




Best Web Hosting Provider In India 2024

మెుబైల్ ఫోన్ వాడుతూ డ్రైవింగ్ చేసేవారికి సజ్జనార్ వార్నింగ్!
హైదరాబాద్ సీపీగా బాధ్యతలు స్వీకరించిన సజ్జనార్ పలు కీలక చర్యలు తీసుకుంటున్నారు. నగరంలో శాంతి పరిరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. తాగి వాహనం నడపొద్దని, డ్రైవింగ్‌లో మెుబైల్ ఫోన్ వాడొద్దని చెప్పారు.
హైదరాబాద్ సీపీ వాహనదారులకు వార్నింగ్ ఇచ్చారు. ఇటీవలే డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో మందుబాబులకు హెచ్చరికలు జారీ చేశారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే జైల్లో ఊచలు లెక్కపెట్టాల్సి వస్తుందన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌పై తమ అధికారిక ట్విట్టర్ ఎక్స్ వేదికగా సీపీ సజ్జనార్ ట్వీట్ చేశారు.
మద్యం తాగి వాహనాలు నడిపి రోడ్డు ప్రమాదాలకు కారణమై మీ జీవితానికి మీరు వెలకట్టలేని జరిమానా విధించుకోవద్దని సజ్జనార్ సూచించారు. డ్రంకెన్ డ్రైవ్ మీతోపాటుగా ఎన్నో కుటుంబాలకు తీరని శోకాన్ని మిగుల్చుతుందని చెప్పారు. తాగి డ్రైవింగ్ చేసే ముందు ఒకసారి ఆలోచించాలని హితవు పలికారు. మద్యం తాగి వాహనం నడిపితే.. మూల్యం తప్పదని, బాధ్యత గల పౌరులుగా మద్యం తాగి వాహనం నడపకండని తెలిపారు.
తాజాగా వాహనదారులకు మరో అంశంలో కూడా వార్నింగ్ ఇచ్చారు సజ్జనార్. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్లు లేదా ఇయర్‌ఫోన్‌లు ఉపయోగించే డ్రైవర్లకు నగర ట్రాఫిక్ పోలీసులు కఠినమైన హెచ్చరిక జారీ చేశారు. ఈ చర్య ప్రమాదకరమైనది, చట్ట ప్రకారం శిక్షార్హమైనది అని పేర్కొన్నారు. X పోస్ట్‌లో హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ ఈ మేరకు సూచించారు.
‘ఆటో-రిక్షా, క్యాబ్, బైక్ టాక్సీ ఆపరేటర్లతో సహా చాలా మంది డ్రైవర్లు ప్రయాణంలో ఉన్నప్పుడు వీడియోలు చూడటం లేదా ఇయర్‌ఫోన్‌లు ఉపయోగించడం చేస్తున్నారని పేర్కొన్నారు. ‘ఇది ప్రమాదకరమైనది, శిక్షార్హమైన నేరం. అటువంటి ఉల్లంఘనదారులపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారు.’ అని ఆయన హెచ్చరించారు. తోటి ప్రయాణికుల భద్రత అత్యంత ముఖ్యమని తెలిపారు. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఇటువంటి ప్రయాణికుల గురించి నివేదించాలన్నారు. ప్రజల భద్రత కోసం డ్రైవింగ్ చేసేటప్పుడు నియమాలను పాటించాలని విజ్ఞప్తి చేశారు.
టాపిక్
