పథకాలు ఆపగలరు కానీ..మా విజయాన్ని ఆపలేరు

Best Web Hosting Provider In India 2024

రాజానగరం రోడ్‌షోలో సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

14 ఏళ్లు సీఎంగా చేశానంటున్న చంద్రబాబు ఏం చేశాడు?

చంద్రబాబు పేరు చెప్తే ఒక్క పథకమైనా గుర్తుకొస్తుందా?

2019లో ప్రజలు సైకిల్‌ను పార్ట్‌ పార్ట్‌గా పీకి పక్కన పడేశారు

తుప్పు పట్టిన సైకిల్‌కు రిపేర్‌ చేయాలని బాబు కష్టపడుతున్నాడు

దత్తపుత్రుడు సైకిల్‌పై కూర్చొని టీ మాత్రమే తాగుతానన్నాడు

వదినమ్మను ఢిల్లీ పంపాడు..పెద్దలు సైకిల్‌కు పార్ట్‌లే లేవు..ఎలా బాగు చేస్తావయ్యా 
అని అడిగారు

తుప్పు పట్టిన సైకిల్‌ బెల్‌ కొడుతూనే ఉన్నాడు..ఆ బెల్‌ పేరే అబద్ధాల మేనిఫెస్టో

అధికారం దక్కితే చంద్రబాబు చేసేది మోసాలే

రైతు రుణాలు మాఫీ చేస్తానన్నాడు..చేశాడా? 

ఢిల్లీతో కుట్రలు పన్ని బటన్లు నొక్కిన సొమ్ము నా అక్కచెల్లెమ్మలకు అందకుండా అడ్డుకుంటున్నారు

ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు ఢిల్లీ వాళ్లతో కలిశారు

జూన్‌ 4న మళ్లీ మీ బిడ్డ అధికారంలోకి వస్తాడు

మళ్లీ మీ బిడ్డ అధికారంలోకి వచ్చిన తరువాత పథకాలు అందిస్తాం

రాజానగరం: చంద్రబాబు ఢిల్లీతో కలిసి కుట్రలు చేసిపథకాలు ఆపగలరు కానీ..మా విజయాన్ని ఆపలేరని సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి హెచ్చరించారు. ఓటు అనే అస్త్రంతో ఈ చంద్ర‌బాబుకు గుణ‌పాఠం చెప్పాల‌ని పిలుపునిచ్చారు. ఈ రోజు రాష్ట్రంలో క్లాస్ వార్ జ‌రుగుతోంది. పేద‌వాడు ఒక‌వైపు..పెత్తందార్లు ఒక‌వైపు ఉన్నారు. ఎవ‌రు మీకు మంచి చేశారో ..ఎవ‌రు ఉంటే ఆ మంచి కొన‌సాగుతుంద‌న్న‌ది మాత్ర‌మే మీరు వేసే ఓటు నిర్ణ‌యిస్తుంద‌ని గుర్తించుకోవాల‌న్నారు. జూన్‌ 4న మళ్లీ మీ బిడ్డ అధికారంలోకి వస్తాడు, పథకాలన్నీ అందిస్తాడని మాటిచ్చాడు. మంగళవారం రాజానగరం రోడ్‌షోలో సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొని ప్ర‌సంగించారు.

ఈ సంద‌ర్భంగా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఏమ‌న్నారంటే.. 
రాజాన‌గ‌రం సిద్ధమా? 
చిక్కటి చిరునవ్వులతో ఇంతటి ప్రేమానారాగాలు, ఆప్యాయతలు, ప్రేమాభిమానాలు చూపిస్తున్న నా ప్రతి అక్కకూ, ప్రతి చెల్లెమ్మకూ, ప్రతి అవ్వకు, తాతకు, నా ప్రతి సోదరుడికీ, స్నేహితుడికీ… మీ అందరి ప్రేమాభిమానాలకు మీ జగన్… మీ బిడ్డ రెండు చేతులు జోడించి పేరు,పేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాడు.

