

మైలవరం నియోజకవర్గంలో రూ.4.5కోట్ల వ్యయంతో సొసైటీ భవనాల అభివృద్ధి.
మైలవరం శాసనసభ్యులు శ్రీ వసంత వెంకట కృష్ణప్రసాదు గారు
ఎన్టీఆర్ జిల్లా, మైలవరం నియోజకవర్గం, 9/1/2023.
మైలవరం నియోజకవర్గంలో 28 సొసైటీలు ఉండగా, 18 సొసైటీలలో రూ.4.5 కోట్ల వ్యయంతో కొత్త భవన సముదాయాలు, ఆధునికీకరణ పనులు చేసినట్లు శాసనసభ్యులు శ్రీ వసంత వెంకట కృష్ణప్రసాదు గారు వెల్లడించారు.
అడిగిందే తడవుగా వీటికి నిధులు కేటాయించిన మాజీ కేడీసీసీబీ చైర్ పర్సన్ యార్లగడ్డ వెంకట్రావు గారికి, తాజా చైర్ పర్సన్ తన్నీరు నాగేశ్వరరావు గారికి నియోజకవర్గ ప్రజలు, రైతుల తరపున కృతజ్ఞతలు తెలిపారు.
మైలవరం మండలంలోని చంద్రాలలో రూ.32.75 లక్షల వ్యయంతో నిర్మించనున్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (సొసైటీ) భవన నిర్మాణానికి కేడీసీసీబీ చైర్ పర్సన్ తన్నీరు నాగేశ్వరరావు గారు, కేడీసీసీబీ డైరెక్టర్ గుమ్మడపు రవీంద్రరాణా గారితో కలసి శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారు సోమవారం శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా శాసనసభ్యులు కృష్ణ ప్రసాద్ గారు మాట్లాడుతూ నియోజకవర్గంలో శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి పనులు చేసినప్పుడే ఓ ప్రజాప్రతినిధిగా తృప్తి కలుగుతుందన్నారు.
గ్రామాల్లో ఎన్నో అభివృద్ధి పనులు పూర్తి చేసినట్లు వెల్లడించారు. ఆర్.బి.కెలు, వెల్ నెస్ సెంటర్లు, సచివాలయాలు, నాడు-నేడు కింద పాఠశాలల భవనాలు, ఆసుపత్రుల అభివృద్ధికి కోట్లాది రూపాయలను నియోజకవర్గంలో ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించారు. అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలను కూడా సమర్ధవంతంగా అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
నియోజకవర్గంలో 20 వేల మందికి ఇళ్లస్థలాలను మంజూరు చేస్తే, చంద్రాలలో 360 మందికి ఇళ్లస్థలాలు మంజూరు చేశామన్నారు. ఇక్కడ ఇంకా అర్హులైన వారికి ఇళ్లస్థలాలు ఇస్తామన్నారు. ఒకసారి స్థలాలు ఇచ్చి చేతులు దులుపుకునే సంస్కృతి మాది కాదన్నారు. ఇళ్లస్థలాల పంపిణీ నిరంతర ప్రక్రియ అన్నారు.
గత ప్రభుత్వాలు మాదిరిగా జెండా కడితేనే సంక్షేమ పథకాలను వర్తింప చేసే విధానం మాది కాదన్నారు. కులం, మతం, వర్గం చూడకుండా అర్హతలే ప్రామాణికంగా ఇళ్ల ముంగిటకే వాలంటీర్ల ద్వారా సంక్షేమ పథకాలు అందజేస్తున్న జన హృదయ నేత మన జగనన్న అని పేర్కొన్నారు.
సొసైటీల ద్వారా తక్కువ వడ్డీకి అందిస్తున్న రుణాలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అన్నదాతల శ్రేయస్సు కోసం సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారని, వాటిని సద్వినియోగం చేసుకుని రైతులు ఆర్ధిక వృద్ధి సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.