
Best Web Hosting Provider In India 2024

ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారాన్ని తినడం ఎంత ముఖ్యమో వ్యాయామం చేయడం, శారీరక శ్రమ చేయడమూ అంతే ముఖ్యం. అయితే కొంత మందికి వ్యాయామాలు చేయడం అంటే ఏదో బద్ధకంగా అనిపిస్తుంది. అదే పనిగా నడవడం, కసరత్తులు చేయడం లాంటివి బోరింగ్‌గా అనిపిస్తాయి. ఇవి బోరింగ్ గా కాకుండా సరదా సరదాగా ఉండాలంటే కొన్ని పనులు చేయవచ్చు. అవేంటంటే..
ట్రెండింగ్ వార్తలు
1. వాకింగ్ చేసినప్పుడు ఒక్కరే ఎక్కువ దూరం నడుచుకుంటూ వెళ్లడం అనేది నిజంగా బోరింగ్‌గానే అనిపిస్తుంది. అలాంటప్పుడు ఫోన్‌లో చక్కగా పాటలు పెట్టుకుని, ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వాటిని ఎంజాయ్ చేస్తూ నడకను ఆస్వాదించండి. వీలైనంత వేగంగా నడిచే ప్రయత్నం చేయండి.
2. ఎవరైనా స్నేహితులు దొరికితే కచ్చితంగా కలిసి వాకింగ్‌కి వెళ్లే ప్రయత్నం చేయండి. సమానమైన నడక వేగం ఉన్న వారినే తోడు తీసుకెళ్లండి. లేదంటే ఒకరు ముందు నడుస్తూ, మరొకరు వెనక నడుస్తూ ఉంటే విరామాలు తీసుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా ఇద్దరు ముగ్గురు కలిసి ఇలాంటివి చేయడం వల్ల సరదా సరదాగా కబుర్లు చెప్పుకుంటూనే పని పూర్తయిపోతుంది.
3. కొంత మందికి వాకింగ్ ట్రాక్ చుట్టూ అక్కడక్కడే పది రౌండ్లు వేయడం చాలా కష్టంగా అనిపిస్తుంది. అలాంటి వారు మీరు నడిచినంత దూరం ఖాళీగా ఉండే రోడ్లను ఎంచుకోండి. అక్కడి వరకు వెళ్లిన తర్వాత మళ్లీ వెనక్కి తిరిగి రావాల్సిందే. కాబట్టి ఎక్కువ దూరం నడవడానికి ఆస్కారం ఉంటుంది.
4. ఒక దగ్గర వ్యాయామాలు చేయడానికి అర గంట, గంట సమయం వెచ్చించడానికి చాలా మందికి బోరింగ్‌గా ఉంటుంది. అలాంటి వారు టెన్నిస్, షటిల్ లాంటి ఆటలను ఎంచుకోండి. ఆటలో పడి గంట సమయం తేలికగా గడిచిపోతుంది. వీటిలో శారీరకంగా వేగంగా కదలాల్సి ఉంటుంది. కాబట్టి బోలెడంత శారీరక శ్రమ చేయడమూ పూర్తయిపోతుంది.
5. ఎప్పుడూ ఒకేలాంటి వ్యాయామాలు చేయడం అనేది కొంత మందికి నచ్చకపోవచ్చు. చేయాలని అనిపించకపోవచ్చు. అలాంటి వారు వారం పది రోజులకు ఒకసారి వాటిని మార్చుకుంటూ ఉండాలి. కొత్త కొత్త వ్యాయామాలు చేయడం వల్ల చేయాలన్న ఉత్సుకత వారిలో పెరుగుతుంది.
6. కాస్త చిన్న వయసుల్లో ఉన్న వారు హూలా హూపింగ్, ఏరోబిక్స్, జుంబా డ్యాన్స్… లాంటి హుషారైన వాటిని ఎన్నుకోవచ్చు. ఇవి సరదా సరదాగా డ్యాన్స్ చేస్తున్నట్లుగా ఉంటాయి. వ్యాయామమూ పూర్తయిపోతుంది. అయితే ఇలాంటివి చేసేప్పుడు దుస్తులు, పాదరక్షలూ కూడా నప్పేవి ధరించాలి. కాబట్టి వ్యాయామాలు, నడకపై నిరాశక్తతతో ఉన్న వారు ఇవన్నీ ప్రయత్నించి చూడండి.