





Best Web Hosting Provider In India 2024

సుజీత్ ఇచ్చిన పేపర్స్‌ను నా కొడుకు అకీరా నందన్ చదివి ఆనందపడ్డాడు, అతనిలో నన్ను నేను చూసుకుంటా: పవన్ కళ్యాణ్ కామెంట్స్
పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో రీసెంట్‌గా ఓజీ విజయోత్సవ వేడుక నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్ ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు. సుజీత్ ఓజీ కథ తనకు చెప్పలేదని, తను ఇచ్చిన పేపర్స్ కుమారుడు అకీరా నందన్ చదివి ఆనందించాడని పవన్ కళ్యాణ్ చెప్పారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ ఓజీ సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి నిర్మించారు. తాజాగా అక్టోబర్ 1న ఓజీ విజయోత్సవ వేడుకను గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో పవన్ కల్యాణ్ ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు.
చాలా చక్కటి అనుభూతి
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. “ముందుగా ఇక్కడకి వచ్చిన మీడియా వాళ్లకి, అభిమానులకి, స్నేహితులకి, సోదర సోదరీమణులు అందరికీ ఓజీ యూనిట్ తరఫున నా హృదయపూర్వక నమస్కారాలు. ఓజీ సినిమా అనేది మా అందరికి చాలా చక్కటి అనుభూతి” అని అన్నారు.
“చాలా అరుదుగా సినిమాలు హిట్ అవుతూ ఉంటాయి, గ్రేట్ కలెక్షన్స్ వస్తుంటాయి. కానీ, ఒక సెలబ్రేషన్ లాగా ఒక సినిమా రిలీజ్ అవ్వడం చాలా తక్కువ సార్లు జరుగుతూ ఉంటుంది. అలాంటి అవకాశం మాకు లభించినందుకు చాలా ఆనందంగా ఉంది” అని పవన్ కల్యాణ్ తెలిపారు.
“అలాంటి ఒక సినిమా సుజిత్ గారి ద్వారా నాకు రావడం. దానికి తమన్ జీవం పోయడం, రవి కె చంద్రన్ గారు ఫోటోగ్రఫీ, ఇమ్రాన్ హష్మీ గారు, ప్రియాంక మోహన్ గారు, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, డీవీవీ దానయ్య గారు ఇలా ఈ సినిమా గొప్పగా రావడానికి కారణమైన అందరికీ కూడా నా హృదయ పూర్వక ధన్యవాదాలు” అని పవన్ కళ్యాణ్ చెప్పారు.
ఓజీ స్టోరీ ఏంటో నాకు తెలియదు
“ఒక సినిమా కథని రాయడం, చెప్పడం చాలా ఈజీ.. కానీ రాసిన కథను తెర మీదకు అలాగే తీసుకురావడం చాలా కష్టం. ఎందుకు అంటే డైరెక్టర్ దగ్గర నుంచి లైట్ మ్యాన్ వరకు అందరూ కలిసి కట్టుగా పని చెయ్యాలి. అది ఓజీ విషయంలో జరిగింది. మీకు ఒక విషయం చెప్పాలి. అసలు ఇప్పటి వరకు ఓజీ స్టోరీ ఏంటో నాకు తెలీదు. త్రివిక్రమ్ గారు నేను మాట్లాడుకుంటున్నపుడు సుజిత్ టాపిక్ వచ్చింది” అని పవన్ కల్యాణ్ అన్నారు.
“అలా ఓజీ స్టోరీ వినడానికి ఆయనని కలవడం జరిగింది. అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, మీరు ఒక కత్తి పట్టుకుని జపానీస్ డ్రెస్‌లో ఉంటారు. గన్స్ ఉంటాయి, మీరు ఒక గ్యాంగ్ స్టర్. ఇలాగే చెప్పాడు కథ. నాకు ఏం అర్థం కాలేదు. కానీ, సుజిత్ నాకు ఇచ్చిన పేపర్స్‌ను మా అబ్బాయి అకీరా నందన్ చదువుతూ చాలా ఆనంద పడుతూ ఉండేవాడు. అప్పుడు అనిపించింది, ఈ తరం వాళ్లకి అర్థం అయ్యే కథే ఓజీ సినిమా అని” అని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.
“కొన్ని సార్లు సుజీత్‌లో నన్ను నేను చూసుకుంటా. ఎందుకంటే కొన్ని సార్లు మనం చెప్పాలి అనుకున్నది చెప్పలేకపోవచ్చు. కానీ, చేసి చూపించగలం అని నేను బాగా నమ్ముతా. అది సుజిత్‌లో నాకు కనిపించింది. అందుకే సుజిత్‌కి నేను ఒక మాట ఇచ్చాను. ఓజీ సీక్వెల్ గానీ, ప్రీక్వెల్ గానీ మనం చేస్తున్నాం అని. ఒక ఫ్లాప్ సినిమా ఎంత నిరుత్సాహ పరుస్తుందో నాకు తెలుసు. కానీ ఓజీ సినిమా నాకు మళ్లీ సినిమా చేయాలి అనే బలాన్ని ఇచ్చింది” అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
అలాంటి గొంతు లేనందుకు
“కాబట్టి నాకు ఉన్న సమయంలో ఓజీ యూనివర్స్ కంటిన్యూ చేయాలి అనుకుంటున్నాను. ముఖ్యంగా తమన్ ఇచ్చిన సంగీతం నన్ను తమ్ముడు సినిమా రోజులకి తీసుకువెళ్లింది. అలాగే అర్జున్ దాస్ అతన్ని చూసినపుడు నేను చాలా ఫీల్ అవుతాను. అలాంటి గొంతు నాకు లేదు అని. ఓజీ యూనివర్స్‌లో భాగం అయిన ప్రతి ఒకరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు” ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.
సంబంధిత కథనం
