Best Web Hosting Provider In India 2024
Vegetable Pulao: కూరలు, బిర్యానీలు, పులావ్‌లు వండాలంటే నూనె కచ్చితంగా ఉండాలి. నూనె అధికంగా తింటే బరువు పెరుగుతామనే భయం ఉంది. ఎవరైతే డైటింగ్ లో ఉంటారో వారు ఆయిల్ అవసరం లేకుండానే టేస్టీగా వెజిటబుల్ పులావ్ ను వండుకోవచ్చు. దీని రుచి అదిరిపోతుంది. ఇందుకోసం ఒక్క చుక్క ఆయిల్ కూడా వేయాల్సిన అవసరం లేదు. దీన్ని తినడం వల్ల బరువు పెరగరు. దీనిలో ఎన్నో కూరగాయల ముక్కలను వేస్తాము. కాబట్టి ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఆయిల్ అవసరం లేకుండా వెజిటబుల్ పులావ్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.
నూనె వేయకుండా వెజిటేబుల్ పులావ్ రెసిపీకి కావలసిన పదార్థాలు
బాస్మతి బియ్యం – రెండు కప్పులు
బీన్స్ తరుగు – అరకప్పు
క్యారెట్ తరుగు – పావు కప్పు
కాలీఫ్లవర్ తరుగు – పావు కప్పు
పాలు – ఒక కప్పు
పసుపు – అర స్పూను
కారం – ఒక స్పూను
గరం మసాలా – ఒక స్పూను
బిర్యాని ఆకులు – రెండు
లవంగాలు – మూడు
నల్ల మిరియాలు – ఐదు
దాల్చిన చెక్క – చిన్న ముక్క
యాలకులు – నాలుగు
జాజికాయ – చిన్న ముక్క
ఉప్పు – రుచికి సరిపడా
కొత్తిమీర తరుగు – మూడు స్పూన్లు
జీడిపప్పు – గుప్పెడు
నూనె వేయకుండా వెజిటబుల్ పులావ్ రెసిపీ
1. బాస్మతి బియ్యాన్ని ముందుగానే కడిగి అరగంట పాటు నీళ్లలో నానబెట్టుకోవాలి.
2. మరోపక్క స్టవ్ మీద కుక్కర్ పెట్టి పాలు వేయాలి.
3. పాలు వేడెక్కాక చిన్న మంట మీద ఉంచాలి.
4. అందులో లవంగాలు, జాజికాయ, బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క, యాలకులు వేసి వేయించాలి.
5. అవి కాస్త మరిగితే ఉడికినట్టు అవుతాయి.
6. తర్వాత అందులోనే క్యారెట్లు, బీన్స్, కాలీఫ్లవరు తరిగిన ముక్కలను వేసి కలుపుకోవాలి.
7. మూత పెడితే ఉడుకుతాయి. మూత తీసి ఆ మిశ్రమంలో పసుపు, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.
8. జీడిపప్పులను కూడా వేసి కలపాలి.
9. మిరియాలు, కారం, గరం మసాలా కూడా వేసి బాగా కలుపుకోవాలి.
10. ఆ మిశ్రమంలో పాలు ఇంకిపోయి ఇగురు లాగా దగ్గరగా అయ్యేవరకు చిన్న మంట మీద ఉడికించాలి.
11. ఆ తర్వాత ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని అందులో వేసి పైన కొత్తిమీరను చల్లుకోవాలి.
12. బియ్యం ఉడకడానికి సరిపడా నీటిని కూడా వేసుకోవాలి.
13. విజిల్ పెట్టి మూడు విజిల్స్ వచ్చేవరకు ఉంచాలి.
14. ఆవిరి పోయాక తీస్తే టేస్టీ వెజిటబుల్ పులావ్ రెడీ అయినట్టే.
15. దీనిలో నూనె వాడలేదు కాబట్టి ఆరోగ్యానికి ఎంతో మంచిది. డైటింగ్‌లో ఉన్నవారు, బరువు తగ్గాలనుకుంటున్న వారు ఈ రెసిపీని ప్రయత్నించండి.
ఈ వెజిటబుల్ పులావ్‌లో బియ్యంతో పాటు మనం క్యారెట్లు ,బీన్స్, కాలీఫ్లవర్ వంటి కూరగాయలను వినియోగించాము. ఇవన్నీ కూడా ఆరోగ్యానికి మేలు చేసేవి. అలాగే లవంగాలు, పసుపు, జాజికాయ, యాలకుల్లో కూడా ఎన్నో ఆరోగ్య లక్షణాలు ఉన్నాయి. వీటిని తినడం వల్ల మన శరీరానికి రోగనిరోధక శక్తి అందుతుంది. ఇలా ఆయిల్ లేకుండా వెజిటబుల్ పులావ్ ను అప్పుడప్పుడు చేసుకొని తినండి. ఇది టేస్టీగా ఉంటుంది. ఇలా ఎగ్ పులావ్ ను కూడా చేసుకోవచ్చు. కానీ చికెన్, మటన్ పులావ్ చేయలేము. పాలల్లో చికెన్, మటన్ ముక్కలు ఉడకడానికి చాలా సమయం పడుతుంది. మాడిపోయే అవకాశం ఉంటుంది. వెజిటబుల్ పులావ్, ఎగ్ పులావ్ ఇలా నూనె లేకుండా టేస్టీగా వండుకోవచ్చు.
టాపిక్