Best Web Hosting Provider In India 2024
Vijay Devarakonda Ugadi Ummadi Kutumbam: రౌడీ హీరో విజయ్ దేరవకొండ నటించిన తాజా సినిమా ఫ్యామిలీ స్టార్. సీతారామం, హాయ్ నాన్న బ్యూటి మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా చేస్తున్న ఈ చిత్రానికి డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వం వహించారు. గీత గోవిందం సినిమా తర్వాత విజయ్-పరశురామ్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఫ్యామిలీ స్టార్ మూవీని ఏప్రిల్ 5న వరల్డ్ వైడ్‌గా చాలా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేయనున్నారు.
ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నాడు. ప్రముఖ తెలుగు టీవీ ఛానెల్ జీ తెలుగులో ఉగాది సందర్భంగా విజయ్ దేవరకొండ బుల్లితెరపై సందడి చేయనున్నాడు. విజయ్‌తోపాటు బ్యూటిఫుల్ మృణాల్ ఠాకూర్ కూడా టీవీలో కనిపించి సందడి చేయనుంది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..
వైవిధ్యమైన కార్యక్రమాలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న ప్రముఖ ఛానల్ జీ తెలుగు. ప్రతిరోజూ ఆసక్తికరమైన సీరయల్స్, వారాంతాల్లో సరికొత్త సినిమాలతో పాటు పండుగలకు ప్రత్యేక కార్యక్రమాలతో ప్రేక్షకులకు అంతులేని వినోదం పంచుతున్న జీ తెలుగు ఈ ఉగాదికి మరో అదిరిపోయే కార్యక్రమంతో వచ్చేస్తోంది. టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ముఖ్యఅతిథిగా తెలుగు నూతన సంవత్సరాది ఉగాది పండగ ఉత్సవం ఫ్యామిలీ స్టార్‌తో జరగనుంది.
ఏప్రిల్ 7 ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు ఉగాది ఉమ్మడి కుటుంబం కార్యక్రమం జీ తెలుగులో ప్రసారం కానుంది. నూతన సంవత్సరాది ఉగాది పండగని జీ తెలుగు నటీనటులందరూ ఘనంగా జరుపుకున్న ఈ ప్రత్యేక కార్యక్రమంలో హీరో విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరై సందడి చేశారు. జీ తెలుగు తారలతో కలిసి విజయ్ చేసిన డ్యాన్స్ అందరినీ ఆకట్టుకుంది. ఇక డ్రామా జూనియర్స్ పిల్లలు విజయ్ దేవరకొండ కోసం ప్రత్యేకంగా చేసిన స్కిట్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తుంది.
సరదాలతో సంబరంగా సాగే ఈ కార్యక్రమంలో విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ ఫ్యామిలీ స్టార్ ట్రైలర్‌ను ప్రదర్శించారు. జీ తెలుగు నటీనటులు, ప్రముఖ సినీతారలతో సందడిగా సాగిన ఈ కార్యక్రమంలో రాశి, కస్తూరి, సితార, నాగినీడు, ఇషా చావ్లా, దీప్తి మన్నె, అనిల్ వంటల పోటీలో పాల్గొన్నారు. ఇక ఈ కార్యక్రమంలో ప్రముఖ కమెడియన్ అలీ సంభాషణలు నవ్వులు పంచుతాయి. రెట్రో స్పెషల్ స్కిట్స్‌లో ఎన్టీఆర్-సావిత్రిగా రాఖీ- ఐశ్వర్య, కృష్ణ-జయప్రదగా యశ్వంత్- సుస్మిత, కృష్ణంరాజు-జయసుధగా రఘు- గౌతమి, ఏఎన్నార్-శ్రీదేవిగా మనోజ్- సౌందర్య ప్రత్యేక ప్రదర్శనతో ఆకట్టుకున్నారు.
వేలు స్వామిగా బిత్తిరి సత్తి తనదైన శైలిలో పంచాంగం చెప్పి కడుపుబ్బా నవ్వించారు. ఆషికా పదుకొణె, తేజస్విని జుగల్బందీ డాన్స్ కాంపిటీషన్ అందరినీ ఆకట్టుకుంటుంది. తదనంతరం, ప్రతి ఆదివారం రాత్రి 9 గంటలకి ప్రేక్షకులని అలరిస్తున్న సూపర్ జోడి కార్యక్రమంలో ఈ వారం మృణాల్ ఠాకూర్ సందడి చేసి జోడీల్లో మరింత జోష్ పెంచారు. ఆటలు, పాటలు, అల్లరి, అద్భుత ప్రదర్శనలు, సరదా సంబరాలతో సాగిన ఈ ఉగాది ప్రత్యేక కార్యక్రమాలను తెలుగు ప్రేక్షకుల కోసం జీ తెలుగు అందించనుంది.