రానున్నది ఎన్నికల కురుక్షేత్రం.
మరో ఐదు రోజుల్లో కురుక్షేత్ర మహాసంగ్రామం జరగబోతుంది. జరగబోయే ఎన్నికలు కేవలం ఎంపీలను, ఎమ్మెల్యేలను ఎన్నుకునేందుకు జరగబోయే ఎన్నికలు కావు. ఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్ల మీ ఇంటింటి భవిష్యత్తును, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు. అందరూ గుర్తుపెట్టుకొండి.. ఈ ఎన్నికల్లో మీరు జగన్ కు ఓటు వేస్తే ఇంటింటి భవిష్యత్తు, పథకాల కొనసాగింపు. ఇంటింటి అభివృద్ధికి అడుగులు ముందుకు పడతాయి. అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు. మళ్లీ మోసపోవడమే. ఇదే చంద్రబాబు గత చరిత్ర చెబుతున్న సత్యం. ఇదే సాధ్యం కాని హామీలతో ఆయన మేనిఫెస్టోకు అర్థం. 

 బాబును నమ్మడం అంటే కొండచిలువ నోట్లో తలపెట్టడమే.
ఈ ఎన్నికల్లో ఎవరైనా మళ్లీ చంద్రబాబును నమ్మడం అంటే దానర్ధం… కొండచిలువ నోట్లో తల పెట్టడం. చంద్రబాబును మళ్లీ నమ్మడం అంటే…మళ్లీ చంద్రముఖిని  నిద్రలేపడమే అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకొండి. 

బాబు పేరు చెబితే ఒక్క స్కీమూ గుర్తురాదు.
ఈ ఎన్నికల్లో పేదల శత్రువులంతా.. పేదలకు అండగా నిలబడిని మీ ఒక్క జగన్‌ మీద ఎంతటి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారో, ఎంతగా దిగజారి యుద్ధం చేస్తున్నారో మీరే చూస్తున్నారు. ఎన్ని అబద్ధాలు చెబుతున్నారో, అబద్ధాలతో దుష్ప్రచారం చేస్తున్నారో చూస్తున్నారు. నేడు ఇన్ని దుష్ప్రచారాలు ఎందుకు చేస్తున్నారు అంటే…చంద్రబాబు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా, 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసాడు. కానీ చంద్రబాబు పేరు చెబితే ఏ పేదకైనా బాబు చేసిన ఏ ఒక్క మంచి అయినా గుర్తొస్తుందా? ఒక్క స్కీమ్‌ అయినా గుర్తొస్తుందా? అందుకే ఇన్ని కుట్రలు..ఇన్ని అబద్ధాలు..అందుకే ఇవన్నీ జరుగుతున్నాయి.

మీ బిడ్డ పాలనలో జరిగిన మంచి ఏమిటంటే..
దేవుడు దయతో, చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా మీ అందరి ఆశీస్సులతో ఈ 59 నెలల కాలంలోనే, గతంలో ఎప్పుడూ చూడని విధంగా మీ బిడ్డ ఇచ్చిన పరిపాలన.. నా అక్కచెల్లెమ్మల కుటుంబాలకు మంచి చేస్తూ 130 సార్లు బటన్‌ నొక్కి, రూ.2.7౦ లక్షల కోట్లు ఎలాంటి లంచాలు, వివక్ష లేకుండా నేరుగా ఆ డబ్బులు వెళ్లాయి. 

గతంలో ఎప్పుడూ జరగని విధంగా 2.31 లక్షల  ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది కూడా మీ బిడ్డ పాలనలోనే. 
మేనిఫెస్టోలో ఇచ్చిన 99% వాగ్దానాలను అమలు చేసింది కూడా 59 నెలల మీ బిడ్డ పాలనలోనే.
 
