Best Web Hosting Provider In India 2024
వేములలో సీఎం వైయస్ జగన్ సతీమణి భారతమ్మ
పేదల సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మళ్లీ ఈ ప్రభుత్వం రావాలి
ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేయాలని అభ్యర్థన
వేముల: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించాలని సీఎం వైయస్ జగన్ సతీమణి భారతమ్మ ప్రజలను కోరారు. వైయస్ఆర్ జిల్లా వేములలో ఆమె ఇంటింటా ప్రచారం నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటేసి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న వైయస్ జగన్, వైయస్ అవినాశ్‌రెడ్డిలను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా వైయస్ భారతమ్మ, ఆమె సోదరుడు, ప్రముఖ వైద్యుడు ఈసీ దినేశ్‌రెడ్డికి అడుగడుగునా ప్రజలు ఎదురేగి ఘనస్వాగతం పలికారు.
వారిని ఆప్యాయంగా పలకరించారు. మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి భారతమ్మపై అభిమానం చూపారు. ఆమెను చూడగానే చిరునవ్వుతో ఆప్యాయంగా పలకరిస్తూ, తమ ఇంటిలోకి ఆహ్వానించి అభిమానాన్ని చాటుకున్నారు. చాలా రోజుల తర్వాత ఆమెను చూడటంతో సంతోషంతో ఉప్పొంగిపోయారు. వేముల మెయిన్ రోడ్డు, ఎస్సీ కాలనీ, శేషన్నగారిపల్లె, బచ్చయ్యగారిపల్లెల్లో భారతమ్మ, ఈసీ దినేశ్‌రెడ్డి, ఎంపీ వైయస్ అవినాశ్‌రెడ్డి సోదరి శ్వేతారెడ్డి.. జెడ్పీటీసీ వెంకట బయపురెడ్డి, ఎంపీపీ చల్లా గంగాదేవి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్ లింగాల ఉషారాణి, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల ఇన్‌చార్జి నాగెళ్ల సాంబశివారెడ్డి, మండల పరిశీలకులు లింగాల రామలింగారెడ్డి, పీసీబీ డైరెక్టర్ మరక శివకృష్ణారెడ్డిలతో కలిసి ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఇందులో భాగంగా స్థానిక టీసీసీ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ప్రచారంలో అవ్వాతాతలను, మహిళలు, పెద్దలను ‘అన్న బాగున్నారా.. అవ్వా బాగున్నారా’ అంటూ భారతమ్మ ఆప్యాయంగా పలకరించారు. ప్రతి ఇంటి వద్ద వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. చిన్నారులను ఆప్యాయంగా ఎత్తుకున్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓట్లేసి గెలిపించాలని కోరారు.
పేదల సంక్షేమం కోసం సీఎం వైయస్ జగన్ పలు సంక్షేమ పథకాలు అమలు చేశారని భారతమ్మ చెప్పారు. పేదలు ఉన్నత చదువులు చదివితే ఆ కుటుంబాలు ఆర్థికంగా బలోపేతమవుతాయని నాడు–నేడుతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చివేశారన్నారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించి ఇంగ్లిష్ మీడియంలో విద్యాబోధనను గ్రామీణ విద్యార్థులకు చేరువ చేశారని తెలిపారు. పేదల సంక్షేమ పథకాలు కొనసాగడానికి మరోసారి వైయస్ జగన్‌ను సీఎంగా చేసుకుందామని పిలుపునిచ్చారు.
సీఎం వైయస్ జగన్‌కు మెండుగా ప్రజల ఆశీస్సులు
గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వం గ్రామాలపై దృష్టి సారించిందని భారతమ్మ తెలిపారు. సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి పాలనను ప్రజల వద్దకే తీసుకొచ్చి అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలను అందించిన ఘనత వైయస్ జగన్‌కే దక్కిందన్నారు.
రాష్ట్రంలో ఎన్నో సంస్కరణలతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంతో పాటు గ్రామీణ ఆర్థికవ్యవస్థను బలోపేతం చేశారన్నారు. ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన వైయస్ జగన్‌ను ప్రజలు మళ్లీ సీఎంగా కోరుకుంటున్నారని తెలిపారు. ప్రజల ఆశీస్సులు ఆయనకు మెండుగా ఉన్నాయన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా వైయస్ జగన్ విజయాన్ని ఆపలేరన్నారు. ఎన్నికల ప్రచారంలో పలువురు నేతలు పాల్గొన్నారు.