Best Web Hosting Provider In India 2024

Seasonal Migraine: కాలం మారే సమయంలో వచ్చే సీజనల్ మైగ్రేన్ చాలా ఇబ్బంది పెడుతుంది. దాన్నుంచి బయట పడాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
వాతావరణ, సీజనల్ మార్పుల్లాంటివి మన ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపిస్తుంటాయి. కొన్నిసార్లు వ్యాధుల బారిన పడిపోతుంటాం. అయితే కొంత మందికి సీజన్ మారేప్పుడు మైగ్రేన్ ఎక్కువగా ఇబ్బంది పెడుతుంటుంది. దీన్నే సీజనల్ మైగ్రేన్ అనీ పిలుస్తూ ఉంటారు. అంటే కాలం మారుతున్నప్పుడు చలి, గాలి, వాతావరణం లాంటివి మన తల నరాలపై ప్రభావం చూపుతాయి. అప్పుడే ఇవి వస్తుంటాయి. ఇలాంటి వారు కొన్ని పనులు చేయడం ద్వారా ఈ సీజనల్ మైగ్రేన్స్ నుంచి కాస్త ఉపశమనం పొందవచ్చు.
ట్రెండింగ్ వార్తలు
ఒత్తిడిని తగ్గించుకోవాల్సిందే:
ఇటీవల కాలంలో అంతా ఉరుకుల పరుగుల మీద జీవనం సాగిస్తున్నారు. క్షణం తీరిక లేకుండా పరుగులు పెడుతూ ఉంటున్నారు. ఈ క్రమంలో పనులు ఎక్కువ అయిపోతే తీవ్రంగా ఒత్తిడికి లోనవుతున్నారు. ఇలాంటి వారిని మైగ్రేన్లు ఎక్కువగా ఇబ్బంది పెడతాయి. కాబట్టి ఈ సమస్యలు ఉన్న వారు వీలైనంత వరకు ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. సావదానంగా పనులు చేసుకునే జీవన విధానంలోకి మారాలి. అది అంత తేలికైన విషయం కాదు. కానీ ఎవరికి వారు ప్రయత్నించాల్సిందే.
తగినంత నీరు తాగాల్సిందే:
రోజుకు కనీసం ఎనిమిది గ్లాసుల వరకు నీరు తాగాలి. ఎలాంటి పరిస్థితులు ఉన్నా దీన్ని కచ్చితంగా అలవాటు చేసుకోవాలి. బయటకు వెళ్లేప్పుడైనా వాటర్ బాటిల్‌ని వెంట తీసుకెళ్లి టార్గెట్‌ని పూర్తి చేయాలి. మనం ఇలా హైడ్రేటెడ్‌గా ఉండటం వల్ల మైగ్రేన్లు కొంత వరకు అదుపు అవుతాయి.
సరిపడా నిద్ర పోవాల్సిందే:
నిద్ర ప్రణాళిక రోజూ కచ్చితంగా ఒకేలా ఉండేలా చూసుకోవాలి. ఏడు నుంచి తొమ్మిది గంటల పాటు కనీసం నిద్రపోవాలి. రోజూ ఒకే సమయంలో నిద్రపోవడం, ఒకే సమయానికి నిద్ర లేవడం అలవాటు చేసుకోవాలి. ఇది అటూ ఇటూ అయితే కూడా మైగ్రేన్లు తీవ్రతరం అవుతాయని గుర్తుంచుకోవాలి.
శబ్దాలకు దూరంగా ఉండాల్సిందే:
మన చుట్టూ ఉండే వాతావరణం ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. శబ్దాలు ఎక్కువ కాకుండా ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఎక్కువ కాంతి, ఎండ మీరు ఉండే చోటుకి రాకుండా చూసుకోవాలి. అందుకు అవసరం అనుకుంటే వెలుతురు లోపలికి రాకుండా చేసే మందపాటి కర్టెన్లను కిటికీలకు అమర్చుకోవాలి. అలాగే మంచి సువాసన వచ్చే ఎసెన్షియల్ నూనెల్ని స్ప్రే చేసుకోవాలి. అందువల్ల ఆ ఇంట్లో మీరు చాలా సౌకర్యవంతంగా ఉన్న భావన కలుగుతుంది. మైగ్రేన్ల బాధ తగ్గుతుంది.
ఇవన్నీ చేసినా కూడా పార్శపు తలనొప్పి ఎక్కువగానే ఉంటోంది అనుకున్నప్పుడు వైద్యుడిని సంప్రదించాలి. వారి సిఫార్సు చేసిన మందుల్ని వాడుకోవాలి.