Best Web Hosting Provider In India 2024

Paneer Gongura Curry: పాలక్ పనీర్ కర్రీకి అభిమానులు ఎక్కువ. పనీర్ తో చేసే ఏ వంటకాలైనా టేస్టీగానే ఉంటాయి. ముఖ్యంగా శాఖాహారులకు పనీర్ అంటే ప్రాణం. ఓసారి పనీర్ గోంగూర కర్రీ ట్రై చేసి చూడండి. పుల్లపుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చపాతీతో, అన్నంతో కూడా బాగుంటుంది. ఈ రెసిపీ చాలా సులువు. ముఖ్యంగా పనీర్, గోంగూర… రెండు పోషకాలు నిండినవే. కాబట్టి ఈ రెండూ కలిపి తినడం వల్ల శరీరానికి ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.
ట్రెండింగ్ వార్తలు
పనీర్ గోంగూర కర్రీ రెసిపీకి కావాల్సిన పదార్థాలు
పన్నీర్ – 100 గ్రాములు
గోంగూర – మూడు కట్టలు
ఉల్లిపాయలు – రెండు
పచ్చిమిర్చి – మూడు
నెయ్యి – ఒక స్పూను
లవంగాలు – ఐదు
కారం – ఒక స్పూను
యాలకులు – మూడు
దాల్చిన చెక్క – చిన్న ముక్క
అల్లం వెల్లుల్లి పేస్టు – ఒక స్పూన్
కరివేపాకు – గుప్పెడు
పసుపు – అర స్పూన్
జీలకర్ర – ఒక స్పూను
ఉప్పు – రుచికి సరిపడా
నూనె – తగినంత
గోంగూర పన్నీర్ కర్రీ రెసిపీ
1. స్టవ్ మీద గిన్నె పెట్టి రెండు గ్లాసుల నీళ్లు పోయాలి.
2. ఆ నీళ్లు వేడెక్కిన తర్వాత పనీర్ మొత్తాన్ని అందులో వేసి ఐదు నిమిషాలు చిన్న మంట మీద వేడెక్కనివ్వాలి.
3. తర్వాత దాన్ని తీసి బయట పెట్టాలి. ఇప్పుడు మీకు కావాల్సిన సైజులో దాన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి.
4. ఇలా ముందుగానే కాసేపు ఉడికించడం వల్ల పనీరు తురుములాగా ముక్కలు ముక్కలు కాకుండా ఉంటుంది.
5. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నీళ్ళు పోయాలి. అందులో గోంగూరను వేసి ఉడకబెట్టాలి. తరువాత ఆకును తీసి పక్కన పెట్టుకోవాలి.
6. స్టవ్ మీద కళాయి పెట్టి నెయ్యి వేయాలి. అందులో ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి, లవంగాలు, దాల్చిన చెక్క, జీలకర్ర, యాలకులు, జీడిపప్పు వేసి వేయించాలి.
7. అవి బ్రౌన్ రంగు వచ్చేవరకు వేయించి చల్లార్చాలి.
8. మిక్సీ జార్ లో వీటన్నింటినీ వేసి మెత్తగా గ్రైండ్ చేసి ఒక గిన్నెలో వేసుకోవాలి.
9. ఆ తర్వాత అదే మిక్సీ గిన్నెలో ఉడకబెట్టుకున్న గోంగూరను కూడా వేసి మెత్తగా చేసుకోవాలి.
10. ఇప్పుడు కళాయి స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.
11. నూనె వేడెక్కాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి.
12. ఆ తర్వాత గుప్పెడు కరివేపాకులు కూడా వేయాలి.
13. ఆ మిశ్రమంలో ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల మిశ్రమాన్ని వేసి వేయించాలి.
14. ఇది బాగా వేగాక గోంగూర పేస్టును కూడా వేసి వేయించాలి.
15.అందులోనే పసుపు, కారం, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా వేయించుకోవాలి.
16. ఇవన్నీ బాగా వేగాక ముందుగా ఉడికించుకున్న పన్నీర్ ముక్కలను కూడా వేసి ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వాలి.
17. ఆ తర్వాత ఒక కప్పు నీళ్లు పోసి చిన్న మంట మీద ఉడికించాలి.
18. అంతే పనీర్ గోంగూర కర్రీ రెడీ అయినట్టే.
19. దీన్ని చపాతీలోని లేకపోతే అన్నంలోనే కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది.