




Best Web Hosting Provider In India 2024

తీగ లాగితే డొంక కదిలింది…! ఫేక్ నోట్ల ముఠా అరెస్ట్ – కామారెడ్డి పోలీసుల భారీ ఆపరేషన్
నకిలీ నోట్ల అంతర్రాష్ట్ర ముఠాను కామారెడ్డి జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. 12 మందిలో 8 మందిని అరెస్ట్ చేశారు. పశ్చిమబెంగాల్, బీహార్, యూపీ, చత్తీస్ ఘడ్ రాష్ట్రాలతో ఈ కేసు లింక్ అయి ఉందని జిల్లా ఎస్పీ తెలిపారు.
తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో నకిలీ కరెన్సీ రాకెట్ ను పోలీసులు ఛేదించారు. 12 మంది సభ్యులతో కూడిన అంతర్రాష్ట్ర ముఠా దందాను గుట్టురట్టు చేశారు. ప్రస్తుతం 8 మందిని అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర వెల్లడించారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితులను బీహార్, పశ్చిమ బెంగాల్ సహా పలు రాష్ట్రాల్లో అరెస్టు చేసినట్లు ప్రకటించారు.
కామారెడ్డిలోని ఓ మద్యం దుకాణంలోని క్యాషియర్ సెప్టెంబర్ 24వ తేదీన ఓ కస్టమర్ రూ. 500 నోట్లు ఇచ్చాడు. అయితే ఇవి నకిలీవిగా ఉన్నట్లు అనుమనించిన క్యాషియర్… పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో సీన్ లోకి పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. దర్యాప్తు ప్రారంభించి… సెప్టెంబర్ 24వ తేదీన నోట్లు ఇచ్చిన సిద్దాగౌడ్ అనే వ్యక్తిని గుర్తించారు.
తమదైన శైలిలో పోలీసులు విచారించటంతో… సిద్ధాగౌడ్ అసలు విషయాలను బయటపెట్టాడు. సులభంగా డబ్బు సంపాదించే ప్రయత్నంలో అతను నకిలీ కరెన్సీ రాకెట్లో పాల్గొన్నట్లు తెలిపారు. బెంగాల్ కు చెందిన వ్యక్తి ద్వారా ఈ వ్యవహారం నడుస్తుందని చెప్పుకొచ్చాడు.
జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలుగా ఏర్పడిన పోలీసులు… పశ్చిమ బెంగాల్ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. నకిలీ కరెన్సీ నోట్ల రాకెట్ జాడను చేధించారు. మొత్తం ఎనిమిది మందిని అరెస్టు చేశాయి.
అక్టోబర్ 3న నలుగురిని జైలుకు పంపగా… మరో నలుగురు నిందితులను శనివారం జైలుకు పంపారు. మిగిలిన నలుగురిని త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని జిల్లా ఎస్పీ వెల్లడించారు.
నిందితుల నుంచి రూ.3 లక్షలకు పైగా నకిలీ కరెన్సీ, రూ.15,300 అసలైన కరెన్సీ, రూ.8 వేలకు పైగా పాక్షికంగా ముద్రించిన నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు విచారణ కొనసాగుతోంది.
సంబంధిత కథనం
టాపిక్
