Warangal National Highway 163 : ఎన్ హెచ్-163 లోపాలపై సర్కారు ఫోకస్

Best Web Hosting Provider In India 2024

National Highway 163 : వరంగల్ లో ప్రయాణ కష్టాలు తీర్చేందుకు నిర్మించిన జాతీయ రహదారి-163 బైపాస్ జనాల్ని అవస్థలు పాల్జేస్తోంది. వరంగల్ రింగ్ రోడ్డుగా ఉపయోగపడుతున్న ఈ దారి పొడవునా డిజైనింగ్ లోపాలు ఉండగా.. ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాలాచోట్లా ప్రమాదాల బారినపడి ప్రాణాలు కూడా కోల్పోయిన వారున్నారు. రోడ్డు వినియోగంలోకి వచ్చినప్పటి నుంచి ఇవే ఇబ్బందులు ఎదురవుతుండగా ఎట్టకేలకు సర్కారు కదిలొచ్చింది. కొద్దిరోజుల్లోనే మేడారం జాతర ప్రారంభం కానుండగా లక్షల్లో రాకపోకలు సాగించే వాహనాల దృష్ట్యా రింగ్ రోడ్డు లోపాలను సరిదిద్దే ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగానే రాష్ట్ర బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రెవెన్యూ, హౌజింగ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి శనివారం ఉదయం హనుమకొండ జిల్లా కరుణాపురం వద్ద జాతీయ రహదారిని పరిశీలించనున్నారు. అనంతరం ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశం కానున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు

రింగ్ రోడ్డుపై నిర్మాణ లోపాలు

హైదరాబాద్​ వైపు నుంచి వరంగల్ మీదుగా వివిధ ప్రాంతాలకు వెళ్లే వాహనాలు వరంగల్​ నగరంలోకి ప్రవేశించకుండా ఉండేందుకు హైదరాబాద్​–భూపాలపట్నం నేషనల్​ హైవే–163లో భాగంగా యాదగిరిగుట్ట నుంచి దామెర 99 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మించారు. దాదాపు 2 వేల కోట్ల వరకు ఖర్చు చేసి ఈ రోడ్డును నిర్మించగా.. చాలాచోట్లా నిర్మాణ లోపాలు వాహనదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. రింగ్​ రోడ్డుపై హైదరాబాద్​ నుంచి వరంగల్ సిటీ లోపలికి వచ్చే వెహికిల్స్​ కరుణాపురం వద్ద గందరగోళానికి గురవుతున్నాయి. అక్కడ సరైన ప్లాన్​ చేయకపోవడం వల్ల సిటీకి వచ్చే మార్గం అర్థం కాక వాహనదారులు కన్ఫ్యూజ్ అవుతున్నారు. దీనిపై ఫిర్యాదులు వెల్లువెత్తగా ఆఫీసర్లు వరంగల్ వెళ్లే మార్గం వద్ద కాకతీయ కళాతోరణాన్ని ఏర్పాటు చేసి వదిలేశారు. అయినా చాలామంది ఇప్పటికీ అక్కడ అయోమయానికి గురవుతున్నారు.

కరీంనగర్ వైపు వెళ్లాలంటే ఇబ్బందే

ములుగు వైపు నుంచి రింగ్ రోడ్డు మీదుగా వచ్చిన వాహనాలు కరీంనగర్​ వైపు వెళ్లాలంటే చుక్కలు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ములుగు వైపు నుంచి వచ్చిన వాహనాలు చింతగట్టు క్యాంప్​ వద్ద రింగ్​ రోడ్డు దిగి, వరంగల్–కరీంనగర్​ హైవే ఎక్కాలి. కానీ ఇంజినీరింగ్ అధికారుల ప్లానింగ్ లోపం వల్ల వాహనాలు చుట్టూ తిరగాల్సి వస్తోంది. భీమారం వరకు వెళ్లి యూ టర్న్​ తీసుకోని రావడమో.. రింగ్ రోడ్డు మీదుగా చింతగట్టు వరకు వెళ్లి సర్వీస్ రోడ్డు ద్వారా కరీంనగర్ హైవే ఎక్కడమో చేయాల్సి వస్తోంది. ఫలితంగా వాహనదారులకు ఇబ్బందులతో పాటు ట్రాఫిక్​ సమస్యలు ఏర్పడుతున్నాయి.

 

కదిలిన సర్కారు పెద్దలు

రింగ్ రోడ్డు ప్రారంభం తర్వాత ప్రజాప్రతినిధులతో పాటు అధికారులకు ఇక్కడి నిర్మాణ లోపాలు తెలిసి వచ్చాయి. వాహనదారులు ఫిర్యాదు చేయడంతో గత ప్రభుత్వం లోపాలు సరిదిద్దే ప్రయత్నం చేసింది. కానీ ఆ తర్వాత పట్టించుకునే నాథులు లేక సమస్య కు పరిష్కారం దొరకకుండా పోయింది. ఈ నేపథ్యంలో కొద్దిరోజుల్లోనే మేడారం జాతర ప్రారంభం కానుండగా కాంగ్రెస్ ప్రభుత్వం రింగ్ రోడ్డు లోపాలపై దృష్టి పెట్టింది. ఇక్కడి సమస్య కు పరిష్కార మార్గం చూపేందుకు హనుమకొండ జిల్లా కరుణాపురం వద్ద జాతీయ రహదారిపై లోపాలను పరిశీలించేందుకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శనివారం ఈ రోడ్డును విజిట్ చేయనున్నారు. నేషనల్ హైవే, ఆర్ అండ్ బీ అధికారులతో పాటు జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, గ్రేటర్ కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, ఇతర నేతలతో కలిసి శనివారం ఉదయం 9 గంటలకు రోడ్డును పరిశీలిస్తారు. అనంతరం అధికారులతో చర్చించి నిర్మాణ లోపాలు సరిదిద్దే కసరత్తు చేయనున్నారు. గత ప్రభుత్వం అప్పట్లో హడావుడి చేసి రింగ్ రోడ్డు లోపాలను లైట్ తీసుకోగా.. ఇప్పటి నేతలైనా సరైన సొల్యూషన్ చూపాలని ఓరుగల్లు ప్రజలు కోరుతున్నారు.

 

ఉమ్మడి జిల్లా పనులపై సమీక్ష

శనివారం హనుమకొండ కు రానున్న జిల్లా ఇంచార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు, అధికారులతో హనుమకొండ కలెక్టరేట్ లో ఉదయం 10 గంటలకు సమావేశం కానున్నారు. వరంగల్ రింగ్ రోడ్డుతో పాటు ఉమ్మడి జిల్లాలో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పనులపై సమీక్ష చేస్తారు. జిల్లాకు చెందిన మంత్రులు కొండా సురేఖ, సీతక్క, ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ సమీక్ష సమావేశానికి హాజరు కానున్నారు.

WhatsApp channel
 

టాపిక్

 
WarangalTelangana News

Source / Credits

Best Web Hosting Provider In India 2024