Best Web Hosting Provider In India 2024
Sudigali Sudheer sarkaar: తన కామెడీతో అదరగొట్టే సుడిగాలి సుధీర్ ఇప్పుడు ఆహా ఓటీటీ సర్కార్ షో చేయబోతున్నాడు. సెలబ్రిటీలపై ప్రశ్నల వర్షం కురిపించి వినోదాన్ని పంచే ఈ రియాల్టీ షో నాలుగో సీజన్ రాబోతోంది. దీనికి కొత్త హోస్ట్ గా సుధీర్ ను ఆహా అనౌన్స్ చేసింది. ఈ విషయాన్ని ఆ ఓటీటీయే తమ ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది.
సుడిగాలి సుధీర్ సర్కార్
ప్రముఖ తెలుగు ఓటీటీ ఆహాలో విజయవంతంగా నడుస్తున్న రియాల్టీ షో సర్కార్. గతంలో ప్రదీప్ మాచిరాజు హోస్ట్ గా వ్యవహరించిన ఈ షోకి ఇప్పుడు నాలుగో సీజన్ రాబోతోంది. ఈ కొత్త సీజన్లో హోస్ట్ కూడా మారిపోయాడు. కొత్తగా సుడిగాలి సుధీర్ ఎంట్రీ ఇస్తున్నట్లు ఆహా ఓటీటీ వెల్లడించింది. త్వరలోనే కొత్త సీజన్ ప్రారంభం కానున్నట్లు చెప్పింది.
తన స్పాంటేనిటీతో నవ్వులు పూయించే సుడిగాలి సుధీర్.. ఈ షోని సక్సెస్ చేస్తాడన్న నమ్మకంతో ఆహా ఉంది. సర్కార్ ఓ సెలబ్రిటీ గేమ్ షో. 2021లో ప్రారంభమైంది. తమిళంలో జీవా ఈ షోకి హోస్ట్ గా ఉన్నాడు. ఆహా తమిళం ఓటీటీ ఈ షోని స్ట్రీమింగ్ చేస్తోంది. తెలుగులో తొలి మూడు సీజన్లు పూర్తి చేసుకుంది. ప్రదీప్ హోస్ట్ గా రాగా.. ఇప్పుడు సుధీర్ ని తెరపైకి తెస్తున్నారు.
ఇక గత సీజన్లో రానా, సాయి పల్లవి, సిద్దూ జొన్నలగడ్డ, విశ్వక్ సేన్, శ్రీ విష్ణు, ప్రియమణి, సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ లాంటి సెలబ్రిటీలు ఈ షోకి వచ్చారు. అయితే ఇప్పుడు సుధీర్ హోస్ట్ గా రావడంతో ఈ షో మరింత ఎంటర్టైనింగ్ గా ఉంటుందని అతని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ కొత్త సీజన్ స్ట్రీమింగ్ తేదీ, సెలబ్రిటీల లిస్ట్ రివీల్ కావాల్సి ఉంది.
సుడిగాలి సుధీర్ షోస్
ఈటీవీలో వచ్చే జబర్దస్త్ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన కమెడియన్ సుడిగాలి సుధీర్. ఆ షోలో సక్సెస్ తర్వాత ఈటీవీతోపాటు స్టార్ మా, జీ తెలుగులాంటి ఛానెల్స్ లో పలు షోలకు హోస్ట్ గా ఉన్నాడు. ఓవైపు సినిమాలతో బిజీగా ఉంటూనే.. మరోవైపు బుల్లితెరను కూడా వదల్లేదు. ఈటీవీలో శ్రీదేవి డ్రామా కంపెనీ, అల్లుడా మజాకాలాంటి షోలతో.. స్టార్ మాలో సూపర్ సింగర్ జూనియర్స్, పార్టీ చేద్దాం పుష్పలాంటి షోలు సుధీర్ చేశాడు.
గతంలో ఆహా ఓటీటీలో కామెడీ స్టార్ ఎక్స్‌ఛేంజ్ షోకి కూడా అతడు హోస్ట్ గా ఉన్నాడు. ఇప్పుడు సర్కార్ షోతో మరోసారి ఆహాలోకి వెళ్తున్నాడు. 2013 నుంచి అతడు సినిమాల్లోనూ బిజీగా ఉంటున్నాడు. గత రెండేళ్లలో గాలోడు, కాలింగ్ సహస్ర లాంటి సినిమాల్లో లీడ్ రోల్స్ కూడా చేశాడు. చాలా సినిమాల్లో కమెడియన్ గానూ నటించాడు.
ఆహా ఓటీటీ షోస్ ఇవే
కేవలం తెలుగు కంటెంట్ తో రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు దగ్గరైన ఓటీటీ ఆహా. ఈ డిజిటల్ ప్లాట్‌ఫామ్ పై ఇప్పటికే ఎన్నో రియాల్టీ షోలు వచ్చాయి. ఎన్నో తెలుగు ఒరిజినల్స్ ను ఈ ఓటీటీ క్రియేట్ చేసింది. ఇండియన్ ఐడల్ తెలుగు, చెఫ్ మంత్ర, అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే, ఫ్యామిలీ ధమాకా, నేను సూపర్ వుమన్, డ్యాన్స్ ఐకాన్ లాంటి ఎన్నో రియాల్టీ షోలు ఈ ఓటీటీలో ఉన్నాయి.