అమెరికాలో భారత సంతతి వ్యక్తి దారుణ హత్య! ‘మిత్రమా’ అని పిలిచిన వెంటనే కాల్పులు..

Best Web Hosting Provider In India 2024


అమెరికాలో భారత సంతతి వ్యక్తి దారుణ హత్య! ‘మిత్రమా’ అని పిలిచిన వెంటనే కాల్పులు..

Sharath Chitturi HT Telugu

అమెరికాలో భారత సంతతి వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు. ఆయన పేరు రాకేష్ ఎహాగబన్. ఆయన ఒక మోటెల్​ మేనేజర్​. మోటెల్​ బయట జరుగుతున్న గొడవను చూసేందుకు వెళ్లిన ఆయన ‘అంతా బాగానే ఉందా మిత్రమా’ అని ప్రశ్నించిన వెంటనే దుండగుడు కాల్పులు జరిపాడు!

అమెరికా పోలీసులు

అమెరికా పిట్స్‌బర్గ్‌లో భారత సంతతికి చెందిన మోటెల్ మేనేజర్ దారుణ హత్యకు గురయ్యారు. రాబిన్సన్ టౌన్‌షిప్‌లోని ఒక మోటెల్‌ పార్కింగ్ స్థలంలో జరుగుతున్న గొడవ గురించి తెలుసుకుని బయటకు వెళ్లిన 50 ఏళ్ల రాకేష్ ఎహాగబన్​ని దుండగుడు కాల్చి చంపాడు. శుక్రవారం జరిగిన ఈ ఘటనలో రాకేష్ తలకు అతి దగ్గరగా కాల్పులు జరపడంతో.. ఆయన అక్కడికక్కడే మరణించారు.

ఈ ఘటనకు పాల్పడిన నిందితుడిని 37 ఏళ్ల స్టాన్​లీ యూజీన్ వెస్ట్​గా గుర్తించారు. అతనిపై క్రిమినల్ హత్య, హత్యాయత్నం, నిర్లక్ష్యంగా మరొక వ్యక్తికి ప్రమాదం కలిగించడం వంటి అభియోగాలు నమోదు చేశారు.

అసలేం జరిగింది?

పోలీసుల కథనం ప్రకారం.. వెస్ట్ తనతో పాటు ఉంటున్న ఒక మహిళ, చిన్నారితో కలిసి దాదాపు రెండు వారాలుగా ఆ మోటెల్‌లో బస చేస్తున్నాడు.

కాగా పార్కింగ్ స్థలంలో ఆ మహిళతో గొడవపడిన తర్వాత, వెస్ట్ ఆమెపై కాల్పులు జరిపాడు. ఆ సమయంలో మోటెల్ మేనేజర్ రాకేష్ ఎహాగబన్ పరిస్థితిని తెలుసుకోవడానికి బయటకు వచ్చారు.

రాకేష్ ఎహాగబన్ నిందితుడిని చూసి, “అంతా బాగానే ఉందా, మిత్రమా?” అని అడిగారు. ఆ వెంటనే నిందితుడు రాకేష్‌పై కాల్పులు జరిపాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు వెస్ట్, రాకేష్ వైపు నడుచుకుంటూ వచ్చాడు. అతనికి ఒక అడుగు దూరంలోకి రాగానే, తుపాకీ పైకెత్తి రాకేష్ తలపై కాల్చి చంపాడు. ఈ దృశ్యమంతా మోటెల్‌లోని సీసీటీవీ కెమెరా ఫుటేజీలో రికార్డయింది.

నిందితుడు వెస్ట్, వాదన తర్వాత తనతో ఉన్న మహిళపై కాల్పులు జరపడంతో పరిస్థితి తీవ్రమైంది. ఆ మహిళ తన చిన్నారితో కలిసి నల్లటి సెడాన్ కారులో కూర్చుని ఉండగా, వెస్ట్ డ్రైవర్ వైపు తలుపు వద్దకు వచ్చి కారుపై కాల్పులు జరిపాడు. దీంతో కారు అద్దం పగిలింది.