ఇప్పుడు నేను గడగడా మచ్చుకు కొన్ని పథకాలు చెబుతా…ఇవి గతంలో ఎప్పుడైనా ఉన్నాయా? ఎవరైనా చూసారా? ఎవరైనా చేసారా అన్నది మీరే ఆలోచించండి..
గతంలో ఎప్పుడూ జరగని విధంగా నాడునేడుతో బాగుపడ్డ గవర్నమెంట్‌స్కూళ్లు, గవర్నమెంట్ బడులన్నీ ఇంగ్లీష్ మీడియం, 6వ తరగతి నుంచే క్లాస్ రూముల్లో డిజిటల్ బోధన, 8వ తరగతి పిల్లాడికి వచ్చేసరికే ఆ పిల్లాడి చేతిలో ట్యాబ్‌లు, ఇంగ్లీష్ మీడియం అమలుతో మొదలుపెడితే… 3వ తరగతి నుంచే  టోఫెల్ క్లాసులు, సబ్జెక్ట్‌ టీచర్లు, ఐబీ దాకా ప్రయాణం, పిల్లల చేతుల్లో బైలింగువల్ టెక్ట్స్‌ బుక్స్, అంటే ఒక పేజీ ఇంగ్లీషు, మరో పేజీ తెలుగుతో అందుబాటులోకి తెచ్చాం.
బడులు తెరిచేసరికే పిల్లలకు విద్యాకానుక, గోరుముద్ద, పిల్లల చదువులకు తల్లులను  ప్రోత్సహిస్తూ అమ్మ ఒడి, పెద్ద చదువులకు ఏ తల్లీ తండ్రీ అప్పుల పాలు కాకూడదు అని పూర్తి ఫీజ్ రీయంబర్స్మెంట్ ఇస్తూ విద్యాదీవెన, వసతిదీవెన. ఇవన్నీ గతంలో ఎప్పుడైనా జరిగాయా? అని ఆలోచించమని కోరుతున్నాను. 

అక్కచెల్లెమ్మల సాధికారతపై చిత్తశుద్ధితో..
నా అక్కచెల్లెమ్మలను వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడేట్లుగా, మహిళా సాధికారతకు అర్థం చెబుతూ ఒక ఆసరా, ఓ సున్నావడ్డీ, ఓ చేయూత, ఓ కాపునేస్తం, ఓ ఈబీసీనేస్తం, ఏకంగా నా అక్కచెల్లెమ్మల పేరిట 31 లక్షల ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్‌, అందులో కడుతున్న 22 లక్షల ఇళ్లు. నేను చెప్పిన ఈ పథకాలన్నీ గతంలో ఎప్పుడైనా జరిగాయా? అని మీ బిడ్డ అడుగుతున్నాడు. 

అవ్వాతాతల ఇంటి వ‌ద్ద‌కే పెన్షన్  
అవ్వాతాతలకు మొన్నటిదాకా ఇంటికే వచ్చిన పెన్షన్‌ను అడ్డుకున్నది ఎవరు? చంద్రబాబు నాయుడు మనిషి అయిన  నిమ్మగడ్డ రమేష్‌తో సాక్షాత్తూ చంద్రబాబు నాయుడే ఎన్నికల కమీషన్‌కు లేఖ రాయించాడు. వాలంటీర్లు ఇంటికి రాకూడదు అని అవ్వాతాతలకు అప్పటి వరకూ ఇంటికే అందుతున్న పెన్షన్‌ ఇంటికి రాకుండా అడ్డుకున్నాడు. అడ్డుకోవడమే కాకుండా అవ్వాతాతలకు ఇచ్చే పెన్షన్‌ను బ్యాంక్‌ అకౌంట్లలో వేయాల్సిందిగా ఎన్నికల కమీషన్‌కు విజ్ఞప్తి చేయిస్తాడు, ఆ ఎన్నికల కమీషన్‌తో  ఉత్తర్వులు కూడా ఇప్పిస్తాడు. మళ్లీ ఆ అవ్వా తాతలు చంద్రబాబు నాయుడును తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతుంటే  ఆ నెపాన్ని కూడా మీ బిడ్డ మీదనే వేస్తున్నాడు. ఈ చంద్రబాబు అయినా ఈనాడు అయినా ఆంధ్రజ్యోతి అయినా టీవీ5 అయినా, దత్త పుత్రుడు అయినా వీళ్లందరూ కలిసి ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి ఎన్ని అగచాట్లు పడుతున్నారో ఒక్కసారి గమనించండి. 

గతంలో లేని విధంగా ఇంటివద్దకే పౌరసేవలు
గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఇంటికే రూ.3వేలు పెన్షన్‌ కానుక, ఇంటి వద్దకే పౌరసేవలు, ఇంటి వద్దకే పథకాలు, ఇంటి వద్దకే రేషన్. ఇవన్నీ గతంలో ఎప్పుడైనా జరిగాయా?

