Waragal RDO Office: పరిహారం చెల్లింపులో నిర్లక్ష్యం..వరంగల్‌ ఆర్డీఓ ఆఫీసు జప్తుకు హైకోర్టు ఉత్తర్వులు

Best Web Hosting Provider In India 2024

Waragal RDO Office: వరంగల్ ఆర్డీఓ RDO Office కార్యాలయం జప్తుకు హైకోర్టు TS High court ఆదేశించడం కలకలం రేపింది. రైతుకు పరిహారం డబ్బులు చెల్లించలేకుంటే ఆర్డీవో ఆఫీస్ ను రైతుకు స్వాధీనం చేయాలని స్పష్టం చేసింది. దీంతో హైకోర్టు నుంచి వచ్చిన ప్రత్యేక అధికారులు ఈ మేరకు ఆర్డీవో ఆఫీస్ లోని వస్తువులను జప్తు చేయగా.. జిల్లా అధికారులు ఏం చేయాలో తోచక తలలు పట్టుకున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు

ఈ ఘటన వరంగల్ జిల్లాలో జరిగింది. బాధితులు, అధికారులు తెలిపిన ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి… గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వరంగల్ జిల్లా గీసుగొండ మండలం శాయంపేట శివారులో కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ textile Park ఏర్పాటు చేశారు.

టెక్స్ టైల్ పార్కు ఏర్పాటుకు 1,200 ఎకరాలు అవసరం కాగా.. 2016లో అప్పటి ప్రభుత్వం ఆ చుట్టుపక్కల ఉన్న రైతుల భూములను సేకరించింది. ఈ మేరకు అప్పట్లోనే ఎకరానికి రూ.10 లక్షల చొప్పున భూనిర్వాసితులకు పరిహారం చెల్లించారు. అప్పటికీ స్థలం సరిపోకపోవడంతో 2020లో మరోసారి అక్కడి రైతులు సముద్రాల యాకస్వామి, సముద్రాల వెన్నెలకు చెందిన మరో 20 ఎకరాల భూమిని కూడా తీసుకునేందుకు కసరత్తు చేసింది.

వారికి కూడా నాలుగేళ్ల కిందట ఇచ్చినట్టుగానే రూ.10 లక్షల చొప్పున పరిహారం Compensation చెల్లిస్తామని అధికారులు చెప్పారు. రోజురోజుకు ధరలు పెరిగిపోతుండటం, తాము జీవనాధారం కోల్పోతున్నామనే ఉద్దేశంతో యాకస్వామి, వెన్నెల ఆ ధరతో భూములు ప్రభుత్వానికి అప్పగించడానికి నిరాకరించారు. భూములకు డిమాండ్ పెరగడంతో కనీసం డబుల్ ధర అయినా చెల్లించాలని కోరారు. అధికారులు మాత్రం పట్టించుకోకుండా ప్రభుత్వం తరఫున నోటీసులు ఇచ్చి యాకస్వామి, వెన్నెలకు చెందిన భూమిని తీసుకున్నారు.

 

అధికారులకు షాక్ ఇచ్చిన హైకోర్టు

భూముల ధరలు, తమ జీవనాధారాన్ని పరిగణనలోకి తీసుకోకుండా అధికారులు పరిహారం నిర్ణయించడం, తమకు ఇష్టం లేకున్నా భూములు తీసుకోవడంతో రైతు యాకస్వామి పలుమార్లు అధికారుల చుట్టూ తిరిగారు. అయినా ఎవరు సరిగా స్పందించకపోవడంతో 2022లో రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు.

దాంతో వాదనలు, ప్రతివాదనలు విన్న హైకోర్టు పెరిగిన ధరలకు అనుగుణంగా 20 ఎకరాలకు రూ.2కోట్ల 40 లక్షల 14 వేలు పరిహారం చెల్లించాలని వరంగల్‌ ఆర్డీవోను ఆదేశిస్తూ గత సంవత్సరం మే 9న ఆదేశాలు ఇచ్చింది. అయినా అధికారులు పెద్దగా పట్టించుకోలేదు.

దీంతో యాకస్వామి పలుమార్లు అధికారుల చుట్టూ తిరిగారు. కానీ సరైన స్పందన లేకపోవడంతో హైకోర్టు ఈ ఏడాది ఫిబ్రవరి 27న కూడా మరోసారి అదే ఆదేశాలను ఇచ్చింది. వరంగల్ జిల్లా ఆఫీసర్లు హైకోర్టు ఆదేశాలను కూడా లెక్కచేయకుండా పెడచెవిన పెట్టారు.

దీంతో ఆర్డీవో, జిల్లా అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు యాకస్వామికి వెంటనే డబ్బులు చెల్లించాలని, లేదంటే ఆర్డీవో కార్యాలయాన్ని జప్తు చేసి ఆయనకు అప్పగించాలని ఉత్తర్వులు జారీ చేసింది.

ఆర్డీవో ఆఫీస్ జప్తు…

హైకోర్టు ఆదేశాల మేరకు ప్రత్యేక అధికారులు గురువారం హనుమకొండ కాళోజీ జంక్షన్ లోని ఆర్డీవో ఆఫీస్ కు వచ్చారు. ఈ మేరకు ఆర్డీవో ఆఫీస్ కు వచ్చి ఉత్తర్వులను చూపించారు. దీంతో రెవెన్యూ అధికారులు హైకోర్టు నుంచి వచ్చిన ఆఫీసర్ల బృందాన్ని గడువు కోసం ఒప్పించే ప్రయత్నం చేశారు.

 

అందుకు వారు ఒప్పుకోలేదు. హైకోర్టు ఆదేశాల మేరకు ఆర్డీవో స్కార్పియో కారు, ఆఫీస్ లోని కంప్యూటర్లు, ప్రింటర్లు, ఫర్నిచర్, ఏసీలు, కూలర్లు, ఇతర వస్తువులను జప్తు చేశారు. కాగా ఆ తరువాత పరిణామాలు ఎలా ఉంటాయోనని జిల్లాలో చర్చ జరుగుతోంది.

(హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)

 
WhatsApp channel
 

సంబంధిత కథనం

టాపిక్

 
 
WarangalHigh Court TsGovernment Of TelanganaTelugu NewsLatest Telugu NewsBreaking Telugu News
 

Source / Credits

Best Web Hosting Provider In India 2024