




Best Web Hosting Provider In India 2024

అమెరికాలో దుండగుడి కాల్పులు – హైదరాబాద్ విద్యార్థి మృతి, శోకసంద్రంలో కుటుంబం..!
అమెరికాలో మరో తెలుగు విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. డల్లాస్ లో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో పోలే చంద్రశేఖర్ చనిపోయాడు. కుమారుడి మృతిపై తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.
అమెరికాలో మరో విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో హైదరాబాద్ లోని ఎల్బీనగర్ ప్రాంతానికి చెందిన పోలే చంద్రశేఖర్(27) మృతి చెందాడు. 2023లో బీడీఎస్ పూర్తి చేసిన చంద్రశేఖర్…. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. కుమారుడి మృతిపై సమాచారం తెలిసిన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. తమ కుమారుడి మృతదేహాన్ని హైదరాబాద్ కు తరలించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాట్లు చేయాలని కోరారు.
ఈ సంఘటన గురించి చంద్రశేఖర్ తల్లి సునీత ఏఎన్ఐతో మాట్లాడారు. “నా కొడుకు రెండేళ్ల క్రితం అమెరికా వెళ్లాడు. అతను ఇక్కడ దంత వైద్యుడు అయ్యాడు. తన పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేయడానికి అక్కడికి వెళ్ళాడు. అతని స్నేహితుడి తల్లిదండ్రుల ద్వారా మాకు సమాచారం తెలిసింది. నల్లజాతీయుడని అతన్ని కాల్చి చంపారని మాకు తెలిసింది. నా కొడుకు మృతదేహాన్ని వీలైనంత త్వరగా ఇంటికి తీసుకురావాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను అభ్యర్థిస్తున్నాం” అని చెప్పారు.
చంద్రశేఖర్ మృతి పట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శనివారం వారి కుటుంబాన్ని కలిసి సంతాపాన్ని వ్యక్తం చేశారు. దుండగుల కాల్పుల్లో చంద్రశేఖర్ మృతిచెందటం విషాదమన్నారు. విద్యార్థి మృతదేహాన్ని తిరిగి తీసుకురావడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.
“బీడీఎస్ పూర్తి చేసి, పై చదువుల కోసం అమెరికా (డల్లాస్) వెళ్ళిన ఎల్బీనగర్ కు చెందిన దళిత విద్యార్థి చంద్రశేఖర్ పోలే ఈరోజు తెల్లవారు జామున దుండగులు జరిపిన కాల్పులో మృతి చెందటం విషాదకరం. ఉన్నత స్థాయిలో ఉంటాడనుకున్న కొడుకు ఇక లేడు అన్న విషయం తెలిసి తల్లిదండ్రులు పడుతున్న అవేదన చూస్తే గుండె తరుక్కు పోతున్నది. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని చంద్ర శేఖర్ పార్థీవ దేహాన్ని వీలైనంత త్వరగా స్వస్థలానికి తరలించేందుకు కృషి చేయాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం” అని హరీశ్ రావ్ ట్వీట్ చేశారు.
సంబంధిత కథనం
టాపిక్
