Best Web Hosting Provider In India 2024
Khammam Govt Lands : ఖమ్మంలో సర్కారు భూముల పరిరక్షణకు అధికార యంత్రాంగం శ్రీకారం చుట్టింది. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా తెలంగాణ వ్యాప్తంగా విలువైన భూములను అన్యాక్రాంతం అయ్యాయన్న ఆరోపణలు లేకపోలేదు. 58, 59 జీవోను ఆసరాగా చేసుకుని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులే అడ్డగోలుగా ఆక్రమణలకు బరితెగించిన వైనం తాజాగా వెలుగు చూసింది. ఖమ్మం నియోజకవర్గంలో ఇటీవల పగడాల శ్రీవిద్య(భర్త నాగరాజు) కార్పొరేటర్ 415 గజాల ప్రభుత్వ స్థలానికి దరఖాస్తు చేసి అధికారులను మభ్యపెట్టి, మాయచేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్న వైనం వెలుగు చూసింది. అలాగే నియోజకవర్గంలో ఎంతో విలువైన అనేక భూములు ఇలా బీఆర్ఎస్ పెద్దలు కబ్జా చేసి పాగా వేసినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి.
ట్రెండింగ్ వార్తలు
మంత్రి వార్నింగ్ తో
ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కబ్జాలపై ప్రధానంగా దృష్టి సారించింది. “తప్పు చేసిన వారే సరిదిద్దండి.. జరిగిన తప్పు నా దృష్టికి వచ్చే వరకూ చేసుకోకండి..” అంటూ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇచ్చిన స్వీట్ వార్నింగ్ తో అధికార యంత్రాంగం ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచింది. దీంతో 58, 59 జీవో కింద అక్రమంగా జరిగిన రిజిస్ట్రేషన్ ల వ్యవహారంపై అధికారులు పోస్టుమార్టం మొదలు పెట్టారు. వాస్తవానికి ఈ జీవో నిబంధన ప్రకారం గతంలో ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి నిర్మాణం చేపట్టి ఉండాలి. సదరు నిర్మాణంలో యజమానిగా చెప్పుకునే వ్యక్తులు నివాసం ఏర్పాటు చేసుకుని ఉండాలి. ఇలాంటి నిర్మాణాలను మాత్రమే ఈ జీవో కింద క్రమబద్దీకరిస్తారు. కాగా ఎలాంటి నిర్మాణాలు లేకపోయినా ఖాళీ స్థలాల్లోనే అక్రమంగా ఇంటి నెంబర్లు, విద్యుత్ మీటరు కనెక్షన్ నెంబర్లను రూపొందించి 59 జీవో కింద దరఖాస్తు చేసుకున్న వైనం వెలుగు చూస్తోంది. అధికారుల్లో కొందరు లంచాలకు మరిగి ఇలాంటి భూములను చూసి చూడనట్లు రిజిస్ట్రేషన్ చేస్తున్న పరిస్థితితో ఖమ్మంలో విలువైన ప్రభుత్వ భూములు మాయమవుతున్నాయి.
రూ.4.35 కోట్ల స్థలానికి ఫెన్సింగ్
ప్రభుత్వ స్థలాల పరిరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల క్రమబద్దీకరణకు జారీ చేసిన జీవో నెం. 59 జీవో క్రింద నిబంధనలకు విరుద్ధంగా, ఎలాంటి నిర్మాణాలు లేకున్నా దరఖాస్తు చేసి అక్రమంగా క్రమబద్ధీకరణ కోసం ప్రయత్నం చేసిన స్థలాలు గుర్తించి రక్షణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. ఖమ్మం అర్బన్ పరిధిలోని ఖానాపురం సర్వే నెం. 272 లో 300 గజాల ప్లాట్, ఖానాపురం డొంకలో 200 గజాల రెండు ప్లాట్లు, 150 గజాల ఒక ప్లాట్, వెలుగుమట్ల సర్వే నెం. 412లో 300 గజాల ఒక ప్లాట్ లలో ఎలాంటి నిర్మాణాలు లేకున్నా పలువురు జీవో 59 కింద దరఖాస్తు చేశారని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. అలాంటి దరఖాస్తులను తిరస్కరించామన్నారు. సుమారు రూ. 4.35 కోట్ల విలువైన ఈ స్థలాలను రెవెన్యూ, మునిసిపల్ అధికారులు స్వాధీనం చేసుకుని ఫెన్సింగ్ ఏర్పాటు చేశారని వివరించారు. అదేవిధంగా భవిష్యత్తులో ఆక్రమణలు జరగకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. రెవెన్యూ, మున్సిపల్ సిబ్బంది నిఘా పెట్టి, ఎలాంటి ఆక్రమణలు జరగకుండా, నిర్మాణాలు చేపట్టకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
రిపోర్టింగ్ – కాపర్తి నరేంద్ర, ఖమ్మం.