Best Web Hosting Provider In India 2024
Chitram Choodara OTT: కెరీర్ తొలినాళ్లలో హ్యాపీడేస్, కొత్త బంగారులోకం సినిమాలతో మంచి స్టార్‌డమ్, క్రేజ్ సంపాదించిన వరుణ్ సందేశ్ ఆ తర్వాత దాన్ని నిలుపుకోలేకపోయాడు. ఆ తర్వాత చాలాఏళ్లు పాటు వరుసగా అనేక ప్లాఫ్‍లను ఎదుర్కొంటూనే ఉన్నాడు. అతడు నటించిన చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. ఈ తరుణంలో వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రలో ‘చిత్రం చూడరా’ సినిమా వస్తోంది. యాక్షన్ డ్రామాగా ఈ మూవీ తెరకెక్కింది. ఈ చిత్రం నేరుగా ఓటీటీలో అడుగుపెట్టనుంది. స్ట్రీమింగ్ డేట్ కూడా ఖరారైంది.
‘చిత్రం చూడరా’ స్ట్రీమింగ్ వివరాలు
‘చిత్రం చూడరా’ సినిమా మే 9వ తేదీన ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. థియేటర్లలో రిలీజ్ కాకుండా నేరుగా ఓటీటీలోకే ఈ మూవీ వస్తోంది. స్ట్రీమింగ్ డేట్‍పై ఈటీవీ విన్ నేడు అధికారిక ప్రకటన చేసింది.
“ఈవారం ఈ చిత్రం చూడరా.. ‘చిత్రం చూడారా’ సినిమా మే 9న ప్రీమియర్ కానుంది” అని ఈటీవీ విన్ ట్వీట్ చేసింది. వరుణ్ సందేశ్, ధనరాజ్, కాశీ విశ్వనాథ్ ఉన్న నయా పోస్టర్ రివీల్ చేసింది.
‘చిత్రం చూడరా’ సినిమా వరుణ్ సందేశ్ సరసన శీతల్ భట్ హీరోయిన్‍గా నటించారు. రవిబాబు, తనికెళ్ల భరణి, రాజా రవీంద్ర, ధనరాజ్, కాశీ విశ్వనాథ్, శివాజీ రాజా, మీనా కుమారి, అన్నపూర్ణమ్మ, రచ్చ రవి కీలకపాత్రలు పోషించారు.
చిత్రం చూడరా మూవీకి ఆర్ఎన్ హర్షవర్ధన్ దర్శకత్వం వహించారు. కథ, స్క్రీన్‍ప్లే, డైలాగ్‍లను కూడా ఆయనే అందించారు. క్రైమ్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ ఏడాది మార్చిలోనే ఈ ట్రైలర్ వచ్చింది. ఈ మూవీలో పోలీస్ పాత్రలో నెగెటివ్ క్యారెక్టర్ చేశారు రవిబాబు. పోలీసులను ఎదిరించే యువకుడిగా వరుణ్ సందేశ్ నటించారు.
చిత్రం చూడరా సినిమాను బీఎం సినిమాస్ బ్యానర్‌పై శేషు మారంరెడ్డి, భాగ్యలక్ష్మీ బోయపాటి నిర్మించారు. ఈ చిత్రానికి రధన్ సంగీతం అందించారు. ముందుగా ఈ మూవీని థియేటర్లలో రిలీజ్ చేయాలని మేకర్స్ భావించారు. గతేడాదే టీజర్ వచ్చింది. అయితే, ఆ తర్వాత ప్లాన్‍ను మార్చుకున్నారు. ఈ మూవీ నేరుగా మే 9న ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది.
ఇటీవలే ప్రణయ విలాసం
ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో ప్రణయ విలాసం సినిమా ఇటీవలే మే 2వ తేదీన స్ట్రీమింగ్‍కు వచ్చింది. మలయాళంలో థియేటర్లలో రిలీజ్ అయిన ఈ చిత్రం తెలుగు వెర్షన్ ఈటీవీ విన్‍లోకి వచ్చింది. ప్రేమలు మూవీతో అందరి మనసులను గెలిచిన మమితా బైజూ ఈ చిత్రంలో హీరోయిన్‍గా నటించారు. అర్జున్ అశోకన్ హీరోగా చేశారు.
ప్రణయ విలాసం సినిమాకు దర్శకుడు నిఖిల్ మురళి తెరక్కించారు. ఈ చిత్రం 2023 ఫిబ్రవరిలో మలయాళంలో థియేటర్లలో విడుదలైంది. అయితే, తెలుగులో 2024 మే 2న ఈటీవీ విన్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ మూవీని శిబి చవర, రంజిత్ నాయర్ నిర్మించగా.. షాన్ రహమాన్ సంగీతం అందించారు.