



Best Web Hosting Provider In India 2024

‘వరదలతో భారీగా నష్టం వాటిల్లింది, జాతీయ విపత్తుగా ప్రకటించండి’ – కేంద్రానికి తెలంగాణ సర్కార్ విజ్ఞప్తి
తెలంగాణ మంత్రులు భట్టి విక్రమార్క, తుమ్మల ఢిల్లీలో పర్యటించారు. ఇందులో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఇటీవల రాష్ట్రం కురిసిన వర్షాలు, పంట నష్టం గురించి వివరించారు. ఆగస్టు 25 -28 మధ్య కురిసిన వర్షాలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు.
భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టాన్ని అధిగమించేందుకు కేంద్రాన్ని తెలంగాణ ప్రభుత్వం సాయం కోరింది. రూ.16,732 కోట్ల సాయం అందించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క… గురువారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. ఈ భేటీలో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల కూడా ఉన్నారు.
ఖమ్మం, చుట్టుపక్కల జిల్లాల్లో భారీ వర్షాల వల్ల జరిగిన నష్టానికి రూ.11,713 కోట్ల సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గతంలో కోరిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు గుర్తు చేశారు. అయితే సాధారణ కేటాయింపులు మినహా ఇప్పటి వరకు ప్రత్యేక నిధులు విడుదల కాలేదన్నారు. దీంతో పునరావాస పనులకు ఆటంకం కలుగుతోందని అమిత్ షాకు వివరించారు.
భారీగా నష్టం వాటిల్లింది – ఉపముఖ్యమంత్రి భట్టి
ఇక ఆగస్టు 25 నుంచి 28 తేదీల్లో కురిసిన అకాల వర్షాలకు కామారెడ్డి, మెదక్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో భారీ వరదలు వచ్చాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వివరించారు. దీంతో పెద్ద ఎత్తున నష్టం వాటిల్లిందని, మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయని తెలిపారు.
ఈ వర్షాకాలంలో సాధారణం కంటే 25 శాతం అధిక వర్షపాతం నమోదు కాగా… ఎనిమిది జిల్లాల్లో 65 శాతం నుంచి 95 శాతం అధిక వర్షపాతం నమోదైందని చెప్పారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు, పంటలు, పశువులు, ప్రాణ నష్టం వాటిల్లిందని విక్రమార్క పేర్కొన్నారు.
సహాయక చర్యల కోసం రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులో ఉన్న అన్ని వనరులను సమీకరించిందని భట్టి చెప్పారు. ఏడు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, 15 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, సుమారు 100 మంది ఆర్మీ సిబ్బంది సహాయక చర్యల్లో చురుగ్గా పాల్గొన్నాయని వివరించారు.
ఈ వర్షాల తీవ్రతకు రోడ్లు, రైల్వే ట్రాక్ లు, కల్వర్టులు, విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ ఫార్మర్లు, ఇతర మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని డిప్యూటీ సీఎం భట్టి చెప్పారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా జనజీవనం అస్తవ్యస్తమైందని… దీనిని జాతీయ విపత్తుగా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు.
కేంద్ర ప్రభుత్వ బృందం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి నష్టాన్ని ముందుగా అంచనా వేయాలని మంత్రులు కోరారు. వర్షాల కారణంగా ఇప్పటివరకు 22 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ప్రాథమిక అంచనా. పశువుల నష్టం, పంట నష్టం, ఇళ్ల నష్టాలను అంచనా వేస్తున్నట్లు చెప్పారు.
సంబంధిత కథనం
టాపిక్