Best Web Hosting Provider In India 2024
ఆస్తమా రోగులు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ సమయంలో ఎలాంటి సమస్యలు వస్తాయో చెప్పలేం. మే 7న ప్రపంచ ఆస్తమా దినోత్సవం. మే నెలలో వచ్చే మెుదటి మంగళవారం రోజున ఈ దినోత్సవం నిర్వహిస్తారు. ఆస్తమాను ఎలా నివారించవచ్చో ప్రజలకు తెలియజేసేందుకు జరుపుతారు. ఆస్తమా వ్యాధిగ్రస్తులు వేసవి, వర్షాకాలం, శీతాకాలం అన్ని కాలాల్లోనూ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎప్పుడు ఎలాంటి సమస్యలు వస్తాయో చెప్పలేం.
ముఖ్యంగా వాయు కాలుష్యం, పర్యావరణ కాలుష్యం ఎక్కువగా ఉన్న చోట, ఆస్తమా వ్యాధి మరింత తీవ్రమవుతుంది. ఈ కారణాల వల్ల ఆస్తమా పెరుగుతోందని చాలా మందికి తెలియదు. ఇలా కొన్ని చిన్న చిన్న విషయాలే అనుకుంటాం.. కానీ అవి ఆస్తమాను పెంచేందుకు కారణమవుతాయి వాటి గురించి కచ్చితంగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.
పిడుగులతోనూ సమస్యే
వర్షాకాలంలో ఆస్తమా సమస్య పెరుగుతుంది, ఇది చలి వాతావరణం వల్ల వస్తుంది అని మనం అందరం అనుకుంటాం. కానీ అదొక్కటే కారణం కాదు, పిడుగుపాటు వల్ల ఆస్తమా సమస్య కూడా పెరుగుతుందని మీకు తెలుసా? కాబట్టి ఉబ్బసం ఉన్నవారు పిడుగులు పడే సమయంలో ఇంట్లోనే ఉండడం మంచిది. బయట తిరగకూడదు.
చల్లని గాలి
చల్లని గాలి ఆస్తమా సమస్యలను తీవ్రతరం చేస్తుంది. దగ్గు, గురక, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని కలిగిస్తుంది. రైలులో ప్రయాణిస్తున్నప్పుడు చల్లటి గాలి ఆహ్లాదకరంగా ఉన్నప్పటికీ, ఆస్తమా ఉన్నవారు చెవుల్లో దూది పెట్టుకోవాలి లేదా చెవులకు కప్పే టోపీ పెట్టుకోవాలి. లేదంటే శ్వాస సమస్యలతో బాధపడాల్సి వస్తుంది.
కట్టెలు మండే చోట
ఆస్తమా రోగులు కట్టెలు మండుతున్న చోట నిలబడితే, దాని పొగను తీసుకోవడం వల్ల ఆస్తమా సమస్య పెరుగుతుంది. అందుకే మీకు ఆస్తమా ఉంటే కట్టెల పొయ్యి మీద వంట చేసేప్పుడు దగ్గరకు వెళ్లకపోవడమే మంచిది.
పెర్ఫ్యూమ్‌లు
బలమైన స్మెల్లింగ్ పెర్ఫ్యూమ్‌లు , క్లీనింగ్ ప్రొడక్ట్స్, వంట వాసనలు అన్నీ ఆస్తమా సమస్యను పెంచుతాయి. చాలా మంది ఈ విషయాన్ని పట్టించుకోరు. అనవసరమైన పెర్ఫ్యూమ్‌లు బాడీ మెుత్తం కొట్టుకుని తర్వాత ఇబ్బంది పడతారు.
మానసిక ఒత్తిడి
ఆస్తమా రోగులు ఈ ఒక్క విషయాన్ని గమనించి ఉండవచ్చు. మానసిక ఒత్తిడి పెరిగినప్పుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, టెన్షన్‌లో ఉన్నప్పుడు శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. ఆస్తమా రోగులు ధ్యానం ద్వారా మానసిక ఒత్తిడిని తగ్గించుకుంటే ఆస్తమా కూడా అదుపులో ఉంటుంది.
పీరియడ్స్ సమయంలో
కొంతమందికి పీరియడ్స్ సమయంలో ఆస్తమా సమస్య వస్తుంది. బహిష్టు సమయంలో హార్మోన్ల సమస్య పెరుగుతుంది, దాని వల్ల ఆస్తమా సమస్య కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి.
యాసిడ్ రిఫ్లెక్స్ కూడా ఆస్తమా సమస్యను పెంచుతుంది. అలా అయితే మీరు యాసిడ్ రిఫ్లెక్స్ అభివృద్ధి చెందకుండా జాగ్రత్త వహించాలి. అతిగా తినవద్దు, తిన్న వెంటనే నిద్రపోకండి, కెఫీన్, కార్బోనేటేడ్ డ్రింక్స్, ఆల్కహాల్, సిట్రస్ ఫ్రూట్ – ఆహారం తీసుకోవద్దు. చాక్లెట్లు, ఉప్పు పదార్థాలు తినకూడదు. మానసిక ఒత్తిడిని అదుపులో ఉంచుకోండి.
వ్యాయామం
వ్యాయామం మొదటి నియమం మన శరీరం మనకు చెప్పేది వినడం. అందరూ చేస్తున్నట్టుగా ఎక్కువ వ్యాయామం చేయకండి. మితమైన వ్యాయామం ఆస్తమా రోగులకు మంచిది. వ్యాయామాల మధ్య విశ్రాంతి అవసరమైనప్పుడు శరీరానికి అధిక శ్రమ లేకుండా వ్యాయామం చేయండి. వ్యాయామం ఆరోగ్యానికి మంచిది కదా అని ఆస్తమా రోగులు అధిక వ్యాయామం చేయకండి.