 రైతుల‌ను చెయ్యి ప‌ట్టుకొని న‌డిపించాం
గతంలో ఎప్పుడూ చూడని విధంగా రైతన్నలను చేయిపట్టుకు నడిపిస్తూ రైతన్నకు పెట్టుబడి సహాయంగా ఓ రైతుభరోసా, రైతన్నలకు ఉచితంగా పంటలబీమా, సీజన్ ముగిసేలోగానే రైతన్న చేతిలో ఇన్‌పుట్ సబ్సిడీ, పగటిపూటనే రైతన్నలకు 9 గంటల ఉచిత విద్యుత్, రైతనన్ను చేయి పట్టుకుని నడిపిస్తూ ఆ గ్రామంలోనే రైతన్నకోసమే ఓ ఆర్బీకే వ్యవస్థ. ఈ మార్పులన్నీ కూడా గతంలో ఎప్పుడైనా జరిగాయా?, ఎప్పుడైనా కనబడ్డాయా? అని అడుతున్నాను. 

స్వయం ఉపాధికి తోడు నిలుస్తూ మీ బిడ్డ ప్రభుత్వం
స్వయం ఉపాధికి ఏ ప్రభుత్వమూ ఎప్పుడూ తోడు నిలవనంతగా మీ బిడ్డ ప్రభుత్వం స్వయం ఉపాధికి అండగా నిలబడుతూ ఓ వాహనమిత్ర, నేతన్నలకు ఓ నేతన్ననేస్తం, మత్స్యకారులకు ఓ మత్స్యకార భరోసా, చిరువ్యాపారులకు శ్రమజీవులకు అండగా నిలుస్తూ ఓ తోడు, ఓ చేదోడు,  లాయర్లకు కూడా లానేస్తం ఇలా స్వయం ఉపాధికి తోడుగా ఉన్న ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా ఉందా? ఇలాంటి కార్యక్రమాలు ఉన్నాయా? చూసారా? అని మీ బిడ్డ అడుగుతున్నాడు.

గ్రామ స‌చివాల‌యాల్లో 600 ర‌కాల సేవ‌లు..
వీటన్నింటికీ తోడు ఏగ్రామానికి వెళ్లినా 600 రకాల సేవలందిస్తూ ఓ గ్రామ సచివాలయం అక్కడే కనిపిస్తుంది.  60-70 ఇళ్లకు ఇంటికే వచ్చే వాలంటీర్ సేవలు అక్కడే కనిపిస్తాయి. అదే గ్రామంలోనే ఒక ఆర్బీకే. ఆ పక్కనే  ఆర్బీకే నుంచి నాలుగు అడుగులు వేస్తే ఓ విలేజ్‌ క్లినిక్‌, అక్కడి నుంచి మరో నాలుగు అడుగులు ముందుకు వేస్తే నాడు- నేడుతో బాగుపడ్డ ఓ ఇంగ్లీష్ మీడియం బడి.  గ్రామానికే  ఫైబర్ గ్రిడ్, నిర్మాణంలో డిజిటల్ లైబ్రరీలు, గ్రామంలోనే ఓ మహిళా పోలీస్, అక్కచెల్లెమ్మల చేతిలో ఉన్న ఫోన్లోనే ఓ దిశ యాప్.. ఇటువంటివన్నీ గతంలో ఉన్నాయా? ఇంతకుముందు ఎప్పుడైనా చూశారా అని మీ బిడ్డ అడుగుతున్నాడు.  

బాబు పేరు చెబితే ఒక్క స్కీమైనా గుర్తుకు వ‌స్తాందా?
మరోవంక చంద్రబాబు.. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశాడు, 3 సార్లు తాను సీఎంగా ఉన్నాను అంటాడు. నేను అడుగుతున్నాను. అంతకుముందు అడిగిన ప్రశ్నే మళ్లీ అడుగుతున్నాను. 14 ఏళ్లు సీఎంగా ఉన్న వ్యక్తి కనీసం తన పేరు చెబితే ఏ పేదవాడికైనా కూడా తాను చేసిన మంచి గుర్తుకురావడం లేదంటే.. ఏ పేదవాడికైనా తాను చేసిన ఒక స్కీమ్ గుర్తుకురావడం లేదంటే ఆయన, ఆయన మోసాలు, ఆయన పాలన ఒక్కసారి అందరూ గుర్తుకుతెచ్చుకోమని మీఅందరితో కూడా కోరుతున్నాను.

