Best Web Hosting Provider In India 2024
Prasar Bharati OTT: దూరదర్శన్ ఛానెల్‍తో చాలా మందికి అనుబంధం ఉండే ఉంటుంది. దూరదర్శన్ సహా మరిన్ని ప్రభుత్వ ఛానెళ్లు, ఆల్ ఇండియా రేడియో కూడా పబ్లిక్ బ్రాడ్‍కాస్ట్ ప్రసార భారతి కింద ఉంటాయి. అయితే, డిజిటల్ రంగంలో వస్తున్న మార్పులను పాటించకపోవడం, ప్రైవేట్ టీవీ ఛానెళ్లు రావటంతో కొన్నేళ్లుగా దూరదర్శన్‍కు అంత ఆదరణ దక్కడం లేదు. అయితే, ప్రస్తుత డిజిటల్ యుగానికి తగ్గట్టు ‘ప్రసారభారతి’ త్వరలోనే ఓటీటీ ప్లాట్‍ఫామ్ తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. ఆన్‍లైన్ స్ట్రీమింగ్ ప్రపంచంలోకి అడుగుపెట్టనుంది.
ఎప్పుడు మొదలు!
కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే ‘ప్రసార భారతి’ ఈ ఏడాది ఆగస్టులో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍ను ప్రారంభిస్తుందని తాజాగా అంచనాలు వెలువడ్డాయి. ఆగస్టులో లాంచ్ చేసే దిశగా ఇప్పటికే పనులు సాగుతున్నాయని కొన్ని రిపోర్టులు పేర్కొన్నాయి.
ఓటీటీ ప్లాట్‍ఫామ్‍ను ప్రసార భారతి తీసుకొస్తుందని కొంతకాలం క్రితమే సమాచారం బయటికి వచ్చింది. దీంతో ఈ విషయంపై చాలా ఆసక్తి నెలకొంది. అయితే, ఆగస్టులోనే ఈ ప్లాట్‍ఫామ్ లాంచ్ అవుతుందని తాజాగా సమాచారం బయటికి వచ్చింది. మరి.. ఆనెలలోనే వస్తుందేమో చూడాలి.
ఎలాంటి కంటెంట్
ప్రసార భారతి తీసుకొచ్చే ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో క్లీన్ ఎంటర్‌టైన్‍మెంట్ కంటెంట్ ఉండనుంది. ఎలాంటి అభ్యంతరకర విషయాలు లేని కంటెంట్ మాత్రమే ఈ ఓటీటీలో ఉంటుందని తెలుస్తోంది. ముఖ్యంగా భారత దేశ సంస్కృతి, సంప్రదాయాలు, జాతీయ విలువలు తెలిపేలా కంటెంట్ ఉంటుందని సమాచారం.
కుటుంబమంతా కలిసి చూసేలాంటి కంటెంట్ ఈ ఓటీటీలో ఉంటుందని ఓ సీనియర్ ప్రభుత్వ అధికారి చెప్పినట్టు ది ప్రింట్ రిపోర్ట్ వెల్లడించింది. “ప్రస్తుతం కొన్ని ఓటీటీ ప్లాట్‍ఫామ్‍ల్లో కంటెంట్ అసభ్యత, తిట్ల హద్దులను దాటేస్తున్నాయి. కుటుంబం కలిసి అలాంటి కంటెంట్ చూసేందుకు చాలా ఇబ్బందిగా మారింది. భారతీయ సంస్కృతి, జాతీయ విలువలను ప్రమోట్ చేసేలా కంటెంట్‍ను మేం ఇస్తాం. కుటుంమంతా కలిసి కూర్చొని ఈ కంటెంట్ చూడొచ్చు” అని ఆ అధికారి చెప్పినట్టు ఆ రిపోర్ట్ పేర్కొంది.
ఓటీటీ ప్లాట్‍ఫామ్ కోసం కంటెంట్ ప్రొవైడర్ల లిస్టును కూడా ప్రసార భారతి బోర్డు ఇప్పటికే ఆమోదించింది. టెలివిజన్ కంటెంట్ ప్రొడక్షన్ హౌస్ శ్రీ అధికారి బ్రదర్స్, నిర్మాత దర్సకుడు వివుల్ శర్మ సహా మరికొందరి ప్లేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.
ఈ ఓటీటీ ప్లాట్‍ఫామ్ సేవలను ఒకటి లేకపోతే రెండు సంవత్సరాల పాటు ప్రభుత్వం ఉచితంగా అందించనుంది. ఆ తర్వాత కంటెంట్‍తో యూజర్లు సంతృప్తి చెందాక వారి స్పందనను బట్టి స్వల్పంగా సబ్‍స్క్రిప్షన్ ఫీజ్ తీసుకురావాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం భారత్‍లో ప్రైవేట్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లు అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‍ఫ్లిక్స్, హాట్‍స్టార్ అత్యధిక యూజర్ల బేస్‍ను కలిగి ఉన్నాయి. మరిన్ని ఓటీటీలు కూడా బాగానే సబ్‍స్క్రైబర్లను కలిగి ఉన్నాయి. అయితే, ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో క్రమంగా ప్లాన్‍ల ధరలను పెంచడం, బెనిఫిట్స్ తగ్గించడం లాంటివి కూడా చేస్తున్నాయి. మరి ప్రసార భారతి నిర్వహించే ఓటీటీ వస్తే.. ప్రైవేట్ ప్లాట్‍ఫామ్‍లపై ప్రభావం ఏమైనా ఉంటుందా అనేది చూడాలి. అయితే, కంటెంట్‍ను బట్టి ఇది ఆధారపడి ఉంటుంది.