




Best Web Hosting Provider In India 2024

ఏపీ పర్యటనకు రాబోతున్న ప్రధాని మోదీ – కూటమి నేతలతో కలిసి రోడ్ షో, డేట్ ఫిక్స్….!
ప్రధానమంత్రి మోదీ ఏపీ పర్యటనకు రానున్నారు. అక్టోబర్ 16వ తేదీన కర్నూల్, నంద్యాల జిల్లాల్లో పర్యటించనున్నారు. జీఎస్సీ సంస్కరణలపై కర్నూల్ పట్టణంలో నిర్వహించే ర్యాలీలో ప్రధాని పాల్గొంటారని సమాచారం.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నారు. అక్టోబర్ 16వ తేదీన కర్నూల్, నంద్యాల జిల్లాల్లో పర్యటిస్తారని తెలిసింది. శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవటంతో పాటు… కర్నూల్ సిటీలో తలపెట్టిన రోడ్ షోలో పాల్గొంటారని సమాచారం.
కర్నూల్ సిటీలో రోడ్ షో…!
ప్రాథమిక వివరాల ప్రకారం…. అక్టోబర్ 16వ తేదీన ప్రధానమంత్రి మోదీ ఏపీలో పర్యటిస్తారు. జీఎస్టీ సంస్కరణలపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి కర్నూలు నగరంలో రోడ్‌షో నిర్వహించనున్నారు. ఇందులో ప్రధానమంత్రి పాల్గొంటారని తెలిసింది. అంతేకాకుండా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో పాటు కూటమి నేతలు ఇందులో పాల్గొననున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటనలో భాగంగా పలుఅభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ఇప్పటికే పూర్తయిన కొన్ని ప్రాజెక్టులను ప్రారంభిస్తారని తెలిసింది. ప్రధాని పర్యటనకు సంబంధించి అధికారికంగా పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించే అవకాశం ఉంది.
ప్రధాని మోదీ జూన్ నెలలో కూడా విశాఖలో పర్యటించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా నిర్వహించిన యోగాంధ్రా కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో పాటు కలిసి యోగాసానాలు వేశారు. ఈ కార్యక్రమానికి గిన్నిస్ బుక్ రికార్డు కూడా వచ్చినట్లు మంత్రి నారా లోకేశ్ తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా అవగాహన ర్యాలీలు..!
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వస్తుసేవల పన్ను తగ్గింపు జీఎస్టీ 2.0 ప్రయోజనాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు నెల రోజుల పాటు ప్రత్యేక ప్రచార అవగాహన కార్యక్రమాన్ని చేపట్టాలని ఏపీ ప్రభుత్వం నిర్వహించింది. వీటిని విజయవంతంగా నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ అన్ని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.
జీఎస్టి 2.0 ప్రయోజనాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు దసరా నుండి దీపావళి వరకు నెలరోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక ప్రచార అవగాహనా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఏవిధంగా నిర్వహించాలనే దానిపై ఇప్పటికే జిఓను జారీ చేశామని… ఆ ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని కలక్టర్లను ఆయన ఆదేశించారు. జిఎస్టి 2.0 వల్ల రాష్ట్రానికి సుమారు 8 వేల కోట్ల రూ.లు ఆదాయం తగ్గుతున్నప్పటికీ ప్రతి కుటుంబానికి 10 నుండి 15 శాతం సొమ్ము ఆదా అవుతుందన్నారు.
అక్టోబరు 19వ తేదీ వరకూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు సీఎస్ తెలిపారు.రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలు,పట్టణాలు, మండల,అసెంబ్లీ నియోజకవర్గ,జిల్లా కేంద్రాల్లో అవగాహనా కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించాలని సిఎస్ విజయానంద్ కలెక్టర్లను ఆదేశించారు. ఇందులో భాగంగానే అక్టోబర్ 16వ తేదీన కర్నూల్ లో రోడ్ షో నిర్వహించనున్నట్లు తెలిసింది.!
సంబంధిత కథనం
టాపిక్