తుప్పు ప‌ట్టిన సైకిల్‌కు రిపేరీ..
చంద్ర‌బాబు సైకిల్ పూర్తిగా తుప్పు ప‌ట్టింది. ఆ త‌ప్పు ప‌ట్టిన సైకిల్‌కు రిపేరీ చేయాల‌ని చంద్ర‌బాబు ముందుగా ఎర్ర చొక్కాల వ‌ద్ద‌కు వెళ్లారు. ఆ త‌రువాత ద‌త్త‌పుత్రుడిని పిలిచారు. దాన్ని నేను బాగు చేయ‌లేను అని చేతులెత్తేశాడు. ఆ త‌రువాత వ‌దిన‌మ్మ‌ను ఢిల్లీకి పంపించి అక్క‌డి నుంచి మెకానిక్‌ల‌ను ఇక్క‌డికి తెచ్చుకున్నారు. ఆ సైకిల్‌కు హ్యాండిల్ లేదు, చ‌క్రాలు లేవు, ట్యూబులు లేవు. ఇలాంటి సైకిల్‌ను ఎలా బాగు చేస్తామ‌ని డిల్లీ మోకానిల్ అడిగారు. చంద్ర‌బాబు బిత్త‌ర చూపులు చూస్తూ ఒక్క బెల్ మాత్ర‌మే ఉంద‌ని చూపాడు. ఆ బెల్‌పేరు టీడీపీ మేనిఫెస్టో.

2014 మేనిఫెస్టో గుర్తుందా?
ఈ రోజు నేను చూపిస్తున్న ఈ ఫాంప్లెట్ మీ అందరికీ గుర్తుందా? (టీడీపీ మేనిఫెస్టో చూపిస్తూ) గుర్తుందా అన్నా? గుర్తుందా అక్కా ఈ ఫాంప్లెట్?  2014లో ఇదే పెద్దమనిషి చంద్రబాబు నాయుడు స్వయంగా సంతకం పెట్టి కూటమిలో ఉన్న ఇదే ముగ్గురి ఫొటోలతో మీ ప్రతి ఇంటికీ ముఖ్యమైన హామీలు అని అంటూ ఈ పాంప్లెట్‌ పంపించాడు. 

ఆ తర్వాత 2014 నుంచి 2019 దాకా ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు. ఈ హామీలన్నీ నేను చదివి వినిపిస్తాను. ఇందులో ముఖ్యమైన హామీలంటూ ఈయన సంతకం పెట్టి మరీ చెప్పినవి…కనీసం ఏ ఒక్కటైనా జరిగిందా? నేను మిమ్మల్నే అడుగుతా మీరే సమాధానం చెప్పండని మిమ్మలే కోరుతున్నాను. 

రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు. రూ.87,612 కోట్లు వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తానన్నాడు జరిగిందా? అని మీ బిడ్డ అడుగుతున్నాడు. రెండో ముఖ్యమైన హామీ.. పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తానన్నాడు. నేను అడుగుతున్నాను.. 2014 నుంచి 2019 మధ్యలో చంద్రబాబు హయాంలో పొదుపు సంఘాలకు సంబంధించి రూ.14,205 కోట్లు ఒక్క రూపాయైనా మాఫీ చేశాడా? 

ఒక్క రూపాయి అయినా డిపాజిట్ చేశారా?
ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద రూ.25వేలు బ్యాంకుల్లో వేస్తామన్నాడు. నేను అడుగుతున్నాను.. రూ.25వేలు మాట దేవుడెరుగు.. కనీసం ఒక్క రూపాయి అయినా మీ బ్యాంకుల్లో వేశాడా అని మీ బిడ్డ అడుగుతున్నాడు. ఇంటికో ఉద్యోగం ఇవ్వకపోతే నెల నెలా రూ.2 వేలు నిరుద్యోగభృతి అన్నాడు.  మరి ఐదేళ్లు అంటే 60 నెలలు నెలకు రూ.2వేలు చొప్పున ప్రతి ఇంటికీ రూ.1.20 లక్షలు ఇచ్చాడా? అని మీ బిడ్డ అడుగుతున్నాడు.  అర్హులందరికీ మూడు సెంట్ల స్ధలం. కట్టుకునేందుకు పక్కా ఇళ్లు అన్నాడు. ఇన్ని వేలమంది ఇక్కడున్నారు చంద్రబాబు 3 సెంట్ల కథ దేవుడెరుగు మీలో ఏ ఒక్కరికైనా చంద్ర‌బాబు హ‌యాంలో ఒక్క సెంటు అయినా ఇచ్చాడా ? అని మీబిడ్డ అడుగుతున్నాడు.

