Best Web Hosting Provider In India 2024

IPS Officer Arrest : తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడెమీ జాయింట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్ ను సీసీఎస్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి భన్వర్ లాల్ ఫిర్యాదు మేరకు సీసీఎస్ పోలీసులు నవీన్ కుమార్ ను అరెస్ట్ చేశారు.హైదరాబాద్ బేగంపేట్ లో రిటైర్డ్ ఐఏఎస్ భన్వర్ లాల్ ఇంట్లో ఐపీఎస్ నవీన్ కుమార్ గత కొన్ని రోజులుగా అద్దెకు ఉంటున్నారు. ఈ క్రమంలోనే నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి తన ఇంటిని ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్ తన పేరుపై బదిలీ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని భన్వర్ లాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సీసీఎస్ పోలీసులు నవీన్ కుమార్ ను అదుపులో తీసుకున్నారు.
ట్రెండింగ్ వార్తలు
సీఐ సస్పెండ్
హైదరాబాద్ లో గీత దాటిన పోలీసులపై వేటు పడింది. పంజాగుట్ట సర్కిల్ ఇన్స్పెక్టర్ దుర్గారావు బుధవారం సస్పెండ్ అయ్యారు. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సోహెల్ ప్రజాభవన్ వద్ద చేసిన ఏక్సిడెంట్ నుంచి తప్పించి వేరే యువకుడిపై కేసు నమోదు చేసిన విషయంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి పంజాగుట్ట సీఐ దుర్గారావును సస్పెండ్ చేశారు. ఈ మేరకు సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈనెల 24న హైదరాబాద్ లోని ప్రజా భవన్ బారికేడ్లను కారుతో గుద్ది ధ్వంసం చేసిన కేసులో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సోహేల్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. అయితే ఈ ఘటన పై పంజాగుట్ట పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా ఈ కేసులో సీఐ దుర్గారావు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో నేరుగా వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ రంగంలోకి దిగి దర్యాఫ్తు చేపట్టారు. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడిని తప్పించేందుకు మాజీ ఎమ్మెల్యే ఇంట్లో డ్రైవర్ గా పనిచేసే మరో యువకుడిపై నేరాన్ని మోపరని వెస్ట్ జోన్ డీసీపీ విచారణలో తేలింది. దీంతో ఈ కేసులో ఉదాసీనంగా వ్యవహరించిన సీఐపై సస్పెన్షన్ వేటు పడింది.
మహిళతో ఎస్సై అక్రమ సంబంధం?
ఇదిలా ఉంటే సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో మరో పోలీస్ అధికారి సస్పెండ్ అయ్యారు. మియాపూర్ ఎస్సై గిరీష్ కుమార్ ను సీపీ అవినాష్ మహంతి సస్పెండ్ చేశారు. ఓ కేసు విషయంలో తన వద్దకు వచ్చిన మహిళను ట్రాప్ చేసి ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నందుకు ఎస్సై గిరీష్ కుమార్ పై సస్పెన్షన్ వేటు పడింది. గిరీష్ కుమార్ పై ఇదివరకే అనేక అవినీతి ఆరోపణలు వచ్చినప్పటికీ సరైన ఆధారాలు లేనందున ఇప్పటివరకు అధికారులకు చిక్కలేదు. కానీ నాలుగు రోజుల పాటు ఉద్యోగానికి సెలవు పెట్టి మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని తిరుగుతూ ఉండగా అడ్డంగా దొరికిపోయాడు. విచారణ జరిపిన ఉన్నతాధికారులు అతడిని సస్పెండ్ చేశారు.
రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా