Best Web Hosting Provider In India 2024
Pest control: నెలకు సరిపడా పప్పులు, బియ్యం ఇంట్లో కొని పెట్టుకునే వారి సంఖ్య చాలా ఎక్కువ. కానీ వాటిల్లో ఒక్కోసారి పురుగు చేరిపోతుంది. ఒక్క దానిలో పురుగు చేరిందా? మిగతా ఆహారాలకూ పాకేస్తుంది. అలా పురుగు చేరకుండా ఉండాలంటే చిన్న చిట్కాను పాటించండి. మీరు చేయాల్సిందల్లా ఇంగువను పప్పులో వేయడమే. చిన్న ఇంగువ ముక్కను పప్పు డబ్బాలో వేశారంటే పురుగు చేరకుండా ఉంటుంది. అలాగే బియ్యంలో వేసినా కూడా పురుగు చేరదు. ఇంగువ తినే పదార్థమే కాబట్టి పప్పులు, బియ్యాల్లో కలిసిపోయినా ప్రమాదమేమీ లేదు.
కొంతమంది పురుగు పట్టకుండా ఉండడం కోసం బియ్యం లో బోరిక్ పొడి కలుపుతూ ఉంటారు. అది మంచి పద్ధతి కాదు. బోరిక్ ఆమ్లం అనేది ఒక రసాయనం. దాని బదులు ఇంగువను వేసుకోవడమే మంచిది.
ఇంగువను అసఫోటిడా అని కూడా పిలుస్తారు. దీని వాసన కీటకాలకు, పురుగులకు నచ్చదు. ఇంగువ ఘాటైన వాసనను కీటకాలు తట్టుకోలేవు. కాబట్టి ధాన్యం ఉన్న గోదాములలో లేదా కంటైనర్లలో ఇంగువను చిన్న చిన్న ముక్కలుగా చేసి వేయండి. ఇది తెగులు పట్టకుండా పురుగుపుట్రా చేరకుండా బియ్యాన్ని కాపాడుతుంది.
వంటల్లో అనుకోకుండా ఈ ఇంగువ పడిపోయినా ఏమీ కాదు. వంటలకు అదనంగా రుచిని, వాసనను అందిస్తుంది. లేదా ఇంగువ పొడిని ఒక చిన్న వస్త్రంలో కట్టి పప్పులలో ఉంచినా సరిపోతుంది. ఆ ఇంగువను మళ్లీ ఉపయోగించుకోవచ్చు కూడా.
పప్పులు, ఉప్పులు, బియ్యాలు చెడు వాసన రాకుండా ఉండాలన్నా… ఇంగవ ఒక వస్త్రంలో కట్టి కంటైనర్లలో ఉంచినా చాలు. వాటి జీవితకాలం కూడా పెరుగుతుంది. తెగులు రాకుండా ఉంటాయి. ఇంగువ ఆరోగ్యానికి మేలు చేయడమే కాదు, కీటకాలను దూరంగా పెడుతుంది.
ఇంగువ ఉపయోగాలు
ఇంగువ తినడం వల్ల శ్వాస సంబంధ వ్యాధులు రాకుండా ఉంటాయి. కఫాన్ని తగ్గించే శక్తి ఇంగువకు ఉంటుంది. కాబట్టి పప్పుల్లో, బియ్యాల్లో వేసిన ఇంగువ పొరపాటున కూరల్లో పడినా ఆరోగ్యానికి మంచిదే. ఛాతీ ఒత్తిడిగా అనిపించినప్పుడు ఇంగువను తినడం వల్ల ఉపయోగం ఉంటుంది. ఇంగువ పొడిలో కాస్త తేనె, అల్లం రసం కలుపుకొని తాగితే పొడి దగ్గు, కోరింత దగ్గు వంటివి తగ్గే అవకాశం ఉన్నాయి. తరచూ ఇంగువను ఆహారంలో భాగం చేసుకోవాలని పోషకాహార నిపుణులు కూడా చెబుతున్నారు.
టాపిక్