రూ.10 వేల కోట్లతో బీసీ సబ్ ప్లాన్, చేనేత, పవర్ లూమ్స్ రుణాల మాఫీ అన్నాడు, జరిగిందా? అని మీ బిడ్డ అడుగుతున్నాడు. విమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు, చేశాడా?
సింగపూర్ కి మించి అభివృద్ధి చేస్తామన్నాడు జరిగిందా? ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీని నిర్మిస్తానన్నాడు, జరిగిందా?  రాజాన‌గ‌రంలో ఏమైనా కనిపిస్తుందా?. ఆలోచ‌న చేయ‌మ‌ని అడుగుతున్నాను.

ఇదే ముగ్గురు సంత‌కాలు పెట్టారు..ఒక్క‌టైనా జ‌రిగిందా?
2014లో ముఖ్యమైన హామీలంటూ మీ ప్రతి ఇంటికి చంద్రబాబు స్వయానా సంతకం పెట్టి పంపించాడు. ఇదే ఫాంప్లెట్, ఇందులో చెప్పినవి ఆయన సంతకం పెట్టి స్వయంగా 2014లో మీ ఇంటికి పంపించి 2014 నుంచి 2019 దాకా ఆయన ముఖ్యమంత్రిగా ఉండి పరిపాలన చేసిన తర్వాత ఇందులో కనీసం ఒక్కటంటే ఒక్కటైనా చేశాడా? అని అడుగుతున్నాడు మీబిడ్డ.  పోనీ ప్రత్యేక హోదా ఏమైనా ఇచ్చాడా? అదీ అమ్మేశాడు. మరి నేను అడుగుతున్నాను. మరి నేను మిమ్మల్నందర్నీ కూడా అడుగుతున్నాను. 

ఇలాంటి వాళ్ల‌ను న‌మ్ముతారా?
వీళ్లు చేస్తున్న కుట్ర‌లు మీరే గ‌మ‌నిస్తున్నారు. మరి ఇలాంటి వాళ్లను నమ్మవచ్చా అని అడుగుతున్నాడు మీ బిడ్డ. నమ్మొచ్చా? అన్నా నమ్మొచ్చా? అక్కా నమ్మొచ్చా? తమ్ముడు నమ్మొచ్చా? పెద్దమ్మ నమ్మొచ్చా? మళ్లీ ఇదే ముగ్గురు, ఇదే మేనిఫెస్టో డ్రామా. ఇప్పుడు ఏమంటున్నారు సూపర్ సిక్స్ అంట నమ్ముతారా? సూపర్ సెవెన్ అంట నమ్ముతారా?. ఇంటింటికీ కేజీ బంగారమట నమ్ముతారా? ఇంటింటికీ బెంజి కార్ కొనిస్తారట నమ్ముతారా? మీ అందరినీ కూడా ఆలోచన చేయమని కోరుతున్నాను. ఇలాంటి వాళ్లతో మనం యుద్ధం చేస్తున్నాం. ఇలాంటి వాళ్లను మన ఓటుతో రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత అన్నది చాలా అవసరమూ ఇలాంటి వాళ్లకే మా ఓటు వేస్తామన్న మెసేజ్ ఇక్కడ నుంచి మనం ఓటు వేస్తే దేశంలో ఢిల్లీ దాకా ఆ మెసేజ్ వినిపించాలి .

