




Best Web Hosting Provider In India 2024
Rain alert : చెన్నై నుంచి దిల్లీ వరకు.. దేశవ్యాప్తంగా భారీ వర్షాలు
దేశవ్యాప్తంగా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై నుంచి దిల్లీ వరకు వానలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో వివిధ ప్రాంతాలకు ఐఎండీ వర్ష సూచనలను జారీ చేసింది. పూర్తి వివరాలు..
భారత వాతావరణ శాఖ (ఐఎండీ) దేశంలోని పలు ప్రాంతాలకు తాజా వాతావరణ అంచనాలు, హెచ్చరికలను జారీ చేసింది. ముఖ్యంగా దిల్లీలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, హిమాచల్‌లో భారీ వర్షాలు, అరేబియా సముద్రంలో ఏర్పడుతున్న ‘శక్తి’ తుపాను నేపథ్యంలో మహారాష్ట్రకు ప్రమాద హెచ్చరికలు ఉన్నాయి. అటు చెన్నైలో కూడా వర్షాలు కురుస్తున్నాయి.
దిల్లీ, ఉత్తర భారత్‌లో వర్షాలు..
ఐఎండీ అంచనా ప్రకారం.. దిల్లీలో ఆదివారం నుంచి అక్టోబర్ 7 వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. అక్టోబర్ 6 కోసం యెల్లో అలర్ట్ జారీ అయింది. అయితే తీవ్రమైన వాతావరణ హెచ్చరికలు ఏమీ లేవు!
బిహార్, ఉత్తరప్రదేశ్: ఈశాన్య బిహార్, తూర్పు ఉత్తరప్రదేశ్‌లలో నైరుతి రుతుపవనాల ప్రభావం చురుకుగా ఉంది. ఇక్కడ శుక్ర, శనివారాల్లో 210 మిల్లీమీటర్లకు పైగా అత్యంత భారీ వర్షపాతం నమోదైంది. రాబోయే రెండు మూడు రోజుల్లో ఈ ప్రాంతంలోని పలు జిల్లాల్లో మరింత వర్షం కురిసే అవకాశం ఉంది. ఈ వారం బిహార్‌లో అధిక వర్షపాతం శివాన్, గోపాల్‌గంజ్, తూర్పు చంపారన్, భోజ్‌పూర్, రోహతాస్ జిల్లాల్లో, ముఖ్యంగా ఉత్తర, వాయువ్య ప్రాంతాలలో నమోదైంది.
హిమాచల్ ప్రదేశ్‌లో వానలు..
సెప్టెంబరు చివరి నాటికి నైరుతి రుతుపవనాలు నిష్క్రమించిన హిమాచల్ ప్రదేశ్‌లో కూడా ఆదివారం నుంచి వర్షాలు మొదలవుతాయి. శిమ్లా వాతావరణ కేంద్రం అక్టోబర్ 6 కోసం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆరు జిల్లాల్లో – చంబా, కాంగ్రా, కులు, మండి, సిర్మౌర్, లాహౌల్, స్పితి – వడగళ్ల వాన, భారీ నుంచి అతి భారీ వర్షం, ఉరుములు, మెరుపులు, గంటకు 40-50 కి.మీ వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది.
అలాగే, ఆదివారం నాడు రాష్ట్రంలోని మొత్తం 12 జిల్లాల్లో భారీ వర్షం, ఉరుములు, మెరుపులు, 30–40 కి.మీ వేగంతో గాలుల కోసం యెల్లో అలర్ట్ ఉంది. అక్టోబర్ 7 కోసం ఉనా, చంబా, కాంగ్రా, కులు, శిమ్లా, సోలన్, సిర్మౌర్, కిన్నౌర్, లాహౌల్, స్పితి జిల్లాలకు కూడా యెల్లో అలర్ట్ జారీ చేశారు. అక్టోబర్ 6 నుంచి 8 వరకు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అడపాదపా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
మహారాష్ట్రపై ‘శక్తి’ తుపాను ప్రభావం..
అరేబియా సముద్రంలో ‘శక్తి‘ అనే తుపాను అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో మహారాష్ట్రకు ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. ఈ తుపాను కారణంగా తీర ప్రాంతాల్లో, లోపలి జిల్లాల్లో భారీ వర్షాలు, బలమైన గాలులు, సముద్రం అల్లకల్లోలంగా మారే ప్రమాదం ఉంది. ముంబై, థానే, పాల్ఘర్, రాయ్‌గఢ్, రత్నగిరి, సింధుదుర్గ్ జిల్లాలకు ఈ హెచ్చరికలు వర్తిస్తాయి. అధికారులు ఇప్పటికే విపత్తు నిర్వహణ వ్యవస్థలను అప్రమత్తం చేసి, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు సిద్ధం చేశారు.
పశ్చిమ బెంగాల్‌కు రెడ్ అలర్ట్..
హిమాలయాల దిగువన ఉన్న పశ్చిమ బెంగాల్‌లో అల్పపీడన ప్రాంతం ఏర్పడటం వల్ల సోమవారం ఉదయం వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. డార్జిలింగ్, కాలింపాంగ్, కూచ్ బెహర్, జల్పాయ్‌గురి, అలిపుర్‌ద్వార్ జిల్లాలకు ఐఎండీ రెడ్ వార్నింగ్ జారీ చేసింది. ఈ జిల్లాల్లోని ఒకటి లేదా రెండు ప్రాంతాల్లో ఆదివారం వరకు అత్యంత భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది, అలిపుర్‌ద్వార్‌లో సోమవారం ఉదయం వరకు ఇది కొనసాగవచ్చు. ఈ జిల్లాల్లోని ఇతర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడవచ్చు.
తమిళనాడులో వర్షాల హెచ్చరిక..
తమిళనాడులో ఉపరితల ఆవర్తనం కారణంగా అనేక జిల్లాలకు ఐఎండీ వాతావరణ హెచ్చరిక జారీ చేసింది. దీని ప్రభావంతో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. హెచ్చరిక జారీ చేసిన జిల్లాల్లో ముఖ్యంగా చెన్నై, తిరువళ్లూరు, చెంగల్పట్టు, కాంచీపురం, రాణిపేట్, వెల్లూరు, తిరుపత్తూరు, కృష్ణగిరి, ధర్మపురి, కడలూరు, విలుప్పురం, పెరంబలూరు, తంజావూరు, నాగపట్టిణం, తిరువారూరు, పుదుక్కోట్టై, కళ్లకురిచ్చి, సేలం, తిరువణ్ణామలై వంటి జిల్లాలు ఉన్నాయి.
వీటితో పాటు ధర్మపురి, దిండిగల్, ఈరోడ్, కరూర్, కృష్ణగిరి, మధురై, నమక్కల్, పెరంబలూరు, పుదుక్కోట్టై, సేలం, శివగంగై, తిరుచిరాపల్లి, తిరుపత్తూరు, తిరువణ్ణామలై, వెల్లూరు జిల్లాల్లోనూ వర్షాలు ఉండొచ్చని చెన్నై వాతావరణ కేంద్రం తెలిపింది.
సంబంధిత కథనం
Best Web Hosting Provider In India 2024
Source link
