KTR : కేసీఆర్ అధికారంలో కన్నా ప్రతిపక్షంలో ఉండటమే కాంగ్రెస్ కు ప్రమాదం- కేటీఆర్

Best Web Hosting Provider In India 2024

KTR : ప్రజల విశ్వాసాన్ని స్వల్పకాలంలో కోల్పోయే లక్షణం కాంగ్రెస్ పార్టీ సొంతమని, గత చరిత్రను పరిశీలిస్తే అర్థమయ్యేది అదేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవాన్ లో ఖమ్మం లోక్ సభ నియోజకవర్గం సన్నాహక సమావేశానికి హాజరైన పార్టీ శ్రేణులను ఉద్దేశించి కేటీఆర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….ఇప్పటి లాగానే 1989 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీని తిరస్కరించి కాంగ్రెస్ ను గెలిపించిన ప్రజలు కేవలం ఏడాదిన్నర స్వల్పకాలంలోనే కాంగ్రెస్ పార్టీ మీద విశ్వాసాన్ని కోల్పోయారన్నారు. ప్రజా విశ్వాసం కోల్పోయిన కాంగ్రెస్ అనంతరం జరిగిన నాటి లోక్ సభ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయ్యిందన్నారు. ఆ ఎన్నికల్లో అదే ప్రజలు టీడీపీని తిరిగి భారీ మెజారిటీతో గెలిపించిన సంగతి అందరికీ తెలిసిన విషయమేనన్నారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నిలుపుకునే నిజాయితీ చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీకి ఉండదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై నెలదాటిందన్న కేటీఆర్, వచ్చిన తెల్లారినించే వాగ్దానాలు అమలు చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇతర వర్గాలకు ఇచ్చిన హామీల అమలులో కాలయాపన దిశగా అడుగులేస్తున్నదన్నారు.

 

ట్రెండింగ్ వార్తలు

కేసీఆర్ ప్రతిపక్షంలో ఉండటమే కాంగ్రెస్ కు ప్రమాదం- కేటీఆర్

ఇందుకు కాంగ్రెస్ పార్టీ నెల రోజుల పాలనా పోకడలే సాక్ష్యమని కేటీఆర్ అన్నారు. వాగ్దానం చేసిన దానికి భిన్నంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించడం పట్ల ప్రజల్లో అసహనం ప్రారంభమైందని, ఇదిలాగే కొనసాగే పరిస్థితి ఉన్నదన్నారు. ప్రజలకిచ్చిన వాగ్దానాల అమలుకోసం కాంగ్రెస్ మీద ఒత్తిడి తెస్తూ తెలంగాణ ప్రజల కోసం బీఆర్ఎస్ పోరాడుతుందన్నారు. అధికారంలో ఉన్నప్పటి కన్నా ప్రతిపక్షంలో ఉంటేనే మరింత పోరాట పటిమ చూపగలమని, మనమంతా ఉద్యమంలో గట్టిగా పోరాడిన వాళ్లమేనని కేటీఆర్ గుర్తు చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో పార్టీ పోరాట పటిమను తెలంగాణ ప్రజలు చూశారని, రానున్న రోజుల్లో కేసీఆర్ అసెంబ్లీ కొస్తే ఇంకా ఎలా ఉంటుందో ఊహించుకోవాలన్నారు. కేసీఆర్ అధికారంలో ఉండటం కన్నా ప్రతిపక్షంలో ఉండటమే కాంగ్రెస్ పార్టీకి ప్రమాదకరమని, సీఎం అనే రెండక్షరాల కన్నా కేసీఆర్ అనే మూడు అక్షరాలే పవర్ ఫుల్ అన్నారు. ఫిబ్రవరిలో కేసీఆర్ ప్రజల మధ్యకు వస్తారని తెలిపారు. పార్లమెంటు నియోజకవర్గాల సమీక్షలు ముగియగానే అసెంబ్లీ నియోజక వర్గాల సమీక్షలు ఉంటాయన్నారు. త్వరలోనే రాష్ట్ర, జిల్లా కమిటీలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రతీ రెండు మూడు నెలలకోసారి అన్ని కమిటీల సమావేశాలు క్రమం తప్పకుండా ఏర్పాటు చేస్తాన్నారు.

 

11 స్థానాలు అత్యల్ప మెజారిటీతోనే చేజారిపోయాయి

ఖమ్మం లాంటి ఒకటి రెండు జిల్లాల్లో తప్పితే ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా తిరస్కరించలేదు అనడానికి మనం సాధించిన అసెంబ్లీ ఫలితాలే నిదర్శనమన్నారు. 39 ఎమ్మెల్యే సీట్లను గెలవడంతో పాటు 11 స్థానాలు అత్యల్ప మెజారిటీతో చేజారిపోయాయన్నారు. ప్రజల్లో ఉన్న అసంతృప్తికి కారణాలు చర్చించుకుని సమీక్షించుకుని ముందుకు సాగుదమన్నారు. ఇప్పటికీ జరిగిన సమావేశాల్లో పార్టీ పరంగా ఆత్మవిమర్శ చేసుకుంటున్నామన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు రాజకీయ అస్తిత్వంగా నిలిచిన బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణను గెలిపించిందని, పదేండ్ల అనతికాలంలోనే దేశానికే ఆదర్శంగా నిలబెట్టిందన్నారు. తెలంగాణ బలం బీఆర్ఎస్సే అని, రాబోయే ప్రతి అడుగులో కేసీఆర్ దళంగా ఐకమత్యంగా ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. తెలంగాణ సాధించిన ఘనతను ప్రతిష్టను వెలుగొందుదుతున్న ప్రభకు ఏమాత్రం భంగం కలిగించకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా నిబద్దత కలిగిన బీఆర్ఎస్ శ్రేణులదే అన్నారు. నాడు తెలంగాణ సాధించుకున్న ఉద్యమ స్ఫూర్తితో, నిన్నటిదాకా సాధించిన ప్రగతిని తిరిగి నిలబెట్టుకుందామని, రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకుందామన్నారు.

రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా

WhatsApp channel
 

Source / Credits

Best Web Hosting Provider In India 2024