Best Web Hosting Provider In India 2024

Reservations in private universities: తెలంగాణలోని ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలలో విద్యార్ధులకు రిజర్వేషన్లను అమలుచేసే అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. ప్రస్తుతం ఈ తరహా విధానం ఏపీలోని ప్రైవేట్ విశ్వవిద్యాలయాల్లో అమలు చేస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలోని అమరావతి ప్రాంతంలో ఏర్పాటైన ఎస్‌ఆర్‌ఎం, విట్ వంటి డీమ్డ్ వర్శిటీల్లో 20శాతం స్టేట్ కోటా రిజర్వేషన్ అమలవుతోంది.
ట్రెండింగ్ వార్తలు
తెలంగాణలో కూడా ప్రైవేట్ విశ్వ విద్యాలయాల్లో రిజర్వేషన్లను అమలు చేయడంలో సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసి అవసరమైతే చట్ట సవరణ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. తెలంగాణలో కొత్తగా ఏర్పాటైన రేవంత్ రెడ్డి సర్కారు ఆదేశాలతో ఉన్నత విద్యామండలి అధికారులు దేశంలోని వివిధ రాష్ట్రాల ప్రైవేటు వర్సిటీల చట్టాలను పరిశీలిస్తున్నారు.
తెలంగాణలో ఉన్నత విద్యపై జరిగిన సమీక్ష సమావేశంలో ప్రైవేటు వర్సిటీలపై పూర్తి నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించిన నేపథ్యంలో అధికారులు సమగ్రంగా వివరాలను సేకరిస్తున్నారు. తెలంగాణలో 2020-21 విద్యా సంవత్సరంలో తొలిసారిగా అనురాగ్, మల్లారెడ్డి, ఎస్‌ఆర్, వోక్సన్, మహేంద్ర వర్సిటీలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. డీమ్డ్ టూ బీ యూనివర్శిటీ హోదాలో ఈ విశ్వవిద్యాలయాలు పలు రెగ్యులర్, సాంకేతిక కోర్సులను అందిస్తున్నాయి.
ఆ తర్వాత గురునానక్, శ్రీనిధి, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ మేనేజ్‌మెంట్ అండ్ రీసెర్చ్ (ఇక్మార్), ఎంఎన్‌ఆర్, కావేరి వర్సిటీల ఏర్పాటుకు అనుమతిస్తూ అసెంబ్లీలో బిల్లు పాసయ్యాయి. పలు కారణాలతో ప్రైవేట్ వర్శిటీల ఏర్పాటుకు గవర్నర్ ఆమోదం తెలుపలేదు. గురునానక్, శ్రీనిధి వర్సిటీల్లో ప్రవేశాలు పూర్తిచేయడం, ప్రైవేట్ వర్శిటీలకు గవర్నర్ ఆమోదం లేకపోవడంతో ఈ విద్యా సంవత్సరం అక్కడ ప్రవేశాలు పొందిన విద్యార్థులను ఇతర వర్సిటీలు, కళాశాలల్లో సర్దుబాటు చేశారు.
వర్సిటీల వారీగా అందించే కోర్సులు, వాటిలో చేరే విద్యార్థుల సంఖ్య, వార్షిక ఫీజు, భూములు తదితర సమగ్ర వివరాలతోపాటు ఇతర రాష్ట్రాల్లో అమల్లో ఉన్న చట్టాలపై నివేదిక ఇవ్వాలని ఉన్నత విద్యామండలి అధికారులను ప్రభుత్వం ఇటీవల ఆదేశించింది.
ప్రస్తుతం దేశంలో 24 రాష్ట్రాల్లో ప్రైవేటు వర్సిటీలున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో ఏర్పాటైన రెండు వర్శిటీల్లో రాష్ట్ర ప్రభుత్వ రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. ఈ కాలేజీల్లో దాదాపు 1200సీట్లను ప్రభుత్వమే అడ్మిషన్లు నిర్వహిస్తోంది. జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన పథకాల్లో భాగంగా అడ్మిషన్లు పొందిన విద్యార్ధులకు రాయితీలు కల్పిస్తున్నారు.
ప్రైవేట్ వర్శిటీల్లో రిజర్వేషన్ల అమలుపై వాటి యాజమాన్యాల్లో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. ఫీజుల విషయంలో ప్రభుత్వం అనుమతించిన ధరలను మాత్రమే అమలు చేయాల్సి ఉండటంపై అవి అసంతృప్తిగా ఉన్నాయి. ఏపీలో అమలు చేస్తున్న విధానం అడ్మిషన్లపై ప్రభావం చూపుతోందని ఓ వర్శిటీ ప్రతినిధి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం తమ అభిప్రాయాలను కోరితే అభ్యంతరాలను వారి దృష్టికి తీసుకెళతామని చెప్పారు. sa