Mahesh Babu: హీరోలందరికీ తాట ఊడిపోయిద్ది.. మహేశ్ బాబు కామెంట్స్ వైరల్

Best Web Hosting Provider In India 2024

Mahesh Babu At Guntur Kaaram Pre Release Event: అతడు, ఖలేజా వంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత సూపర్ స్టార్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు తివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో మూడోసారి వస్తున్న సినిమా గుంటూరు కారం. జనవరి 12 సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. తాజాగా మంగళవారం (జనవరి 9) ఏపీ గుంటూరులోని నంబూరు క్రాస్ రోడ్స్‌లో భారీ అభిమానుల కోలాహలం మధ్య గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను వైభవంగా నిర్వహించారు.

 

ట్రెండింగ్ వార్తలు

గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మహేశ్ బాబు స్పీచ్ వైరల్ అవుతోంది. “అందరికీ నమస్కారం. గుంటూరులో ఫంక్షన్ జరుగుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. దీనికి మీరందరూ త్రివిక్రమ్ గారికి థాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది ఆయన ఐడియానే. మేమందరం ఎక్కడ ఫంక్షన్ చేయాలని చర్చించుకుంటుంటే ఆయన మీ ఊరిలో ఫంక్షన్ చేద్దాం సార్ అన్నారు. దానికి నేను సరే సార్ మా ఊళ్లోనే చేయండని అన్నాను. ఇదిగో ఇప్పుడు మన ఊళ్లోనే ఫంక్షన్ జరుగుతుంది. చాలా ఆనందంగా ఉంది” అని మహేశ్ బాబు అన్నారు.

“త్రివిక్రమ్ గారంటే నాకు చాలా ఇష్టం. ఆయన నాకు స్నేహితుడు కంటే ఎక్కువ. నా కుటుంబ సభ్యుడిలాగా. నేను ఆయన గురించి బయట ఎప్పుడూ మాట్లాడను. మన ఇంట్లో మనుషుల గురించి ఎక్కువ ఏం మాట్లాడతాం. కానీ, ఈ గత రెండు సంవత్సరాలు ఆయన నాకిచ్చిన సపోర్ట్, స్ట్రెంత్ నేనెప్పుడూ మర్చిపోలేను. థాంక్యూ సార్. మీకు థాంక్స్ చెప్పుకోవడం కూడా వింతగానే ఉంది నాకు. ఎందుకంటే మనం ఎప్పుడూ ఇలా మాట్లాడుకోము” అని మహేశ్ బాబు తెలిపారు.

“త్రివిక్రమ్ గారి సినిమాల్లో నేను చేసినప్పుడల్లా నా పర్ఫామెన్స్‌లో ఒక మ్యాజిక్ జరుగుతుంది. అది నాకు తెలియదు. అతడు నుంచి మా ప్రయాణం మొదలైంది. ఖలేజాలో ఒక మ్యాజిక్ జరిగింది. అదే మ్యాజిక్ ఇప్పుడు గుంటూరుకారంలో జరిగింది. మీరు ఒక కొత్త మహేశ్ బాబుని చూడబోతున్నారు. దానికి ఆయనే కారణం. నేనెప్పుడూ ఇలా చెప్పలేదు. ఇవి మనసులోనుంచి వచ్చే మాటలు. అభిమానుల ముందు చెప్పకపోతే ఎప్పుడు చెప్తాను. లవ్ యు సార్” అని పేర్కొన్నారు మహేశ్ బాబు.

 

“శ్రీలీల గురించి చెప్పాలంటే.. చాలా రోజుల తర్వాత ఒక తెలుగమ్మాయి పెద్ద హీరోయిన్ కావడం చాలా ఆనందంగా ఉంది. హార్డ్ వర్క్ చేసే డెడికేటెడ్ ఆర్టిస్టులలో ఆమె ఒకరు. ఆమె షాట్ చిత్రీకరణ లేకపోయినా అక్కడే ఉంటుంది. మేకప్ వ్యాన్‌లోకి వెళ్లదు. ఈ అమ్మాయితో డ్యాన్స్ చేయడం.. వామ్మో(నవ్వుతూ).. అదేం డ్యాన్స్. హీరోలందరికీ తాట ఊడిపోయిద్ది. శ్రీలీలకి అద్భుతమైన భవిష్యత్ ఉంది. మీనాక్షి మా సినిమాలో ప్రత్యేక పాత్ర చేసింది. నేను, త్రివిక్రమ్ గారు అడగగానే అసలేం ఆలోచించకుండా వెంటనే సినిమా చేయడానికి అంగీకరించింది. ఆ విషయంలో ఎలా థాంక్స్ చెప్పాలో అర్థంకావట్లేదు. ఆ పాత్రకు నిండుతనం తీసుకొచ్చింది” అని మహేశ్ బాబు చెప్పుకొచ్చారు.

“మా నిర్మాత చినబాబు గారు.. ఇది నాకు ఆయన చెప్పలేదు. కానీ నాకు తెలుసు. ఆయన బాగా ఇష్టపడే హీరోని నేనే. మానిటర్ చూసినప్పుడు, ఎడిటింగ్ రూమ్ లో సీన్స్ చూసినప్పుడు ఆయన ముఖంలో ఆనందం నాకు తెలుసు. అది చూసినప్పుడల్లా నాకు చాలా సంతోషమేస్తుంది. ఒక ప్రొడ్యూసర్ ముఖంలో ఆనందం వచ్చినప్పుడు ఆ ఫీలింగే వేరబ్బా. థాంక్యూ సార్. నిజంగా మీరు ఇచ్చిన సపోర్ట్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. నాకు, డైరెక్టర్ గారికి తెలుసు మీరు ఎంత సపోర్ట్ చేశారో. మీరు నన్ను చాలా బాగా చూసుకున్నారు. మీతో మరిన్ని గొప్ప సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అని మహేశ్ బాబు వెల్లడించారు.

 
WhatsApp channel
 
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.

Source / Credits

Best Web Hosting Provider In India 2024