జనసేన ‘‘రాజ్యాధికారానికి దారిదే…’’

Best Web Hosting Provider In India 2024

‘‘అత్తారింటికి దారేది’’ సినిమాలో పవన్‌ కళ్యాణ్‌ చిన్నప్పుడు తమ కుటుంబం నుంచి విడిపోయిన అత్తారింటి దారి వెతుక్కుంటూ వెళ్తారు. ఎక్కడ తగ్గాలో, ఎక్కడ నెగ్గాలో తెలుసుకుని స్పష్టమైన ప్రణాళికతో పవన్‌ అనుకున్నది సాధిస్తారు. అలాగే, ‘జనసేన రాజ్యాధికారానికి దారేది?’ అనే ప్రశ్న గత పదేళ్లుగా ప్రతిమలుపులో జనసేనానికి ఎదురుపడుతోంది. దీని కోసం ఆయన తగ్గుతూ, నెగ్గుతూ… పొత్తులతో ఎత్తులతో… తన లక్ష్యానికి చేరువవుతున్నారు. పదేళ్లుగా ఆటుపోట్లు ఎదుర్కొంటూ జనసేన నావ తీరానికి చేరుకుంటున్న తరుణంలో ఆయన ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంది. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడమే జనసేనాని ముందున్న పెద్దసవాల్‌.

 

ట్రెండింగ్ వార్తలు

రాజ్యాధికారంతోనే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని అంబేద్కర్‌, కాన్షీరాం ఏనాడో చెప్పారు. ఆ రాజ్యాధికారం సాధించాలి అనుకుంటున్న ఒక పార్టీ ముందుగా బలపడాలి. సరిపడ బలం లేకపోతే సిద్ధాంత సారూప్యత ఉన్న మిత్రపక్షాలతో జట్టు కట్టి గమ్యం చేరుకోవాలి. జనసేనాని టిడిపితో పొత్తుపెట్టుకోవడాన్ని రాజ్యాధికార సాధనలో భాగంగా వ్యూహాత్మకంగా తీసుకున్న నిర్ణయంగానే పరిగణించాలి.

జనసేన తన తొలి అడగు టిడిపితో కలిసి 2014లో వేసింది. టిడిపి అహంకారపూరిత ధోరణితో వ్యవహరించడం వల్ల ఇరుపార్టీల మధ్య దూరం పెరిగి 2019 ఎన్నికల్లో టిడిపి-జనసేన వేరువేరుగా పోటీ చేయడంతో రాజకీయంగా ఇరుపార్టీలు నష్టపోయాయి. జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ ఈ విషయాన్ని ముందుగానే గ్రహించి పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 2 సంవత్సరాల క్రితం ఇప్పటం సభలో వైఎస్‌ఆర్‌సిపి వ్యతిరేక ఓటును చీలకుండా ఉండడమే తమ పార్టీ ధ్యేయమని ప్రకటించి ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించారు.

దీనికి కొనసాగింపుగా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్‌డెవలప్‌మెంట్‌ కేసులో అరెస్టు అయి రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో ఉన్నప్పుడు ఆయనను పరామర్శించడమే కాకుండా జైలు ఆవరణలోనే 2024 ఎన్నికల్లో జనసేన-టిడిపి కూటమిగా ఏర్పడి పోటీ చేస్తున్నట్లు పవన్‌కళ్యాణ్‌ ప్రకటించి సంచలనం సృష్టించారు. ఈ ప్రకటనతో అప్పటివరకు జనసేన-టిడిపి పొత్తు ఉంటుందా లేదా అనే అనుమానాలకు పులిస్టాప్‌ పెట్టారు. పొత్తు ప్రకటనతో ప్రధాన ప్రతిపక్షం టిడిపికి తిరిగి ఊపిరిపోసి ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలకు మనోధైర్యాన్ని ఇవ్వడమే కాకుండా రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పొత్తుకు శ్రీకారం చుట్టారు.

 

జనసేన పార్టీ అధినేత ప్రకటనతో ‘వై నాట్‌ 175’ సీఎం జగన్‌ ఆశలు అడియాశలవడంతో పవన్‌కళ్యాణ్‌పై వ్యక్తిగత విమర్శలు, ఆయన కుటుంబసభ్యులపై వైఎస్‌ఆర్‌సిపి మాటల దాడులు చేయడం ప్రారంభించింది. పవన్‌పై వైఎస్‌ఆర్‌సిపి చేస్తున్న వ్యక్తిగత విమర్శలను కాపు సామాజికవర్గం జీర్ణించుకోలేకపోతోంది.

తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్‌ను విమర్శిస్తే తెలంగాణను కించపరిచినట్లుగా, తెలంగాణవాదులు వైఎస్‌ జగన్‌ను విమర్శిస్తే దివంగతనేత డా.వైఎస్‌.రాజశేఖరరెడ్డిని అవమానించినట్లుగా ఆయా సందర్భాల్లో ప్రజలు ఏవిధంగా భావించారో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ క్షేత్రస్థాయిలో పరిస్థితులను గమనించినప్పుడు వైఎస్‌ఆర్‌సిపి నేతలు జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌పై చేస్తున్న వ్యక్తిగత విమర్శలను కూడా అలాగే భావిస్తున్నారు. ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లాల్లో, ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర జిల్లాల్లోని కాపు సామాజిక వర్గం ముఖ్యంగా యువత వైఎస్‌ఆర్‌సిపిని వర్గశత్రువుగా చూస్తోంది.

ఎలా అర్థం చేసుకోవాలి?

జనసేన-టిడిపి పొత్తును కొంతమంది మేధావులు ‘‘బూతద్ధం’’లో చూస్తున్నారు. క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా ‘‘కళ్లద్ధాల’’తో చూసే పరిస్థితుల్లో వారు లేరు. వాస్తవ పరిస్థితులు తెలుసుకోకుండా, కడుపులో చల్ల కదలకుండా ఏసీ రూముల్లో కూర్చొని ‘‘బూతద్ధా’’ ల్లో చూస్తున్నవారిని జనసేనాని ‘‘బూతాల్లాగే’’, అధికార వైఎస్‌ఆర్‌సిపికి మేలు చేసేవారిగానే పరిగణించాలి. వీరిని పట్టించుకోకుండా ముందుకు నడవడమే తెలివైన వ్యూహమని గుర్తించాలి.

2014లో టిడిపి-బిజెపి కూటమికి జనసేన మద్దతు ప్రకటించినప్పుడు ఈ ఏసీ రూమ్‌ మేధావులు, స్వయం ప్రకటిత కాపు నాయకులు ఎందుకు మౌనం పాటించారు? 2019లో జనసేన ఒంటరిగా పోరాడినప్పుడు బహిరంగంగా వీరు ఆ పార్టీకి ఎందుకు మద్దతు ప్రకటించలేదు? వైఎస్‌ఆర్‌సిపి అధినేతతో సహా ఆ పార్టీ నేతలు పవన్‌కళ్యాణ్‌పై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నప్పుడు వీరు ఎందుకు మౌనం పాటిస్తున్నారు?

 

కాపులకు రిజర్వేషన్‌ ఇవ్వనని కుండబద్దలు కొట్టినట్లుగా వైఎస్‌ఆర్‌సిపి అధినేత ప్రకటించినప్పుడు వీరెందుకు నోరు విప్పలేదు? 2024లో ఎవరికి మేలు చేయడానికి తక్కువ సీట్లకు పొత్తు ఒప్పుకోవద్దని, ముఖ్యమంత్రి సీటును పంచాలని రెచ్చగొడుతున్నారు? ఈ అంశాలను జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు అర్థం చేసుకుని ముందుకు వెళ్ళడమే దానిముందున్న ఏకైక మార్గం.

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు దేశంలోనే ఖరీదైనవిగా మారిపోయాయి. కుల సమీకరణాలు పక్కనపెడితే, జనరల్‌ స్థానాల్లో కనీసం రూ. 35 కోట్లు, రిజర్వుడ్‌ స్థానాల్లో రూ. 25 కోట్లు ఖర్చు చేయందే ఓట్లు పడే పరిస్థితి లేదు. ఇంత ఖర్చు చేసినా కచ్చితంగా గెలుస్తామన్న గ్యారెంటీ లేదు. ఈ జూదంలో ఇంత డబ్బు పోసి పోటీ పడే నాయకులు, వారికి సహకారం అందించే కార్యకర్తలు జనసేన సమూహంలో లేరు!

అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫార్మ్స్‌ నివేదిక ప్రకారం రూ. 300 కోట్ల వరకు ఆస్తులున్న టీడీపీ, వైఎస్సార్సీపీలు ధనిక ప్రాంతీయ పార్టీల్లో టాప్‌ టెన్‌లో ఉన్నాయి. ఇక పార్టీలలో ఉన్న నాయకుల ఆస్తులు ఏ స్థాయిలో ఉంటాయో అందరికీ తెలిసిందే. రూ. 20 కోట్ల ఆస్తులు కూడా లేని పేద పార్టీ జనసేన ఎక్కువ సీట్లు అడిగితే, ఎక్కువ డబ్బు కూడా కావాలి. ఆర్థిక బలం లేకుండా ఎక్కువ సీట్లలో పోటీ చేసి, తక్కువ స్థానాల్లో గెలిచి అప్రతిష్ట మూటగట్టుకునేందుకు జనసేనాని సిద్ధంగా ఉన్నారా?

