Best Web Hosting Provider In India 2024

Tirumala Rush: తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగి పోయింది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామి వారి దర్శనం కోసం భక్తులు తిరుమలకు క్యూ కడుతున్నారు. సాధారణ భక్తులతో పాటు విఐపిలు కూడా పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు.
ట్రెండింగ్ వార్తలు
వైకుంఠ ఏకాదశి రోజు స్వామి వారి దర్శనం కోసం సుప్రింకోర్టు నుంచి 7గురు న్యాయమూర్తలు వస్తున్నట్లు టీటీడీ అధికారులకు సమాచారం అందింది. ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి 35 మంది జడ్జిలు వస్తున్నట్లు ప్రోటోకాల్ అధికారులకు సమాచారం అందింది.
మరోవైపు సర్వదర్శనం టోకెన్ల కోసం భక్తులు బారులు తీరారు. 26వ తేదీ దర్శనాల కోసం ప్రస్తుతం టోకెన్లు జారీ చేస్తున్నారు. నారాయణ గిరి అతిథి గృహం వరకు భక్తులు బారులు తీరారు. సర్వదర్శనం క్యూలైన్లలో ఉన్న భక్తులకు రాత్రికి స్వామి వారి దర్శనం లభించే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు వైకుంఠ ఏకాదశి సందర్భంగా టోకెన్లు లేని వారిని క్యూ లైన్లలోకి అనుమతించరని టీటీడీ స్పష్టం చేసింది. ఇప్పటికే 26వ తేదీ వరకు టోకెన్లు జారీ చేశారు.
తిరుమలలో పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాన్ని భక్తులను అనుమతించనున్నారు. జనవరి 1వ తేదీ వరకు ఈ దర్శనాలకు అనుమతిస్తామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు.
వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామి వారి దర్శనం కోసం నలుగురు మంత్రులు,ఏపి అసెంబ్లి డిప్యూటి స్పీకర్ తిరుమల చేరుకున్నారు. నేటి రాత్రికి తిరుమలకు మరో 12 మంది మంత్రులు రానున్నారు. ఏపి అసెంబ్లీ స్పీకర్ తో పాటు దాదాపు 100మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తిరుమలకు రానున్నారు.
అటు తిరుమలలోనే పాలకమండలి సభ్యులు మకాం వేశారు.రాత్రికి తిరుమలకు మరో 18 మంది సభ్యులు చేరుకోనున్నారు. పెద్ద సంఖ్యలో విఐపిలు తరలి వస్తుండటంతో వారికి గదులు కేటాయించలేక సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు.
ఉత్తర ద్వార దర్శనం ద్వారా మోక్షం లభిస్తుందనే భక్తుల విశ్వాసంతో తిరుమల తరలి వస్తుండటంతో వారికి ఏర్పాట్లు చేయడానికి అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. విఐపిలకు వసతి గదులు కేటాయించలేక రిసెప్షన్ అధికారలు సతమతం అవుతున్నారు. వసతి గదుల కోసం టిటిడిపై ఒత్తిడి పెరుగుతోంది. పదిరోజుల్లో ఎప్పుడు స్వామి వారి దర్శనం చేసుకున్నా ఒకటే ఫలితం ఉంటుందని టీటీడీ ఆగమ పండితులు వివరిస్తున్నారు. వైకుంఠ ఏకాదశి దర్శనాల కోసం పోటీ పడుతుండటంతో ఏర్పాట్లకు ఇబ్బంది కలుగుతోంది.