
Best Web Hosting Provider In India 2024

Geethanjali Malli Vachindi OTT Streaming: గీతాంజలి మళ్లీ వచ్చింది మూవీ ఇంకా ఓటీటీలోకి రాలేదు. నిజానికి మంగళవారం (మే 7) అర్ధరాత్రి 12 గంటల తర్వాత ఆహా ఓటీటీలోకి వస్తుందని అందరూ భావించారు. కానీ ఇప్పటి వరకూ మూవీ రాకపోవడంతో ప్రేక్షకులు నిరాశ చెందుతున్నారు. అంజలి నటించిన ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ తేదీని ఆహానే ఈ మధ్య సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేసింది.
గీతాంజలి మళ్లీ వచ్చింది ఓటీటీ స్ట్రీమింగ్
సాధారణంగా ఓటీటీల్లోకి వచ్చే సినిమాలు అర్ధరాత్రి నుంచే స్ట్రీమింగ్ మొదలవుతాయి. అలా కాదంటే ప్రత్యేకంగా సదరు ఓటీటీలు ఆ సినిమా స్ట్రీమింగ్ ప్రారంభమయ్యే సమయం కూడా చెబుతారు. ఈ మధ్య ఆహా ఓటీటీ కూడా ప్రేమలు మూవీ ఉదయం 6 గంటల నుంచి వస్తుందని చెప్పింది. కానీ గీతాంజలి మళ్లీ వచ్చింది మూవీ విషయంలో మాత్రం అలా జరగలేదు.
ఈ సినిమా బుధవారం (మే 8) నుంచి స్ట్రీమింగ్ అవుతుందని రెండు రోజుల కిందట ఆహా తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది. దీంతో అర్ధరాత్రి నుంచే స్ట్రీమింగ్ అవుతుందని భావించారు. కానీ మధ్యాహ్నం దాటినా సినిమా రాలేదు. రాత్రి 9 గంటలకు ప్రారంభం అవుతుందేమో అన్న చర్చ జరుగుతోంది. గతంలో కొన్ని సినిమాలను ఆహా ఇలాగే రాత్రి సమయంలో స్ట్రీమింగ్ ప్రారంభించింది.
అయితే దీనిపై ఆహా ఓటీటీ నుంచి మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. వాళ్ల ఎక్స్ అకౌంట్లో టాప్ లోనే ఈ గీతాంజలి మళ్లీ వచ్చింది ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ పిన్ చేసి ఉంచారు. కానీ అందులో టైమ్ మాత్రం వెల్లడించలేదు. మరో కొత్త అనౌన్స్‌మెంట్ కూడా రాలేదు.
గీతాంజలి మళ్లీ వచ్చింది ఎలా ఉందంటే?
అంజలి, శ్రీనివాస్ రెడ్డి నటించిన గీతాంజలి మూవీకి సీక్వెలే ఈ గీతాంజలి మళ్లీ వచ్చింది. మొదటి సినిమా హారర్ కామెడీ జానర్ లో బాగానే ఆకట్టుకుంది. ఆ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ ఈ సీక్వెల్ మాత్రం అంచనాలను అందుకోలేకపోయింది. ఏప్రిల్ 11న థియేటర్లలో రిలీజైన ఈ మూవీని ప్రేక్షకులు ఆదరించలేదు.
దీంతో నెల రోజుల్లోపే మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. నిజానికి ఈ మూవీ మే 10 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి వస్తుందని మొదట వార్తలు వచ్చాయి. కానీ తర్వాత డేట్ తోపాటు ప్లాట్‌ఫామ్ కూడా మారిపోయింది. ఆహా ఓటీటీనే అధికారికంగా చెప్పడంతో పుకార్లకు తెరపడింది. అయితే వెయిటింగ్ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది.
కామెడీ హారర్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కిన గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమాకు శివ తూర్లపాటి దర్శకత్వం వహించారు. ఈ మూవీతో ఆయన టాలీవుడ్‌కు డైరెక్టర్‌గా పరిచయం అయ్యారు. ఎంవీవీ సినిమాస్‌తో కలిసి కోన ఫిల్మ్స్ కార్పొరేషన్‌పై కోన వెంకట్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో రూపొందించారు. ఎంవీవీ సత్యనారాయణ, జీవీ నిర్మాతలుగా వ్యవహరించారు. కథ, స్క్రీన్ ప్లేను కోన వెంకట్ అందించారు.