 

అంచనాలు వాస్తవిక దృక్పథంతో

1983లో నందమూరి తారకరామారావు, పెద్ద మనసుతో తమతో పొత్తుపెట్టుకోవాలని కమ్యూనిస్టులను కోరడమే కాకుండా ఆ పార్టీలకు దాదాపు 60 సీట్లు ఇస్తామని ప్రతిపాదించారు. క్షేత్రస్థాయిలో తమ బలం, బలహీనత అంచనా వేసుకోకుండా కమ్యూనిస్టులు అత్యాశకు పోయి 100 సీట్లు డిమాండ్‌ చేసి చారిత్రాత్మక తప్పిదం చేశారు.

ఉమ్మడి రాష్ట్రంలో 10 సంవత్సరాలపాటు అధికారంలో లేని కాంగ్రెస్‌ పార్టీ 2004లో టీఆర్‌ఎస్‌, కమ్యూనిస్టు పార్టీలతో పొత్తుపెట్టుకుని అధికారంలోకి వచ్చిన విషయంతోపాటు 2001 నుంచి సుమారు పదమూడేళ్ల పాటు పొత్తులతో నెట్టుకొచ్చిన బీఆర్‌ఎస్‌ 2014లో రాజ్యాధికారం సాధించింది. ఉత్తరప్రదేశ్‌లో బీఎస్పీ, కర్ణాటకలో జేడీఎస్‌, మహారాష్ట్రలో శివసేన, బీహార్‌లో జెడి(యు) మొదలగు పార్టీలు కూడా పొత్తులతో ప్రయాణం మొదలుపెట్టి రాజ్యాధికారాన్ని సాధించాయి. 2014లో కేంద్రంలో బిజెపి అధికారంలోకి రావడానికి వివిధ రాష్ట్రాల్లో అనేక పార్టీలతో పొత్తులు పెట్టుకున్న విషయాన్ని జనసేన పార్టీ గమనించాలి. వీటి స్ఫూర్తితో జనసేనాని ముందడుగు వేయాలి.

జనసేన ఎక్కువ సీట్లలో పోటీ చేయడం వల్ల వైఎస్సార్సీపీకే మేలు జరిగే అవకాశాలు ఉన్నాయి. 2009లో టిడిపితో పొత్తుపెట్టుకున్న బీఆర్‌ఎస్‌ 45 సీట్లలో పోటీ చేసి కేవలం 10 సీట్లలోనే విజయం సాధించింది. దీంతో పరోక్షంగా కాంగ్రెస్‌కి మేలు జరిగింది. పొత్తు పెట్టుకున్నప్పుడు పెద్ద పార్టీలతో గొడవ పెట్టుకోవడం లేదా ఎక్కువ సీట్లు డిమాండ్‌ చేయడం వల్ల చిన్న పార్టీలకే ఎక్కువ నష్టం వాటిల్లుతుంది.

 

టిడిపి బలమైన వ్యవస్థాగత నిర్మాణమున్న పార్టీ. పొత్తుతో పోటీ చేస్తున్నప్పుడు టిడిపి లాంటి పెద్ద పార్టీ గెలవడానికి, పొత్తు పెట్టుకున్న చిన్న పార్టీ నుంచి తక్కువ శాతం ఓట్లు బదిలీ అయితే సరిపోతుంది. అదే పొత్తులో చిన్న పార్టీలకు పెద్ద పార్టీ నుంచి అధిక శాతం ఓట్లు బదిలీ కావాల్సి ఉంటుంది. తెలంగాణలో ఇటీవల జరిగిన ఇన్నికల్లో కాంగ్రెస్‌, బిఆర్‌ఎస్‌ పార్టీల మధ్య ప్రధాన పోటీ ఉండగా, సీపీఐ నుంచి బదిలీ అయిన తక్కువ శాతం ఓట్లే కాంగ్రెస్‌ గెలుపుకు దోహదం చేశాయి. అదే సిపిఐకి ఎక్కువ స్థానాలు ఇచ్చి ఉంటే, అధిక శాతం కాంగ్రెస్‌ ఓటు షేర్‌ బదిలీకి ఆస్కారం తగ్గేది. అది బిఆర్‌ఎస్‌కి మేలు చేసి ఉండేది.

