AP EAPCET 24: నేటి నుంచి ఏపీ ఈఏపీ సెట్‌ 2024… విద్యార్థులకు నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ నిబంధన

Best Web Hosting Provider In India 2024

AP EAPCET 24: ఏపీ ఈఏపీసెట్(EAPCET) ఎంట్రన్స్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈఏపీ సెట్‌కు నిమిషం ఆలస్యమైనా అనుమతించరని ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ స్పష్టం చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా 49 రీజనల్ సెంటర్స్ లో ఈఏపీ సెట్‌ కోసం 142 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ లో 2 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. నంద్యాలలో ముందు కేటాయించిన రాజీవ్ గాంధీ మెమొరియల్ కాలేజీ, శాంతిరాం కాలేజీలలో ఏర్పాటు చేసిన 2 పరీక్ష కేంద్రాలను చివరిలో మార్చారు. వాటిని ఈవిఎంలకు స్ట్రాంగ్‌రూమ్‌లుగా కేటాయించడంతో నంద్యాల కేంద్రాలను మార్చారు.

ఈఏపీ సెట్‌ జరిగే పరీక్ష హాల్ లోకి ఎలక్ట్రానిక్ పరికరాలు నిషిద్ధమని ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. ఈ ఏడాది రికార్డు స్థాయిలో 3,61,640 మంది ఈఏపీసెట్‌కు దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు చేసుకున్న వారిలో బాలురు 1,80,104, బాలికలు 1,81,536 మంది ఉన్నారు.

ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 13 నుండి నిర్వహించాల్సిన ఎంట్రన్స్ పరీక్షలు ఈ నెల 16 నుండి 23 వరకు నిర్వహిస్తున్నారు. ఉదయం 9- 12, మధ్యాహ్నం 2.30 – 5.30 వరకు రెండు సెషన్స్ లో పరీక్షల నిర్వహిస్తారు.

ఏపీ ఈఏపీసెట్-2024 ఎంట్రన్స్ నిర్వహణకు సర్వం సిద్ధం చేశామని ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయ్యర్ ఎడ్యుకేషన్ ఛైర్మన్ ప్రొఫెసర్ కె. హేమచంద్రా రెడ్డి అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 49 రిజనల్ సెంటర్ల పరిధిలో ఎంపిక చేసిన 142 సెంటర్లలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2024(ఈఏపీసెట్) పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. గతేడాది కంటే ఈ ఏడాది 22,901 మంది ఎంట్రన్స్ పరీక్షకు అధికంగా దరఖాస్తు చేసుకున్నారని వివరించారు.

విద్యార్థుల సౌలభ్యం కోసం తెలంగాణా రాష్ట్రంలోని హైదరాబాద్ లో కూడా రెండు సెంటర్లను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 13నుండి నిర్వహించాల్సిన ప్రవేశ పరీక్షలు ఈ నెల 16 నుండి 23 వరకు రోజుకు రెండు సెషన్స్ లో ఎంట్రన్స్ పరీక్షలు ఆన్ లైన్ బేస్డ్ (కంప్యూటర్ ద్వారా) పద్దతిలో నిర్వహిస్తున్నామన్నారు.

బైపీసీ విద్యార్థులకు ఈ నెల 16,17 తేదీల్లో 4 సెషన్స్ లో, ఎంపీసీ విద్యార్థులకు ఈ నెల 18 నుండి 23 వరకు 9 సెషన్స్ లో నిర్వహిస్తున్నామని వివరించారు. రోజుకు రెండు సెషన్స్ లో నిర్వహించే పరీక్షల్లో భాగంగా ఉదయం 9 నుండి 12 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2.30 నుండి 5.30 గంటల వరకు రెండో సెషన్ నిర్వహిస్తున్నామని చెప్పారు. గతేడాది మధ్యాహ్నం సెషన్ 3 నుండి 6 గంటల వరకు ఉండేదని ఈ ఏడాది అరగంట ముందుగా అనగా మధ్యాహ్నం 2.30 గంటల నుండి నిర్వహిస్తున్నామని తెలిపారు.

ఎంట్రన్స్ పరీక్షకు హజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా తమ హాల్ టికెట్, ఒక గుర్తింపు కార్డు వెంట తెచ్చుకోవాలని సూచించారు. ప్రతి హాల్ టికెట్ వెనుక భాగంలో సెంటర్ రూట్ మ్యాప్ ను ముద్రించడం కూడా జరిగిందన్నారు.

నిమిషం ఆలస్యమైనా అనుమతించరు…

ఏపీ ఈఏపీసెట్ -2024 ఎంట్రన్స్ పరీక్షకు నిమిషం ఆలస్యమైనా అనుమతించమని, విద్యార్థులు ఈ విషయం గమనించాలని కోరారు. పరీక్షా కేంద్రం వద్దకు అభ్యర్థులు కనీసం గంట ముందు చేరుకోవాలని సూచించారు. పరీక్షా హాల్ లోకి సెల్ ఫోన్, బ్లూ టూత్, కాలిక్యులేటర్ తదితర ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎంట్రన్స్ పరీక్షల నిర్వహణకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ఇప్పటికే మాట్లాడటం జరిగిందని, అలాగే ఆర్టీసీ అధికారులతో చర్చించి సెంటర్ల వద్దకు బస్సులు ఏర్పాటు చేయాలని కోరామన్నారు.

ప్రతి కేంద్రం వద్ద ప్రాథమిక వైద్య సిబ్బంది అందుబాటులో ఉంచాలని అన్ని జిల్లాల డిఎంహెచ్వోలకు ఆదేశాలు ఇచ్చామని పేర్కొన్నారు. పరీక్ష జరిగే సమయంలో విద్యుత్ అంతరాయం జరగకుండా చూడాలని విద్యుత్ శాఖాధికారులతో మాట్లాడామన్నారు. ఒకవేళ విద్యుత్ అంతరాయం జరిగితే జనరేటర్ లు అందుబాటులో ఉంచామన్నారు.

 
 
IPL_Entry_Point
 

సంబంధిత కథనం

టాపిక్

 
Ap EapcetEducationEntrance TestsExamsAndhra Pradesh News
 

Source / Credits

Best Web Hosting Provider In India 2024