ఆ దాడిలోనే ఆ మహిళ తీవ్రంగా గాయపడింది. అయితే, అప్పటికే మధ్యాహ్నం 1 గంట (స్థానిక సమయం) కావడంతో, ఆమె ఎలాగో ఆ కారును అక్కడికి దగ్గరిలోని డిక్ కెర్నిక్ టైర్ అండ్​ ఆటో సర్వీస్ సెంటర్‌కు నడుపుకుంటూ వెళ్లగలిగింది. పోలీసులు అక్కడికి చేరుకునేలోపు ఆమెను ఆసుపత్రికి తరలించారు. చివరి సమాచారం ప్రకారం ఆమె పరిస్థితి విషమంగా ఉంది.

వెనుక సీటులో ఉన్న చిన్నారికి ఎలాంటి గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు. మహిళపై జరిగిన ఈ దాడి కారణంగానే మోటెల్ మేనేజర్ రాకేష్ ఎహాగబన్ బయటకు వచ్చి, నిందితుడు వెస్ట్‌ను ప్రశ్నించారు. దాంతో, నిందితుడు రాకేష్‌పై కాల్పులు జరిపి చంపేశాడని అలెఘేనీ కౌంటీ సూపరింటెండెంట్ క్రిస్టోఫర్ తెలిపారు.

నిందితుడిపై కాల్పులు..

రాకేష్‌ను కాల్చి చంపిన తర్వాత, నిందితుడు “ఏమీ జరగనట్లుగా ఉదాసీనంగా నడుచుకుంటూ వాహనం వద్దకు వెళ్లి దాన్ని నడుపుకుంటూ వెళ్లిపోయాడు,” అని కేసు ఫిర్యాదులో పేర్కొన్నారు.

అయితే, నిందితుడిని ట్రాక్ చేసి, అతడి వాహనాన్ని పోలీసులు సమీపించగా, నిందితుడు మళ్లీ కాల్పులు జరిపాడు. ఆ కాల్పుల్లో పిట్స్‌బర్గ్ డిటెక్టివ్‌కి కాలుకు గాయమైంది. దీంతో అప్రమత్తమైన అధికారులు తిరిగి కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో వెస్ట్‌కి కూడా పలుసార్లు బుల్లెట్లు తగిలాయని పోలీసులు తెలిపారు.

ఈ ఘటనపై పిట్స్‌బర్గ్ బ్యూరో ఆఫ్ పోలీస్ యాక్టింగ్ చీఫ్ మార్టిన్ డెవిన్ ఒక ప్రకటన విడుదల చేశారు. “శుక్రవారం ఈస్ట్ హిల్స్‌లో జరిగిన ఈ ఘటనలో కాల్పులకు గురైన డిటెక్టివ్ తన కుటుంబంతో కలిసి ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. బ్యూరోలోని తోటి అధికారులు. సిబ్బంది ఆయనకు పూర్తి మద్దతు ఇస్తున్నారు. ప్రస్తుతం ఆయన కుటుంబం గోప్యతను కోరుతోంది,” అని తెలిపారు.

“యుపీఎంసీ ప్రెస్బిటేరియన్ హాస్పిటల్‌లోని వైద్యులు, నర్సులు అందించిన అద్భుతమైన సంరక్షణకు, అలాగే హింసాత్మక నేరాలకు వ్యతిరేకంగా అలెఘేనీ కౌంటీని సురక్షితంగా ఉంచడానికి కృషి చేస్తున్న మా స్థానిక లా ఎన్‌ఫోర్స్‌మెంట్ భాగస్వాములందరికీ పిట్స్‌బర్గ్ బ్యూరో ఆఫ్ పోలీస్ కృతజ్ఞతలు తెలియజేస్తోంది,” అని డెవిన్ పేర్కొన్నారు.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.

Best Web Hosting Provider In India 2024


Source link