




Best Web Hosting Provider In India 2024

గ్రామ పాలనాధికారులు వచ్చేస్తున్నారు..! రేపు 5 వేల మందికి నియామక పత్రాలు
రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి జీపీవో రానున్నారు. శుక్రవారం వీరికి సీఎం రేవంత్ చేతుల మీదుగా నియామకపత్రాలను అందజేస్తారు. ఆ తర్వాత… గ్రామాల్లో విధులు నిర్వర్తిస్తారు.
గ్రామస్ధాయిలో రెవెన్యూ వ్యవస్థ పునరుద్ధరణ, బలోపేతం చేసే దిశగా తెలంగాణ సర్కార్ మరో అడుగు వేయనుంది. శుక్రవారం (సెప్టెంబర్ 05) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా గ్రామ పాలనాధికారులకు (జి.పి.వో) నియామక పత్రాలను అందజేయనున్నారు.
రైతాంగానికి మరింత మెరుగైన సేవలందించడానికి గ్రామస్ధాయిలో రెవెన్యూ వ్యవస్ధను పునరుద్ధరిస్తూ బలోపేతం చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగానే జీపీవోలను తీసుకువస్తున్నట్లు వెల్లడించింది. వీరి నియామాకాలకు సంబంధించి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తాజాగా ప్రకటన విడుదల చేశారు.
రేపు నియామక పత్రాలు…
ఈనెల 5వ తేదీ శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా గ్రామపాలనాధికారులకు (జీపీవో) మాదాపూర్ లోని హైటెక్స్‌లో నియామక పత్రాలను అందజేస్తామని తెలిపారు. ఇవాళ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో గ్రామపాలనాధికారులకు (జీపీవో) నియామాకాలు అందించే కార్యక్రమం ఏర్పాట్లపై సమీక్షించారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గ్రామపాలనాధికారుల (జీపీవో) నియామకం చేపట్టినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. వారి సేవలను ఒకటి రెండు రోజుల్లో అందుబాటులోకి తీసుకరాబోతున్నామన్నారు. జీపీవోలుగా విధులు నిర్వహించడానికి ఆసక్తి చూపిన వీఆర్వో, వీఆర్ఎ లకు రెండు విడతల్లో నిర్వహించిన రాత పరీక్షల్లో 5,106 మంది ఎంపికయ్యారని వివరించారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వీఆర్వో , వీఆర్ఏ వ్యవస్దను రద్దు చేశారని మంత్రి పొంగులేటి గుర్తు చేశారు. ఈ చర్య వల్ల గ్రామీణ ప్రాంతాల్లో సామాన్యులకు రెవెన్యూ సేవలు దూరమయ్యాయని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనకు అనుగుణంగా రెవెన్యూ సేవలు గ్రామ స్థాయి వరకు అందించాలనే లక్ష్యంతో గ్రామ పరిపాలనాధికారులను నియమిస్తున్నామని చెప్పారు.
భూ భారతి చట్టం ద్వారా రాష్ట్రంలో దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న భూ సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుట్టామని మంత్రి పొంగులేటి చెప్పారు. రిజిస్ట్రేషన్ సమయంలో సర్వే మ్యాప్ తప్పనిసరి చేసిన నేపథ్యంలో ఇందుకు అవసరమైన లైసెన్స్‌డ్ సర్వేయర్ల సేవలను కూడా వచ్చేనెల మొదటివారం నుండి అందుబాటులోకి తీసుకురాబోతున్నామని ప్రకటించారు.
ఇప్పటికే మొదటి విడతలో 7 వేల మందికి శిక్షణ పూర్తి చేశారు. వీరికి అర్హత పరీక్ష నిర్వహించారు. 40 రోజుల పాటు నిర్వహించే అప్రెంటిస్ శిక్షణ కూడా త్వరలో పూర్తి చేసుకోబోతున్నారు. గత నెల 18వ తేదీ నుంచి రెండవ విడతలో 3 వేల మందికి 21 జిల్లాల్లో శిక్షణ ప్రారంభించడం జరిగిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వివరించారు.
సంబంధిత కథనం
టాపిక్