Best Web Hosting Provider In India 2024
Netflix: ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ లో ఈ మధ్యే వచ్చిన కామెడీ వెబ్ సిరీస్ మామ్లా లీగల్ హై. తొలి సీజన్ కు మంచి రెస్పాన్స్ రావడంతో ఈ సిరీస్ రెండో సీజన్ కూడా తీసుకురానున్నట్లు ఆ ఓటీటీ వెల్లడించింది. గత నెల 1వ తేదీ నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. రవి కిషన్, నిధి బిష్త్, యశ్‌పాల్ శర్మ నటించిన ఈ కోర్టు రూమ్ డ్రామా ప్రేక్షకులను ఆకట్టుకుంది.
మామ్లా లీగల్ హై వెబ్ సిరీస్
మామ్లా లీగల్ హై ఓ కోర్టు రూమ్ కామెడీ డ్రామా. ఈ వెబ్ సిరీస్ కు సమీర్ సక్సేనా దర్శకత్వం వహించాడు. సౌరభ ఖన్నా, కునాల్ అనేజా దీనికి కథ అందించారు. పట్పడ్‌గంజ్ అనే ఓ కల్పిత జిల్లా కోర్టు, అందులోని లాయర్ల చుట్టూ తిరిగే కథే ఈ మామ్లా లీగల్ హై. మన దేశంలో న్యాయ వ్యవస్థ ఎలా ఉంటుందో సరదాగా చూపించే ప్రయత్నం మేకర్స్ చేశారు.
ప్రముఖ నటుడు రవి కిషన్ ఈ సిరీస్ లో వీడీ త్యాగి అనే ఓ సీనియర్ లాయర్ గా నటించాడు. ఆ జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న అతడు.. మొత్తం ఢిల్లీ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిని కావాలని కలలు కంటూ ఉంటాడు. అంతేకాదు ఏదో ఒక రోజు అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా కావాలనేది తన లక్ష్యమని చెబుతూ ఉంటాడు.
అందులో భాగంగా మొదట ఢిల్లీ బార్ అసోసియేషన్ కు అధ్యక్షుడు కావాలని అనుకునే త్యాగి.. ఎన్నికల్లో పోటీ పడటానికి సిద్ధపడతాడు. అయితే అతనికి బలమైన ప్రత్యర్థి ఎదురవుతాడు. అతన్ని బోల్తా కొట్టించి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కావాలనుకునే త్యాగి.. చివరికి ఊహించని పదవిని ఎలా అందుకుంటాడన్నది ఈ సిరీస్ లో కాస్త ఫన్ జోడించి సరదాగా చూపించారు.
మామ్లా లీగల్ హై సీజన్ 2
మామ్లా లీగల్ హై తొలి సీజన్ కు మంచి రెస్పాన్స్ రావడంతో ఇప్పుడు రెండో సీజన్ తీసుకురావడానికి నెట్‌ఫ్లిక్స్ సిద్ధమవుతోంది. గురువారమే (ఏప్రిల్ 4) దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తొలి సీజన్ కు వచ్చిన రెస్పాన్స్ తనకు చాలా ఆనందం కలిగించిందని డైరెక్టర్ సమీర్ సక్సేనా అన్నాడు. దీని క్రెడిట్ మొత్తాన్ని అతడు నెట్‌ఫ్లిక్స్ కే ఇచ్చాడు.
“పెద్ద సంఖ్యలో ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే ఇలాంటి స్టోరీలను నెట్‌ఫ్లిక్స్ తో కలిసి తెరకెక్కించడం చాలా ఉత్సాహాన్ని ఇస్తోంది. రెండో సీజన్ తో పట్పడ్‌గంజ్ జిల్లా కోర్టుకు సంబంధించిన మరిన్ని కేసులను మీ ముందుకు తీసుకొస్తాం” అని అన్నాడు. ఇక మామ్లా లీగల్ హై రెండో సీజన్ కోసం తాము ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని నెట్‌ఫ్లిక్స్ ఇండియా సిరీస్ హెడ్ తాన్యా బామి అన్నారు.
మామ్లా లీగల్ హై సిరీస్ ను పోషమ్ పా పిక్చర్స్ ప్రొడ్యూస్ చేసింది. కోర్టు రూమ్ డ్రామాకు కామెడీ జోడించి తీసుకొచ్చిన ఈ వెబ్ సిరీస్ ఓటీటీ ప్రేక్షకులకు బాగా నచ్చింది.