Best Web Hosting Provider In India 2024
Sweet Roti: పిల్లలకు బ్రేక్ ఫాస్ట్ సమయంలో లేదా స్నాక్స్ టైంలో ఒకేలాంటి ఆహారాలను పెడితే నచ్చదు. వారికి ప్రతిరోజు కొత్త కొత్త రుచులు తినాలనిపిస్తుంది. అలాంటి పిల్లల కోసమే ఈ బెల్లం చపాతి. దీనిలో బెల్లం, నెయ్యి, గోధుమపిండిని వినియోగిస్తాము. కాబట్టి ఇవన్నీ కూడా ఆరోగ్యానికి మేలు చేసేవే. ఇది బ్రేక్ ఫాస్ట్ రెసిపీగా, లంచ్ బాక్స్ రెసిపీగా కూడా పనికొస్తుంది. బెల్లం చపాతీ ఎలా చేయాలో ఒకసారి చూద్దాం.
ట్రెండింగ్ వార్తలు
బెల్లం చపాతీ రెసిపీకి కావలసిన పదార్థాలు
గోధుమపిండి – రెండు కప్పులు
మజ్జిగ – ఒక కప్పు
బెల్లం తురుము – అర కప్పు
ఉప్పు – చిటికెడు
నెయ్యి – రెండు స్పూన్లు
బెల్లం చపాతీ రెసిపీ
1. పెద్ద మిక్సీ జార్‌ని తీసుకొని అందులో గోధుమ పిండి, మజ్జిగ, నెయ్యి, చిటికెడు ఉప్పును వేసి ఒకసారి గ్రైండ్ చేయాలి.
2. అది మెత్తటి పేస్టులా అయ్యాక తీసి ఒక గిన్నెలో పెట్టాలి.
3. చపాతీ పిండిని ఎలా మెదుపుతామో అలా చేత్తోనే బాగా మెదపాలి. అవసరమైతేనే నీళ్లు పోసుకోవాలి.
4. ఒక పది నిమిషాలు పాటు మూత పెట్టి ఆ చపాతీ పిండిని పక్కన పెట్టుకోవాలి.
5. ఇప్పుడు చపాతీ పిండి నుంచి చిన్న ముద్దను తీసి లడ్డూల్లా చుట్టుకోవాలి.
6. దాన్ని చపాతీలా రోల్ చేయాలి. ఆ చపాతీపై కాస్త తురిమిన బెల్లాన్ని చల్లాలి.
7. అలాగే నెయ్యిని కూడా వేయాలి. మళ్ళీ చపాతీని మడిచి రోల్ చేయాలి.
8. స్టవ్ మీద పెనం పెట్టి ఇలా ఒత్తుకున్న చపాతీని రెండువైపులా కాల్చుకోవాలి. అంతే బెల్లం చపాతి రెడీ అయినట్టే.
9. ఈ చపాతీపై కాస్త వెన్నను లేదా నెయ్యిని రాసి పిల్లలకు ఇస్తే వాళ్ళు ఇష్టంగా తింటారు. దీని రుచి చాలా బాగుంటుంది. ఒక్కసారి చేస్తే పిల్లలు దీన్ని మళ్ళీ మళ్ళీ అడుగుతారు.