చికిత్స చేయకపోతే కొలెస్ట్రాల్‌తో వచ్చే పెను ప్రమాదాలు ఇవే

Best Web Hosting Provider In India 2024

చికిత్స చేయకపోతే కొలెస్ట్రాల్‌తో వచ్చే పెను ప్రమాదాలు ఇవే

HT Telugu Desk HT Telugu

కొలెస్ట్రాల్‌ను నియంత్రించకపోతే గుండెపోటు, పక్షవాతం (స్ట్రోక్) వంటి తీవ్రమైన హృదయ సంబంధ వ్యాధుల (CVD) ప్రమాదం పెరుగుతుంది. ముఖ్యంగా భారతీయులలో కనిపించే కొలెస్ట్రాల్, కొవ్వుల ప్రత్యేక కలయిక (అథెరోజెనిక్ డైస్లిపిడెమియా) వల్ల తక్కువ LDL స్థాయిలలో కూడా గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువ.

Heart health depends on your cholesterol levels too. (PC: Freepik)

ప్రతి ఏటా సెప్టెంబర్ 29ని వరల్డ్ హార్ట్ డే జరుపుకుంటారు. గుండె సంబంధిత సమస్యలు, వాటి ప్రమాద కారకాలపై అవగాహన పెంచడమే దీని లక్ష్యం. ప్రపంచ హార్ట్ ఫెడరేషన్ (World Heart Federation) ప్రకారం, సరైన అవగాహన, సకాలంలో చికిత్స తీసుకుంటే, 80 శాతం వరకు అకాల హృదయ సంబంధ మరణాలను నివారించవచ్చని కార్డియాలజిస్టులు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో, గుండెకు పెను ప్రమాదాన్ని కలిగించే ముఖ్య కారకాల్లో ఒకటైన కొలెస్ట్రాల్‌ను నియంత్రించకపోతే ఏం జరుగుతుందో నిపుణుల ద్వారా తెలుసుకుందాం.

కొలెస్ట్రాల్ చికిత్స చేయకపోతే ఏం జరుగుతుంది?

మీ కొలెస్ట్రాల్ స్థాయిలు తరచుగా ఎక్కువగా ఉండి, వాటికి చికిత్స తీసుకోకపోతే, అది మీ హృదయ వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీస్తుంది.

ప్లేక్ ఫార్మేషన్ (Plaque Formation): అధిక కొలెస్ట్రాల్, ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిలు పెరిగితే, అది రక్తనాళాల గోడలపై కొవ్వు పదార్థాల నిక్షేపం (ప్లేక్) ఏర్పడడానికి కారణమవుతుందని శ్రీ రామచంద్ర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్‌లో కార్డియాలజీ ప్రొఫెసర్ డాక్టర్ నాగేంద్ర భూపతి. ఎస్ వివరించారు.

అథెరోస్క్లెరోసిస్: ఈ ప్లేక్ పేరుకుపోవడాన్ని అథెరోస్క్లెరోసిస్ అంటారు. దీనివల్ల రక్తనాళాలు గట్టిపడి, ఇరుకుగా మారతాయి.

తీవ్ర ప్రమాదాలు: ఈ ప్లేక్ చిట్లిపోవడం (Rupture) లేదా రక్తం గడ్డకట్టడం వల్ల గుండెపోటు (Heart Attack), ఇస్కీమిక్ స్ట్రోక్ (పక్షవాతం), ధమనుల సంబంధిత వ్యాధి (Peripheral Artery Disease) వంటి ప్రాణాంతక సమస్యల ముప్పు పెరుగుతుంది.

ఇతర అవయవాలపై ప్రభావం: అధిక కొలెస్ట్రాల్ వల్ల కేవలం గుండె మాత్రమే కాక, మెదడు, మూత్రపిండాలు (కిడ్నీలు), కాళ్లు వంటి ఇతర శరీర అవయవాలపైనా తీవ్ర ప్రభావం పడుతుంది. ఇప్పటికే ఏవైనా అనారోగ్యాలు ఉంటే, వాటిని కొలెస్ట్రాల్ మరింత తీవ్రతరం చేస్తుంది.

