Best Web Hosting Provider In India 2024
Pushpa 2 announcement: అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 మేకర్స్ సస్పెన్స్ తో చంపేస్తున్నారు. మంగళవారం (ఏప్రిల్ 2) నుంచి పుష్ప మాస్ జాతర మొదలు కానుందని ఒక రోజు ముందే వెల్లడించిన మేకర్స్.. తాజాగా మరో అప్డేట్ ఇచ్చారు. మరికొన్ని గంటల్లోనే అభిమానులు ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న అప్డేట్ రాబోతోందని అందులో వెల్లడించారు.
పుష్ప 2 మాస్ జాతర
పుష్ప 2 మూవీ ఈ ఏడాది ఆగస్ట్ 15న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. అయితే ఏప్రిల్ 8వ తేదీన అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా మేకర్స్ నుంచి పెద్ద సర్‌ప్రైజ్ రానుందని ఎప్పటి నుంచో ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. ఊహించినట్లే వారం రోజుల ముందు నుంచే హడావిడి మొదలైంది. అందులో భాగంగా ఈరోజు (ఏప్రిల్ 2) సాయంత్రం 4.05 గంటలకు మోస్ట్ అవేటెడ్ అనౌన్స్‌మెంట్ రాబోతోందని మేకర్స్ ఎక్స్ ద్వారా చెప్పారు.
“పుష్ప మాస్ జాతర ఇవాళ్టి నుంచే ప్రారంభం కానుంది. ఇవాళ సాయంత్రం 4.05 గంటలకు మోస్ట్ అవేటెడ్ అనౌన్స్‌మెంట్ ఉండనుంది. పుష్ప2 ది రూల్ గ్రాండ్ రిలీజ్ ఆగస్ట్ 15, 2024న” అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్నా, సుకుమార్, ఫహాద్ ఫాజిల్, దేవిశ్రీప్రసాద్, సుకుమార్ రైటింగ్స్ లను ట్యాగ్ చేసింది మైత్రీ మూవీ మేకర్స్.
దీంతో ఆ మోస్ట్ అవేటెడ్ అనౌన్స్‌మెంట్ ఏంటో అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అది కచ్చితంగా టీజర్ కు సంబంధించిన అనౌన్స్‌మెంట్ అయి ఉంటుందని భావిస్తున్నారు. పుష్ప మూవీ సూపర్ డూపర్ హిట్ కావడంతో ఈ సీక్వెల్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మూవీ నుంచి ప్రతి అప్డేట్ ను ఫ్యాన్స్ ఆసక్తిగా గమనిస్తున్నారు.
పుష్ప 2 రిలీజ్ ఆ రోజే
పుష్ప 2 రిలీజ్ వాయిదా పడనుందని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. షూటింగ్ ఇంకా పూర్తి కాకపోవడమే దీనికి కారణం. కానీ మేకర్స్ మాత్రం ఆగస్ట్ 15నే మూవీ రిలీజ్ అవుతుందని కచ్చితంగా చెబుతున్నారు. అందుకే తాము ఇచ్చే ప్రతి అప్డేట్ లోనూ గ్రాండ్ రిలీజ్ ఆగస్ట్ 15నే నొక్కి చెబుతున్నారు. తాజా అప్డేట్ లోనూ మరోసారి అదే విషయాన్ని స్పష్టంగా చెప్పారు.
అల్లు అర్జున్, రష్మిక మందన్నా, ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మొదటి పార్ట్ ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకుపైగా వసూలు చేసింది. దీంతో ఈ సీక్వెల్ మరింత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. అదే స్థాయిలో కలెక్షన్లు కూడా రావాలంటే భారీ ఓపెనింగ్స్, పాజిటివ్ టాక్ చాలా అవసరం. దీనికోసమే సుకుమార్ పుష్ప 2ను చాలా జాగ్రత్తగా చెక్కుతుండటంతో షూటింగ్ చాలా నెమ్మదిగా సాగుతోంది.