేపట్టిన ప్రాజెక్టులు 2027 నాటికి పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. అయితే క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులను మంత్రికి అధికారులు వివరించారు. సీఆర్డీఏలో అండర్ గ్రౌండ్ కేబుల్ వ్యవస్థపై మంత్రి ఆరా తీశారు. సీఆర్డీఏ అధికారులతో సమన్వయం చేసుకుని ముందుకెళ్లాలని సూచించారు. సీఆర్డీఏ పరిధిలో జరిగే నిర్మాణాలకు అత్యాధునిక టెక్నాలజీని అవలంబించాలన్నారు. ఆక్వా రైతులకు చేయూతనిచ్చేలా సబ్ స్టేషన్ల నిర్మాణం ఉండాలన్నారు. విజయవాడ, వైజాగ్ నగరాల్లో ఏర్పాటు కానున్న మెట్రోకు కావాల్సిన విద్యుత్ సౌకర్యంపై అధికారులతో చర్చించారు.
‘ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న ట్రిప్పింగ్ సమస్యకు పరిష్కారం చూపాలి. విశాఖపట్నంలో ఏర్పాటు కానున్న డేటా సెంటర్లు, ఇతర పరిశ్రమలకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు చర్యలు చేపట్టాలి. రాష్ట్రంలో మెరుగైన విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేసి, నాణ్యమైన విద్యుత్‌ను అందించడమే లక్ష్యం. 20, 30 ఏళ్ల నాటి పాత సబ్ స్టేషన్లలో మెయింటినెన్స్ పై దృష్టి సారించాలి.’ అని మంత్రి గొట్టిపాటి అధికారులను ఆదేశించారు.
విద్యుత్ శాఖలో ఖాళీల భర్తీపై అధికారులతో చర్చించారు మంత్రి గొట్టిపాటి. ఖాళీల భర్తీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సుముఖత వ్యక్తం చేసినట్టుగా చెప్పారు.
20 లక్షల ఉద్యోగాలు లక్ష్యం
అనంతరం రిలయన్స్ ప్రతినిధులతో గొట్టిపాటి సమావేశం నిర్వహించారు. సీబీజీ ప్లాంట్ల ఏర్పాటు, పురోగతిపై సమీక్ష నిర్వహించారు. సకాలంలో ప్లాంట్ల ఏర్పాటు పూర్తి చేయాలని రిలయన్స్ కు సూచించారు. తొలిదశలో ప్రకాశం, నెల్లూరు, పల్నాడు జిల్లాల్లో ప్లాంట్ల నిర్మాణం జరగనుంది. అనంతరం అన్నమయ్య, కడప జిల్లాల్లో ఏర్పాటుకు రిలయన్స్ సిద్ధమైంది.
సీబీజీ ప్లాంట్ల ద్వారా యువతకు ఉపాధి, రైతులకు మెరుగైన కౌలు అందనుందని మంత్రి తెలిపారు. రిలయన్స్ 500 సీబీజీ ప్లాంట్లతో 2.5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు రానున్నాయన్నారు. ఉపయోగంలో లేని ప్రభుత్వ భూమి ఎకరాకు రూ.15 వేలు, రైతులకు రూ.31 వేల కౌలు రానుందన్నారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలోనే సీబీజీ ప్లాంట్లపై రిలయన్స్ రూ. 65 వేల కోట్ల పెట్టుబడులు పెడుతుందని వెల్లడించారు. మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పని చేస్తున్నామని గొట్టిపాటి చెప్పారు.
టాపిక్