ప్ర‌జ‌లు ఎన్నుకున్న ప్ర‌భుత్వాన్ని దెబ్బ‌తీసేందుకు చంద్ర‌బాబు, ఢిల్లీ పెద్ద‌ల‌తో క‌లిసి కుట్ర‌లు ప‌న్నుతున్నారు. అవ్వాతాత‌ల పింఛ‌న్లు ఇంటి వ‌ద్ద అంద‌కుండా చేశారు. ఇన్ని నెల‌లుగా మీ జ‌గ‌న్ నేరుగా ఇంటికి పింఛ‌న్ డబ్బు పంపిస్తున్నాడు. అవ్వాతాత‌లు జ‌గ‌న్‌కు ఓటు వేస్తార‌ని కుట్ర‌లు ప‌న్నుతు, కుంతంత్రాల‌తో జ‌గ‌న్  బ‌ట‌న్ సొక్కితే ఆ డ‌బ్బులు రాకుండా అడ్డుకుంటున్నారు.

ఆన్‌ గోయింగ్‌ పథకాలను కూడా ఆడ్డుకుంటూ చంద్రబాబు దుర్మార్గం
వీళ్ల కుట్రలు ఏ స్థాయికి వెళ్లాయంటే మనం బటన్లు నొక్కి ఆన్‌ గోయింగ్ స్కీమ్స్‌ను కూడా ఎన్నికల కమీషన్‌ మీద ఒత్తిడి తీసుకువచ్చి అక్కచెల్లెమ్మల ఖాతాలకు పోవాల్సిన డబ్బును కూడా దిక్కుమాలిన చంద్రబాబు ఆపుతున్నాడు. ఇంతకన్నా దుర్మార్గం ఎక్కడైనా ఉంటుందా? 
ఎన్నికలన్నీ కూడా బాగా జరుగుతాయి అని నమ్మకం సన్నగిల్లుతోంది. ఎందుకంటే ఆన్‌గోయింగ్‌ స్కీమ్‌లకు సంబంధించి బటన్లు నొక్కినా కూడా అక్కచెల్లెమ్మలకు డబ్బులు పోకుండా కావాలని ఆపుతున్నారు. ఇష్టానుసారంగా అధికారులను మారుస్తున్నారు. ప్రజలకు అందాల్సిన మంచి జరక్కుండా చేస్తున్నారు. ఇన్ని కుట్రలు పన్నుతున్నారు..కేవలం బీదలకు, పేదలకు మంచి చేసే మీ జగన్‌ ఉండకూడదని ఇవన్నీ చేస్తున్నారు. మీ జ‌గ‌న్ ఏ నెల‌లో ఏ ప‌థ‌కం ఇస్తున్నానో క్యాలెండ‌ర్ ప్ర‌కారం ప్ర‌తి నెల ఇస్తున్నాడు. ఇలా ఇస్తున్న డ‌బ్బులు అంద‌కుండా చేస్తే నా అక్క‌చెల్లెమ్మ‌లు ఊరుకుంటారా?  చంద్ర‌బాబుకు నా అక్క‌చెల్లెమ్మ‌లు గ‌ట్టి గా బుద్ధి చెప్పాల‌ని కోరుతున్నాను. మీ బిడ్డ విజ‌యాన్ని ఏ ఒక్క‌రూ అడ్డుకోలేరు. మ‌ళ్లీ మీ బిడ్డే ముఖ్య‌మంత్రి అవుతాడు. ఈ బ‌ట‌న్లు నొక్కిన డ‌బ్బుల‌న్నీ క్లియ‌ర్ చేస్తాన‌ని మాటిస్తున్నాను. 

చంద్ర‌బాబు ప్ర‌జ‌ల కోసం ఏ రోజు బ‌ట‌న్లు నొక్క‌లేదు. మీ బిడ్డ అలా కాదు..మీ బిడ్డ 59 నెల‌ల కాలంలో 130 సార్లు బ‌ట‌న్లు నొక్కి రూ.2.70 ల‌క్ష‌ల కోట్లు నేరుగా అందించాడు. చంద్ర‌బాబు వ‌ద్ద డ‌బ్బు బాగా వుంది. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఓటుకు రూ.3 వేలు ఇస్తాడు, ఆ డ‌బ్బంతా మ‌న‌దే, మ‌న వ‌ద్ద దోచేసిన సొమ్మే. కానీ ఓటు వేసే స‌మ‌యంలో ఒక్క‌టే గుర్తు పెట్టుకోండి. ఈ రోజు రాష్ట్రంలో జ‌రుగుతున్న‌ది క్లాస్ వార్ జ‌రుగుతుంది. ప్ర‌తి ఒక్క‌రూ గుర్తు పెట్టుకోండి. మీ ఇంట్లో మీ ఆడ‌ప‌డుచుల‌తో, అవ్వాతాత‌లో, మీ పిల్ల‌ల‌తో మాట్లాడి వారి అభిప్రాయం తెలుసుకోండి. ఎవ‌రి వ‌ల్ల మీకు మంచి జ‌రిగిందో ఆలోచించి ఓటు వేయ‌మ‌ని కోరుతున్నాను.

