Warangal : వరంగల్ శివారులో అమానుషం – పసికందును ప్రాణాలతోనే పాతిపెట్టారు..!

Best Web Hosting Provider In India 2024

Warangal Crime News : వరంగల్ శివారులో ఓ దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆడపిల్ల భారమనుకున్న గుర్తు తెలియని వ్యక్తులు… చిన్నారి పుట్టిన కొద్దిసేపటికే భూమిలో పాతిపెట్టారు. 

ప్రాణాలతోనే శిశువును మట్టిలో కప్పిపెట్టి అక్కడి నుంచి వెళ్లిపోగా.. ఆ తరువాత కొద్దిసేపటికి ఓ లారీ మట్టిలో కదలికలు గమనించి అక్కడికి వెళ్లాడు. మట్టిని తోడి చూసి ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. మట్టి లోపల ఓ చిన్నారి గుక్కపట్టి ఏడ్వడం గమనించి… ఆ పక్కనే ఉన్న ఉపాధికూలీలతో పాటు స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో వారంతా కదలివచ్చి ఆ చిన్నారికి పునర్జన్మను ఇచ్చారు. 

ప్రత్యక్ష సాక్షులు, స్థానికులు తెలిపిన ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. శనివారం ఉదయం 11 గంటల సుమారులో లారీ డ్రైవర్ రామ్ బినయ్ వరంగల్–ములుగు హైవేపై ఊరుగొండ గ్రామ శివారులోని ఓ చెట్టు కింద బండిని ఆపాడు. ఎండలు దంచి కొడుతుండటంతో సేద తీరేందుకు అక్కడ ఆగాడు. ఏదో పరధ్యానంలో ఉన్న ఆయన దూరంగా భూమిలో ఏదో కదలిక జరగడం గమనించాడు. 

ఏమై ఉంటుందోనని ఆలోచిస్తూనే అటువైపు కదిలాడు. అక్కడికి వెళ్లి చూడగా.. భూమి లోపల ఏదో కదులుతున్నట్లు కనిపించింది. దీంతో వెంటనే మట్టిని తోడి చూడగా.. అందులోంచి ఓ నవజాత శిశువు కనిపించడంతో కంగు తిన్నాడు. ఏం చేయాలో అర్థం కాక చుట్టుపక్కల చూసే సరికి దూరంలో కొంతమంది ఉపాధి హామీ పనులు చేస్తూ కనిపించారు. తనకు తెలుగు రాకున్నా.. తనకు తెలిసిన పదాలతో కేకలు వేసి వారందరినీ పిలిచాడు. ఆ వెంటనే సమీపంలోని దామెర స్టేషన్ పోలీసులకు కూడా సమాచారం చేరవేశాడు.

బతికి బయటపడిన చిన్నారి…

వంద రోజుల పని చేస్తున్న మహిళలతో పాటు అదే మార్గంలో వెళ్తున్న ఎస్సై అశోక్ విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్నారు. అందులో కొందరు మహిళలు అక్కడున్న మట్టిని తోడగా.. ఓ చిన్నారి బయటపడింది. దీంతో ముక్కపచ్చలారని చిన్నారిని మట్టిలో పాతిపెట్టడానికి చేతులెలా వచ్చాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తూనే ఆ పసిపాపను బయటకు తీశారు. 

అప్పటికీ ప్రాణాలతో ఉండటం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. దీంతో ఎస్సై అశోక్, అక్కడున్న ఉపాధి హామీ కూలీలు చిన్నారి ఒంటిని శుభ్రం చేసి.. వెంటనే 108 అంబులెన్స్ ద్వారా సమీపంలోని ఎన్ఎస్ఆర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడున్న సిబ్బంది ప్రథమ చికిత్స చేసిన అనంతరం వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అక్కడి వైద్య సిబ్బంది చైల్డ్ లైన్ అధికారుల సమక్షంలో చిన్నారికి చికిత్స అందించారు. దీంతో సంపూర్ణ ఆరోగ్యంతో ఆ చిట్టితల్లి ప్రాణాలతో బయటపడినట్లయ్యింది.

ఎర్రటెండ.. అరగంట పాటు భూమిలోపలనే..

ఉదయం 11 గంటల సుమారులో డ్రైవర్ రామ్ బినయ్ చిన్నారి కదలికలను గమనించగా.. అంతకు కొద్దిగా ముందుగానే ఆ పసికందును పాతి పెట్టి ఉంటారనే ఆనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా చిన్నారి తల్లిదండ్రులు పాతిపెట్టి వెళ్లిపోయిన కొద్దిసేపటికి రామ్ బినయ్ గమనించినా.. ఆ చిన్నారిని బయటకు తీయడానికి 20 నిమిషాల వరకు పట్టింది. 

ప్రాణాలతో ఉందో లేదో తెలియక తాత్సారం జరగగా.. ఆ తరువాత ఉపాధిహామీ కూలీలు రావడం, మట్టిని తోడి పసికందును బయటకు తీయడం, వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించడం చకచకా జరిగిపోయాయి. కాగా డ్రైవర్ రామ్ బినయ్ చెప్పిన సమయాన్ని బట్టి ఆ పసికందు దాదాపు అరగంట పాటు భూమిలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఉదయం ఏడెనిమిది గంటల నుంచే ఎండలు మండుతుండగా.. 11 గంటల ఎండలో దాదాపు అరగంట పాటు ఊపిరి సలపకుండా భూమి లోపలే ఉండటంతో ఆ చిన్నారిని మృత్యుంజయురాలుగా అక్కడున్న వాళ్లంతా చెప్పుకోవడం కనిపించింది.

గంటల వ్యవధిలోనే మట్టిలోకి..

భూమి లోపల పాతిపెట్టిన శిశువుకు బొడ్డు పేగు తొలగించకపోవడంతో పాటు చిన్నారి ఉన్న పరిస్థితిని బట్టి ఆసుపత్రిలో డెలివరీ అయిన దాఖలాలు కనిపించడం లేదని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఆసుపత్రిలో కాకుండా బయటనే నార్మల్ డెలివరీ అయినట్లు భావిస్తున్నారు.

చిన్నారిని బతికించడానికి ఎస్సై అశోక్ తో పాటు దామెర గ్రామానికి చెందిన ఉపాధి కూలీలు తీవ్రంగా శ్రమించారు. ఇదిలాఉంటే ఈ ఘటనపై కేసు నమోదు చేసి, నిందితులను పట్టుకునేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని దామెర(Police Station Damera) పోలీసులు తెలిపారు.

(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)

IPL_Entry_Point

టాపిక్

WarangalTelangana NewsCrime News
Source / Credits

Best Web Hosting Provider In India 2024