




Best Web Hosting Provider In India 2024

వేములవాడ రాజన్న దర్శనం తాత్కాలికంగా నిలిపివేత.. భీమేశ్వరాలయంలో మెుక్కులు.. భక్తుల నిరసన!
వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో దర్శనం తాత్కాలికంగా నిలిపివేసిన విషయం తెలిసిందే. ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. దీనిపై భక్తులు, బీజేపీ నాయకుల నుండి నిరసనలు వ్యక్తమయ్యాయి. భీమేశ్వరాలయం వద్ద అధికారులు ప్రత్యామ్నాయ సౌకర్యాలను ఏర్పాటు చేశారు.
వేములవాడ రాజన్న ఆలయంలో భక్తులకు దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేయడంపై వ్యతిరేకత వ్యక్తమైంది. ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులు చేస్తున్నారు అధికారులు. ఇందులో భాగంగా ఆదివారం నుండి భక్తులకు తాత్కాలికంగా దర్శనాలను నిలిపివేశారు. రాజరాజేశ్వర స్వామి మందిరం అనుబంధ ఆలయమైన భీమేశ్వరాలయంలో ప్రత్యామ్నాయ సౌకర్యాలను ఏర్పాటు చేశారు.
ప్రధాన ఆలయంలో ఏకాంత సేవలు యథావిధిగా కొనసాగుతాయి. అయితే ఇకపై భీమేశ్వరాలయంలో కోడెమొక్కు, అభిషేకాలు, కుంకుమపూజ, నిత్య కల్యాణం, చండీయాగం వంటి పూజలు నిర్వహించనున్నారు. ఆలయ కార్యనిర్వాహక అధికారిణి రమాదేవి మాట్లాడుతూ, ఆలయాన్ని మూసివేయడం లేదని స్పష్టం చేశారు. ‘పనులు జరుగుతున్న సమయంలో భక్తులు భీమేశ్వరాలయంలో అన్ని పూజలు కొనసాగించవచ్చు.’ అని ఆమె పేర్కొన్నారు.
బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి నేతృత్వంలో బీజేపీ కార్యకర్తలు ఆదివారం ఆలయం వెలుపల నిరసన ప్రదర్శన నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. భీమేశ్వరాలయంలో రాజన్న పూజలు ఎలా నిర్వహిస్తారని గోపి ప్రశ్నించారు. భక్తులకు రాజరాజేశ్వర స్వామి దర్శనాన్ని నిరాకరించకూడదని చెప్పారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఈ నిర్ణయాన్ని ఖండించారు.
భీమేశ్వరాలయం వద్ద ప్రత్యామ్నాయ ఏర్పాట్లను పరిశీలించిన భారత రాష్ట్ర సమితి నాయకులు కూడా పనులు పూర్తి కాకముందే అధికారులు దర్శన ఏర్పాట్లను ప్రకటించడాన్ని విమర్శించారు.
ఆలయం మూసివేశారనే బీజేపీ ఆరోపణలను ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తోసిపుచ్చారు. శృంగేరి పీఠాధిపతి సలహా మేరకు విస్తరణ పనులు జరుగుతున్నాయని, భక్తులకు ప్రత్యామ్నాయ సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. గర్భగుడిలో మండపాలు 64 నుండి 70 స్తంభాల నిర్మాణం కోసం పెద్ద నిర్మాణ సామగ్రిని ఉపయోగిస్తున్నారన్నారు. భక్తులను లోపలికి అనుమతిస్తే భద్రతా సమస్యలు తలెత్తుతాయని వివరించారు. విస్తరణ పనులు కొనసాగుతున్నప్పటికీ రాజన్నకు పూజలు కొనసాగుతాయి అని అన్నారు. ఆలయ రక్షణ కమిటీ, హిందూ సంస్థలు, భక్తుల అభిప్రాయాలను ఇప్పటికే తీసుకున్నామని చెప్పారు.
టాపిక్