వ్యూహ రచన ముఖ్యం

జనసేనను రాబోయే 25 సంవత్సరాలు స్థిరంగా నడిపించడానికి, నెమ్మదిగా యువతను రాజకీయాల్లో తీసుకురావడానికి పవన్‌ కళ్యాణ్‌ ఒక నిర్దిష్టమైన లక్ష్యం పెట్టుకోవాలి. జనసేన ఎక్కువ సీట్లను డిమాండ్‌ చేయడం కన్నా… తనకు బలమున్న చోట పోటీ చేసి, కనీసం 95 శాతం స్ట్రయిక్‌ రేటుతో గెలుపుబావుటా ఎగరేసేలా ప్రణాళికలు రచించుకోవాలి. జనసేన పార్టీని బలోపేతం చేసుకోవడానికి టిడిపితో ఎన్నికలకు ముందే జనసేన పార్టీ కామన్‌ పొలిటికల్‌ ప్రోగ్రాం (సిపిపి) రూపొందించుకోవాలి.

 

కామన్‌ పొలిటికల్‌ ప్రోగ్రాంలో (సిపిపి) భాగంగా జనసేన-టిడిపి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేన పార్టీ సిఫారసు చేసిన వారికి కనీసం 1/3 నామినేటెడ్‌ పదవులు డిమాండ్‌ చేయాలి. దీనిపై ఎన్నికలకు ముందే ఒక ఒప్పంద పత్రాన్ని ఇరుపార్టీలు రాసుకోవాలి. కామన్‌ పొలిటికల్‌ ప్రోగ్రాం (సిపిపి) పది సంవత్సరాలుగా జనసేన పార్టీని నమ్ముకుని ఉన్న శ్రేణులకు న్యాయం చేయగలుగుతారు.

కామన్‌ పొలిటికల్‌ ప్రోగ్రాంలో (సిపిపి) భాగంగా ఐదు సంవత్సరాల్లో వచ్చే ఎమ్మెల్సీ పదవులు, రాజ్యసభ పదవులతో పాటు ఇతర నామినేటెడ్‌ పదవుల్లో జనసేనకు 1/3 దక్కేవిధంగా ఒప్పందం కుదుర్చుకోవాలి. స్థానిక సంస్థల్లో జెడ్పీటీసీలు, మున్సిపల్‌ కౌన్సిల్‌ వార్డులు, నగర పంచాయతీ వార్డులు, మున్సిపల్‌ కార్పోరేటర్‌ పోస్టులు ఉన్నాయి. వీటిలో జనసేన కార్యకర్తలకు తగిన ప్రాధాన్యత లభిస్తే, పార్టీ వేర్లు క్షేత్రస్థాయిలో బలపడతాయి. వీటితో పాటు సలహాదారులు, దేవాదాయ కమిటీలు, వివిధ కార్పోరేషన్లు, హైకోర్టు, కింద కోర్టుల్లో ఉన్న పలు నామినేటెడ్‌ పదవులతో పాటు, కేంద్ర ప్రభుత్వంలో వివిధ మంత్రిత్వ శాఖల్లో ఉన్న నామినేటెడ్‌ పోస్టుల్లో జనసేన పార్టీకి భాగస్వామ్యం ఉండేవిధంగా బిజెపితో కూడా ఒప్పందం కుదుర్చుకోవాలి.

2024 ఎన్నికలకు ముందే జనసేన-టిడిపిలు పారదర్శకమైన ఒప్పందం కుదుర్చుకోవాలి. ఈ ఒప్పందాన్ని మీడియా సమక్షంలో ఇరుపార్టీ నేతలు విడుదల చేయాలి. విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో కీలక పాత్ర పోషించే మంత్రిత్వ శాఖల్లో ఇరు పార్టీలకు తగిన భాగస్వామ్యం ఉండాలి. ఇలా ఆయా పోస్టుల్లో వీలైనంత ఎక్కువమంది జనసేన నాయకులు, కార్యకర్తలు ఉంటే అది పార్టీకి రాబోయే దశాబ్దానికి సరిపడా ఉత్సాహాన్ని అందిస్తుంది.

