Best Web Hosting Provider In India 2024

Telangana Congress Portest at Indira Park: పార్లమెంట్ నుంచి ఎంపీల సస్పెన్షన్ పై కేంద్రానికి వ్యతిరేకంగా విపక్ష కూటమి ‘ఇండియా’ దేశవ్యాప్త నిరసన ప్రదర్శనలు చేపట్టింది. ఇందులో భాగంగా… తెలంగాణ కాంగ్రెస్ ఇందిరా పార్క్ ధర్నాచౌక్ వద్ద కార్యక్రమం నిర్వహించింది. ఇందులో పార్టీకి సంబంధించిన కీలక నేతలు పాల్గొన్నారు. ధర్నాకు హాజరైన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ… కేంద్రంలోని బీజేపీపై మండిపడ్డారు.
ట్రెండింగ్ వార్తలు
పార్లమెంటుపై అగంతకులు చేసిన దాడి పట్ల సభలో చర్చించాలని అడిగిన ఇండియా కూటమి పార్లమెంటు సభ్యులను ఆ ప్రజాస్వామికంగా సస్పెన్షన్ చేయడాన్ని ఖండిస్తున్నట్లు చెప్పారు. భారత పార్లమెంటుపైన దాడి అంటే ప్రజాస్వామ్యం రాజ్యాంగంపైన జరిగిన దాడిగా భావించాలని అభిప్రాయపడ్డారు. భారత పార్లమెంటను రక్షించుకోలేని బిజెపి పాలకులు ఈ దేశాన్ని ఏమి కాపాడుతారని ప్రశ్నించారు. ఈ దేశ రక్షణను ప్రధాని మోదీ గాలికి వదిలేశారని విమర్శించారు. ప్రజాస్వామ్యానికి దేవాలయంగా భావించే పార్లమెంటుపై జరిగిన దాడిపై ప్రధానమంత్రి మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా సభలో సభ్యులు అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ప్రశ్నించిన సభ్యులను సస్పెండ్ చేయడం సిగ్గుచేటు అని మండిపడ్డారు.
“పార్లమెంట్ పై జరిగిన దాడితో ప్రపంచ దేశాల్లో భారత దేశ విలువ ఎంత దిగజారిందో దేశ ప్రజలు ఆలోచన చేయాలి. పార్లమెంట్ పై ఈనెల 13న అగంతకులు చేసిన దాడిపై ఇప్పటి వరకు ప్రధాని మోడీ హోంమంత్రి అమిత్ షా బిజెపి మంత్రులు మౌనంగా ఉండటం, అసలేమి దాడి జరగలేదన్నట్టుగా వ్యవహరించడం, అందుకు తగ్గట్టుగా వారి కార్యకలాపాలు ఉండటం బాధాకరం. దేశ చరిత్రలో కనీ విని ఎరగని విధంగా పార్లమెంటు సభ్యులను 141 మందిని సస్పెండ్ చేయడం దుర్మార్గం. ప్రశ్నిస్తే కేసులు, పార్లమెంట్ నుంచి బహిష్కరణ స్వేచ్ఛ, భావ ప్రకటన లేకుండా నియంత్రత్వ పోకడలతో మోడీ పాలన సాగుతుంది అనడానికి ఎంపీల సస్పెన్షనే నిదర్శనం. ఎన్నికల ముందు దేశ సరిహద్దుల్లో చిన్న చిన్న సంఘటన సృష్టించి దేశ ప్రజలలో భావోద్రేకం కల్పించి అధికారంలోకి రావడం తప్ప ఈ దేశాన్ని ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని కాపాడాలనే ఆలోచన బిజెపికి లేదు. ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే నాయకత్వంలో దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ లు రోడ్లపైకి వచ్చి ఈ దేశం కోసం మేము ఉన్నాం. మీకోసం నిలబడతామని బాసటగా నిలుస్తున్న విషయాన్ని ప్రజలు గుర్తించాలి. భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటంలో దేశభక్తులు, ప్రజాస్వామిక వాదులు, అభ్యుదయవాదులు పాల్గొనాలి” అని విజ్ఞప్తి చేశారు.