Best Web Hosting Provider In India 2024
Srivari laddu Prasadam to Ayodhya: అయోధ్యలో ఈ నెల 22వ తేదీన శ్రీరామ మందిరం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టత్మకంగా చేపడుతున్నారు. ఈ సందర్భంగా భక్తులకు అందించేందుకు శ్రీవారి లడ్డూప్రసాదాన్ని పంపుతున్నట్టు టీటీడీ అదనపు ఈవో(ఎఫ్ఏసి) వీరబ్రహ్మం తెలిపారు.
ట్రెండింగ్ వార్తలు
తిరుమలలోని శ్రీవారి సేవా సదన్-1 నుంచి శ్రీవారి లడ్డూప్రసాదంతో కూడిన బాక్సులను శుక్రవారం రాత్రి తిరుపతి విమానాశ్రయానికి తరలించారు. ఈ సందర్భంగా సేవా సదన్ వద్ద శ్రీ వీరబ్రహ్మం మీడియాతో మాట్లాడుతూ… అయోధ్యకు ఒక లక్ష చిన్న లడ్డూలను శ్రీవారి ప్రసాదంగా పంపాలని టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయించిందన్నారు. ఇందుకోసం టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు భూమన కరుణాకరరెడ్డి, ఈవో ఏవి.ధర్మారెడ్డి ప్రత్యేక శ్రద్ధతో స్వచ్ఛమైన దేశీయ ఆవునెయ్యిని వినియోగించి లడ్డూలు తయారు చేయించినట్లు చెప్పారు.
లడ్డూల తయారీకి బోర్డు సభ్యులు శ్రీ సౌరభ్ బోరా 2 వేల కిలోలు, మాజీ బోర్డు సభ్యులు శ్రీ జూపల్లి రామేశ్వరరావు 2 వేల కిలోల దేశీయ ఆవు నెయ్యిని విరాళంగా అందించినట్లు తెలియజేశారు. గురువారం శ్రీవారి సేవకులతో మొత్తం 350 బాక్సుల్లో ఒక లక్ష లడ్డూలను ప్యాకింగ్ చేశామని చెప్పారు. మరో బోర్డు సభ్యులు శ్రీ శరత్ చంద్రారెడ్డి సహకారంతో ఈ లడ్డూలను తిరుపతి విమానాశ్రయం నుంచి ప్రత్యేక కార్గో విమానం(ఏరో గ్రూపు) ద్వారా అయోధ్యకు పంపుతున్నట్లు తెలిపారు. శనివారం ఈ లడ్డూప్రసాదాన్ని అయోధ్యలో శ్రీ రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టుకు అందజేస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా శ్రీవారి సేవా సదన్ ప్రాంగణం రామనామంతో మారు మోగింది. పలువురు శ్రీవారి సేవకులు, భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
బాల రాముడి విగ్రహం ఫొటో విడుదల
మరోవైపు అయోధ్య రామజన్మభూమి ఆలయంలో ప్రతిష్టించబోతున్న రామ్ లల్లా విగ్రహం ముఖ భాగాన్ని శుక్రవారం బహిర్గతం చేశారు. జనవరి 22న అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామాలయంలో ఈ విగ్రహానికే ప్రాణ ప్రతిష్ట జరగనుంది. ఈ ‘ప్రాణ్ ప్రతిష్ఠ’ వేడుకకు కేవలం మూడు రోజుల ముందు రామ్ లల్లా విగ్రహం యొక్క మొదటి చిత్రం బయటకు వచ్చింది. విశ్వహిందూ పరిషత్ (VHP) విడుదల చేసిన ఈ చిత్రంలో రామ్ లల్లా నిలబడి ఉన్న భంగిమలో ఉన్నారు. నల్లరాతితో చెక్కిన ఈ విగ్రహం కళ్లను పసుపు రంగు వస్త్రంతో కప్పి ఉంచారు. విగ్రహాన్ని గులాబీల దండతో అలంకరించారని VHP ఆఫీస్ బేరర్ శరద్ శర్మ తెలిపారు.
జనవరి 22న రామ మందిరంలో 51 అంగుళాల బాల రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట జరగనుంది. ఈ జరిగే కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు ఆహ్వానితులు హాజరుకానున్నారు. మరుసటి రోజు నుంచి ఆలయాన్ని ప్రజల కోసం తెరవాలని భావిస్తున్నారు. ఆలయ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ మాట్లాడుతూ, జనవరి 22న మధ్యాహ్నం 12:20 గంటలకు పవిత్రోత్సవం ప్రారంభమవుతుందని, మధ్యాహ్నం 1 గంటకు పూర్తవుతుందని భావిస్తున్నామని తెలిపారు. ఆలయంలో సంప్రోక్షణ ఆచారాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.
సంబంధిత కథనం
టాపిక్