ఈ ప్రాంతంలో ఉన్న భూముల‌కు సంబంధించి నాకు తెల‌సు. ప్రాసెస్‌లో ఉన్న ఫైల్‌ను క్లియ‌ర్ చేయ‌లేకపోయాను. ఎన్నిక‌ల షెడ్యూల్ రావ‌డంతో చేయ‌లేక‌పోయాను. ఈ భూముల‌కు సంబంధించిన రాజా చెప్పింది అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ప‌రిష్క‌రించి ఇక్క‌డే మీకు అందిస్తాన‌ని మాటిస్తున్నాను.  175 కి 175 అసెంబ్లీ స్థానాలు, 25 కి 25 ఎంపీ స్ధానాలు ఒక్కటి కూడా తగ్గేందుకు వీలే లేదు సిద్ధమేనా?.

మ‌న గుర్తు ఫ్యాన్‌..
ఇక్కడో, ఎక్కడో, అక్కడో మన గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా ఉంటే అక్కడున్న అక్కలు మన గుర్తు ఫ్యాన్ అక్కా, పెద్దమ్మ, అవ్వా మన గుర్తు ఫ్యాన్, అన్నా మన గుర్తు ఫ్యాన్, తమ్ముడూ మన గుర్తు ఫ్యాను, అక్కా ఫ్యాను, పెద్దమ్మ మన గుర్తు ఫ్యాను, ఫ్యాన్ అన్నా, మన గుర్తు ఫ్యాన్ తమ్ముడు, అక్కడ కళ్లజోడు పెట్టుకున్న పెద్దమ్మ, ఎర్రచీర కట్టుకున్న పెద్దమ్మ మన గుర్తు ఫ్యాను.. మంచి చేసిన ఈ ఫ్యాను ఎక్కడుండాలి. ఇంట్లో ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఇంటి బయడే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్, సింక్ లోనే ఉండాలి. 

ఈ విషయాలన్నీ మీకు చెబుతూ నా కుడిపక్కన మీ ఎమ్మెల్యే అభ్యర్ధిగా జ‌క్కంపూడి రాజా, నాకు సొంత త‌మ్ముడు లేడ‌ని బాధ‌నిపిస్తుంది. రాజాను చూస్తే నాకు సొంత త‌మ్ముడు అనిపిస్తుంది. గొప్ప మెజారిటీతో రాజాను ఆశీర్వ‌దించండి. రాజా ద్వారా మీకు ఇంకా గొప్ప మంచి చేయిస్తాన‌ని తెలియ‌జేస్తున్నా..రాజాకు ఒక ఓటు వేస్తే రాజాతో పాటు గ‌ణేష్‌,  విజ‌య‌మ్మ ప‌ని చేస్తుంది. రాజా భార్య కూడా ప‌ని చేస్తారు. జ‌న‌సేన అభ్య‌ర్థికి ఓటు వేస్తే మ‌ళ్లీ ఉద్యోగాలు ఇప్పిస్తాన‌ని మీ అంద‌రి వ‌ద్ద డ‌బ్బులులాక్కుంటాడు. ప్ర‌తి ఒక్క‌రు గుర్తు పెట్టుకోండి. ఎంపీ అభ్యర్ధిగా డాక్టర్ గూడూరి శ్రీనివాసులు పోటీ చేస్తున్నారు. 

మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు వీరిద్దరిపై సంపూర్ణంగా ఉంచాల్సిందిగా రెండు చేతులు జోడించి పేరుపేరునా మీబిడ్డ ప్రార్థిస్తున్నాడు అంటూ ముఖ్యమంత్రి   వైయస్.జగన్ తన ప్రసంగం ముగించారు.

Best Web Hosting Provider In India 2024