 

2004లో కాంగ్రెస్‌తో పొత్తులో భాగంగా… బిఆర్‌ఎస్‌ 54 స్థానాల్లో పోటీ చేసి, 26 స్థానాల్లో విజయం సాధించింది. అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ప్రభుత్వంలో బిఆర్‌ఎస్‌కి 5 మంత్రి పదవులు, కేంద్ర ప్రభుత్వంలో ఒక మంత్రి పదవి, మరో సహాయ మంత్రి పదవి ఇచ్చారు. 2014లో టిడిపి బిజెపి పొత్తు పెట్టుకున్నప్పుడు బిజెపి 13 స్థానాల్లో పోటీ చేసి కేవలం నాలుగు స్థానాలో విజయం సాధించింది. అయినా ఆ పార్టీకి రాష్ట్ర ప్రభుత్వంలో రెండు మంత్రి పదవులు దక్కాయి. బిజెపి కేంద్ర ప్రభుత్వంలో టిడిపికి ఒక మంత్రి పదవి, ఒక సహాయ మంత్రి పదవి ఇచ్చింది. పవర్‌ షేరింగ్‌లో భాగంగా చిన్న పార్టీలు తక్కువ సీట్లలో గెలుపొందినప్పటికీ… ప్రభుత్వంలో అధిక భాగస్వామ్యం పొందుతాయి. ఇది ఆ పార్టీ బలపడటానికి దారులు వేస్తుంది. 2014లో టిడిపికి మద్దతిచ్చి కూడా… నామినేటెడ్‌ పదవులు తీసుకోకపోవడం వల్ల జనసేనకు తీవ్ర నష్టం జరిగింది. ఈసారి ఆ తప్పు జరగకుండా జనసేనాని జాగ్రత్తలు తీసుకోవాలి.

ఇటీవల తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో జనసేన-బిజెపి కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీచేసింది. బిజెపితో కలిసి జనసేన పోటీచేయడానికి ప్రధాన కారణం ఆ పార్టీ తెలంగాణ ముఖ్యమంత్రిగా బీసీ అభ్యర్థిని ప్రకటించడం ఒక కారణమని జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్‌ అనేక బహిరంగ సభల్లో ప్రకటించారు. ఈ ప్రకటనతోనే జనసేన పార్టీ బీసీలకు వ్యతిరేకం కాదన్నది స్పష్టమౌతోంది. అధికార వైఎస్‌ఆర్‌సిపి జనసేన పార్టీకి ‘‘కాపు’’ ముద్రవేసి క్యాస్ట్‌వార్‌ చేస్తుందన్న విషయాన్ని బీసీ సామాజిక వర్గం, జనసేన శ్రేణులు, ఆ పార్టీ నాయకత్వం గ్రహించి 2024 ఎన్నికల్లో ఆచితూచి అడుగువేయాలి.

 

అనువైన చోట, అనువైన సమయంలో యుద్ధం చేయడమే రాజకీయ చతురత అని జనసేనాని గుర్తించాలి. తనకు బలమున్న స్థానాల్లోనే పోటీకి దిగాలి. రాష్ట్రాల్లో వివిధ పార్టీలకు పొత్తుల వల్ల కలిగిన లాభ నష్టాల్ని, పవర్‌ షేరింగ్‌పై జనసేన అధినేత క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. దీనికోసం సీట్ల షేరింగ్‌పై కాకుండా పవర్‌ షేరింగ్‌, స్ట్రయిక్‌ రేట్‌పై ఎక్కువ దృష్టి పెట్టాలి. ఒకవేళ ఈ సమయంలో పవన్‌ కళ్యాణ్‌ తప్పటడుగులు వేస్తే, జగన్‌ చేతికి ఆయుధాన్ని అందించినట్టే! చరిత్రలో తిరిగి ఆయనకు ఇలాంటి అవకాశం రావడమూ అసాధ్యమే. జనసేనకు ‘‘రాజ్యాధికారానికి దారి’’ పొత్తులు పెట్టుకోవడంతో పాటు పవర్‌ షేరింగ్‌లో సముచితస్థానం పొందడమే కీలకం.

– ఐ.వి.మురళీ కృష్ణ శర్మ,

రీసెర్చర్‌, పీపుల్స్‌పల్స్‌ రీసెర్చ్‌ సంస్థ,

Email: peoplespulse.hyd@gmail.com

ఐవీ మురళీకృష్ణ, పీపుల్స్ పల్స్ రీసెర్చర్
ఐవీ మురళీకృష్ణ, పీపుల్స్ పల్స్ రీసెర్చర్

(డిస్‌క్లెయిమర్: ఈ వ్యాసంలో వ్యాసకర్త తెలియపరిచిన అభిప్రాయాలు, విశ్లేషణలు వ్యాసకర్త వ్యక్తిగతం. హెచ్‌టీ తెలుగువి కావు

WhatsApp channel
 

Source / Credits

Best Web Hosting Provider In India 2024