Best Web Hosting Provider In India 2024
నన్ను కించపరుస్తూ గెలవాలనుకుంటున్నారా?
నల్లజర్ల దాడి ఘటనపై హోం మంత్రి తానేటి వనిత
తూర్పుగోదావరి : హోం మంత్రిపైనే దాడికి యత్నం అంటే ప్రజాస్వామ్యంలో ఉన్నామా? అని మంత్రి తానేటి వనిత ప్రతిపక్షాన్ని ప్రశ్నించారు. దళితురాలినైన నన్ను కించపరుస్తూ.. రౌడీయిజం ప్రదర్శిస్తూ, దాడి చేసి గెలవాలనుకోవడం ఎంత వరకు కరెక్ట్?. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నానని ఆమె పేర్కొన్నారు. నల్లజర్లలో టీడీపీ శ్రేణులు తనపై దాడికి యత్నించడంపై రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత స్పందించారు. దళితురాలినైన తనను కించపరుస్తూ.. రౌడీయిజంతో గెలవాలనుకోవడం ఎంత వరకు సబబని ప్రత్యర్థులను ఆమె నిలదీశారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం సాయంత్రం గోపాలపురం నియోజకవర్గంలో పర్యటించాం. ఎన్నికల ప్రచారం ముగించుకుని స్థానిక నేత సుబ్రహ్మణ్యం ఇంటికి చేరుకున్నాం. ఆ సమయంలో టీడీపీ శ్రేణులు దాడులకు తెగబడ్డాయి. మా నేతలపై రాళ్లతో దాడి చేయడంతో పాటు వాహనాలను సైతం ధ్వంసం చేశారు. వందమంది ఒకేసారి మూకుమ్మడిగా వచ్చి ప్రచార రథంపై ఉన్న బాక్సులను, అక్కడున్న బైకులను ధ్వంసం చేశారు.
ప్రచార కార్యక్రమంలో మేము ముందు ఉండటం.. మాకు ప్రజల ఆదరణ చూసి టీడీపీ నేతలు ఓర్వలేక పోతున్నారు. గోపాలపురంలో వైయస్ఆర్సీపీ గెలవబోతుందనే నిజాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఆ కడుపు మంటతోనే దాడులకు తెగబడ్డారు.
టీడీపీ శ్రేణుల దాడుల్లో.. మా కార్యకర్తలు నలుగురికి తీవ్రంగా దెబ్బలు తగిలాయి. ఒకరికి తల పగలటంతో కుట్లు సైతం పడ్డాయి. టీడీపీ నేతలు రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తూ.. దాడులు చేయిస్తున్నారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాం. కేసు దర్యాప్తు చేస్తున్నారు అని హోం మంత్రి తానేటి వనిత అన్నారు.