Kidnap for Money: డబ్బు కోసం పాడుపని.. అన్నను కిడ్నాప్ చేయించిన చెల్లి

Best Web Hosting Provider In India 2024

Kidnap for Money: సుపారీ గ్యాంగ్‌తో కలిసి సోదరుడిని కిడ్నాప్ చేయించి ఆపై పోలీసులకు ఫిర్యాదు చేసిన కిలాడీ యువతిని పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. యువతితో పాటు ఆమె ప్రియుడు, మరొకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. బాయ్‌ఫ్రెండ్‌‌ను పెళ్లి చేసుకుని సుఖంగా జీవించడానికి అవసరమైన డబ్బుల్ని కిడ్నాప్‌ చేసి సంపాదిద్దామనుకున్న జంట చివరకు కటకటాల పాలయ్యారు.

 

ట్రెండింగ్ వార్తలు

హైదరాబాద్‌లో ఓ ప్రైవేటు కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేసే సురేందర్ కిడ్నాప్‌‌ కేసును రాయదుర్గం పోలీసులు ఛేదించారు. ఈ కిడ్నాప్ వ్యవహారానికి ‌ సూత్రధారిగా బాధితుడి సోదరి నిఖితగా గుర్తించారు. నిఖిత ప్రియుడు బల్లిపార వెంకటకృష్ణ సహా కిడ్నాపర్లు మరో ముగ్గురు నిందితుల్ని ఆదివారం అరెస్టుచేసి రిమాండుకు తరలించారు. నిందితుల్లో మరో ఇద్దరు పరారీలో ఉన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా మాచర్లకు చెందిన గుర్రం నిఖిత గచ్చిబౌలిలోని ఓ కంపెనీలో పనిచేస్తోంది. అక్కడ పనిచేస్తున్న కృష్ణా జిల్లా పెనమలూరుకు చెందిన బల్లిపార వెంకటకృష్ణతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. గచ్చిబౌలిలో నివసించే వెంకటకృష్ణ గతంలో వ్యభిచారం,డ్రగ్స్‌ తరలింపు కేసులున్నాయి.

వెంకటకృష్ణ జైల్లో ఉన్న సమయంలో అత్తాపూర్‌కు చెందిన కరడుగట్టిన నేరగాడు, కిడ్నాప్‌లకు పాల్పడే గుంజపోగు సురేశ్‌ అలియాస్‌ సూర్యతో పరిచయం ఏర్పడింది. జైల్లో ఏర్పడిన పరిచయంతో తమ గ్యాంగ్‌ కిడ్నాప్‌లు చేస్తుందని ఎప్పుడైనా అవసరముంటే చెప్పాలని సురేశ్‌ వెంకటకృష్ణకు చెప్పాడు.గత ఏడాది అక్టోబరులో వెంకటకృష్ణ.. తాను పనిచేసే సంస్థ ఎండీ శివశంకరబాబును సురేశ్‌ గ్యాంగ్‌తో కిడ్నాప్‌ చేయించాడు. అతని కుటుంబ సభ్యుల నుంచి రూ.2లక్షలు వసూలు చేసి వదిలేశారు.

ఆ తర్వాత డిసెంబరులో సురేశ్‌ తనకు డబ్బు అవసరముందని కిడ్నాప్‌ పని ఉంటే చెప్పాలని వెంకటకృష్ణ, నిఖితలను సంప్రదించాడు.పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉన్న వెంకటకృష్ణ, నిఖిత బాగా డబ్బున్న వ్యక్తిని కిడ్నాప్‌ చేయిస్తే లాభం ఉంటుందని భావించారు. దీంతో నిఖిత పెదనాన్న కొడుకు సురేంద్రపై కన్నేశారు. ప్రైవేటు సంస్థలో ఐటీ ఇంజినీరుగా పనిచేసే సురేంద్రను కిడ్నాప్‌ చేయాలని ని‌ఖిత సూచించింది. సురేంద్రకు ఏటా రూ.కోటికి పైగా జీతం వస్తుందని, ఆయన భార్య ఐటీ ఉద్యోగిని అని నిందితులకు చెప్పింది. దీంతో వారు సురేంద్రను కిడ్నాప్‌ చేయాలని నిర్ణయించారు.

 

వేధింపుల నుంచి కాపాడాలని పిలిచి….

ముందుగా వేసుకున్న పథకం ప్రకారం నిఖిత తన అన్న సురేంద్ర ఇల్లు, వివరాలను కిడ్నాపర్లకు ఇచ్చింది. సురేశ్‌ గ్యాంగ్‌ సురేంద్ర ఇంటి దగ్గర కిడ్నాప్‌ చేయడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో జనవరి 4న నిఖిత.. సురేంద్రకు ఫోన్‌ చేసి ఆఫీసులో ఒకరు వేధిస్తున్నారని ఖాజాగూడ చెరువు దగ్గరకు రావాలని పిలిచింది. సురేంద్ర అక్కడికి వెళ్లి నిఖితతో మాట్లాడుతుండగా అప్పటికే కారులో సురేశ్‌, మెహిదీపట్నంకు చెందిన రామగల్ల రాజు అలియాస్‌ లడ్డు, శిందే రోహిత్‌, చందు, వెంకట్‌ ఎదురుచూస్తున్నారు.

నిఖితతో సురేంద్ర మాట్లాడుతున్న క్రమంలో ఒక్కసారిగా వారిపై దాడి చేసి సురేంద్రను కారులో ఎక్కించుకుని పరారయ్యారు. ఇది గమనించిన అక్కడున్న ఇద్దరు డయల్‌ 100కు సమాచారమిచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకోగా నిఖిత తన కళ్ల ముందే జరిగినట్లు చెప్పారు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు కూడా చేసింది.

సురేంద్రను తీసుకెళ్లిన నిందితులు ఆయన భార్యకు ఫోన్‌ చేసి రూ.2కోట్లు డిమాండ్‌ చేశారు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. కిడ్నాప్‌కు గురైన బాధితుడితో కడ్తాల్‌కు చేరుకున్నాక కారు మొరాయించడంతో నిందితులు సురేంద్రతో భార్యకు వాయిస్‌ మెసేజ్‌ పంపించి ఇంకో కారు పంపాలని చెప్పించారు. ఆ తర్వాత సురేంద్ర కారును వెంకటకృష్ణ, నిఖిత ఇద్దరూ కారు తీసుకెళ్లి కడ్తాల్‌లో కిడ్నాపర్లకు అప్పగించారు.

 

అనంతరం ఇద్దరూ అర్ధరాత్రి హైదరాబాద్‌ తిరిగొచ్చారు. కర్నూలు జిల్లా ఆత్మకూరు అటవీ ప్రాంతంలో అటవీ అధికారులు అడ్డుకున్నారు. ఆ సమయంలో వారికి కిడ్నాపర్లలో ఒకడైన రోహిత్‌, బాధితుడు సురేంద్ర దొరికారు. నిందితుల్లో మిగిలిన ముగ్గురు సురేశ్‌, రాజు, వెంకట్‌ పరారయ్యారు. తెలంగాణ పోలీసులకు సమాచారం రావడంతో సురేంద్ర చెప్పిన వివరాలు, సాంకేతిక ఆధారాల అనుగుణంగా నిందితుల్ని గుర్తించారు. ప్రధాన సూత్రధారి నిఖితతో పాటు కిడ్నాపర్‌ సురేశ్‌, ప్రియుడు వెంకటకృష్ణ, రాజును అదుపులోకి తీసుకున్నారు.

WhatsApp channel
 

Source / Credits

Best Web Hosting Provider In India 2024