భారతీయులలో ప్రత్యేక నమూనా (Indian Pattern)

భారతీయులలో ఒక ప్రత్యేకమైన కొలెస్ట్రాల్ కలయిక కనిపిస్తుందని, దీనిని ‘అథెరోజెనిక్ డైస్లిపిడెమియా’ అని అంటారని ముంబైలోని ఫోర్టిస్ ఆసుపత్రి కార్డియాలజిస్ట్ డాక్టర్ జాకియా ఖాన్ చెప్పారు.

“భారతీయులలో చాలా మందిలో ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ, మంచి కొలెస్ట్రాల్ (HDL) తక్కువ. చిన్న దట్టమైన చెడు కొలెస్ట్రాల్ (Small dense LDL) ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల LDL స్థాయిలు మరీ ఎక్కువగా లేకపోయినా, గుండె ధమనులలో వ్యాధి (Early Coronary Disease) వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అందుకే కేవలం LDL స్థాయిని మాత్రమే కాకుండా, మొత్తం లిపిడ్ ప్రొఫైల్‌ను పరిగణించాలి” అని డాక్టర్ నాగేంద్ర భూపతి. ఎస్ సూచించారు.

కొలెస్ట్రాల్‌ను నియంత్రించే మార్గాలు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించడం అనేది చాలా ముఖ్యం. డాక్టర్ జాకియా ఖాన్ ప్రకారం, ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించడం ద్వారా LDL కొలెస్ట్రాల్‌ను గణనీయంగా తగ్గించవచ్చు.

సమతుల్య ఆహారం (Balanced Diet):

  • కూరగాయలు, పండ్లు, చిక్కుళ్లు, తృణధాన్యాలు (Whole Grains), మిల్లెట్స్, పప్పులు, నట్స్ ఎక్కువగా తీసుకోవాలి.
  • శుద్ధి చేసిన పిండి పదార్థాలు (Refined Carbohydrates) తగ్గించడం వల్ల గుండె సంబంధిత సమస్యలు తగ్గి, కొవ్వులు మెరుగుపడతాయి.

బరువు నియంత్రణ (Weight Management):

5 నుంచి 10 శాతం వరకు బరువు తగ్గడం వల్ల LDL కొలెస్ట్రాల్ స్థాయిలు మెరుగ్గా తగ్గుతాయి.

భారతీయ రోగులలో, BMI (Body Mass Index) సాధారణంగా ఉన్నప్పటికీ, జీవక్రియ సమస్యలు (Metabolically Challenged) ఉండవచ్చు. అలాంటి వారు కొద్దిగా బరువు తగ్గినా, వారికి గుండెకు చాలా ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది.

క్రమం తప్పని వ్యాయామం (Regular Exercise):

వ్యాయామాన్ని ఔషధంలా భావించి, వాస్తవికంగా ఆచరించాలి. ప్రతిరోజూ కొంత సమయం శారీరక శ్రమకు కేటాయించడం తప్పనిసరి.

వైద్యపరమైన జోక్యం తప్పనిసరి:

కేవలం ఆహారం, వ్యాయామంతో మాత్రమే సరిపోదు. ముఖ్యంగా అధిక ప్రమాదం ఉన్న రోగులకు జీవనశైలి మార్పులు మాత్రమే టార్గెట్ LDL స్థాయిలను (70 mg/dL కంటే తక్కువ) చేరుకోలేకపోవచ్చు. అందుకే, డాక్టర్ జాకియా ఖాన్ క్రమం తప్పకుండా స్క్రీనింగ్ (పరీక్షలు) చేయించుకోవాలని గట్టిగా సిఫారసు చేశారు.

“కొలెస్ట్రాల్ సంబంధిత సమస్యలు చాలా కాలంగా నిశ్శబ్దంగా పెరుగుతాయి. అందుకే వాటిని విస్మరిస్తే ‘తిరిగి మార్చలేని పరిణామాలు’ (Irreversible consequences) ఎదురవుతాయి. వైద్యులు సూచించిన చికిత్స, సలహాలు తప్పక పాటించడం ద్వారా దీర్ఘకాలిక రక్షణ పొందవచ్చు” అని డాక్టర్ జాకియా ఖాన్ స్పష్టం చేశారు.

(గమనిక: ఈ కథనం కేవలం సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. వైద్యపరమైన సమస్యలు లేదా సందేహాల కోసం ఎల్లప్పుడూ మీ వైద్యుడిని సంప్రదించండి.)

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.
Source / Credits

Best Web Hosting Provider In India 2024