
Best Web Hosting Provider In India 2024

BRS Politics: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రాజకీయ సమీకరణాలు సమూలంగా మారనున్నాయా అంటే ఔననే సమాధానం వస్తుంది. పదేళ్ళ పాటు అధికారంలో కొనసాగిన బీఆర్ఎస్ భవిష్యత్ ఏమిటన్న దానిపై ఆసక్తికరమైన చర్చ సాగుతోంది.
అధికారాన్ని కోల్పోయిన ఆరు మాసాల్లోపే ఇప్పటికే పలువురు ముఖ్య నేతలు కారు దిగి ఇటు కాంగ్రెస్, అటు బీజేపీలో చేరిపోతున్నారు. ఈ క్రమంలో వచ్చిన లోక్ సభ ఎన్నికల్లో శ్రేణులను కాపాడుకునేందుకు పార్టీ అధినాయకత్వం నానాతంటాలు పడింది.
చివరకు అగ్రనేతలే రంగంలోకి దిగి బుజ్జగింపుల పర్వం కొనసాగించినా తెల్లవారే సరికి ఎవరు ఉంటారో.. ఎవరు పోతారో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. లోక్ సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు సాధించడం ద్వారానైనా రాష్ట్రంలో తిరిగి సత్తా పుంజుకోవాలని ఆశపడిన బీఆర్ఎస్ అధినాయక త్వానికి తాజా పరిస్థితులు మింగుడుపడటం లేదని తెలుస్తోంది.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మూడు లోక్ సభ స్థానాల్లోనూ బీఆర్ఎస్ ఆశించిన మేరకు గట్టి పోటీని ఇవ్వలేకపోయిందంటూ గులాబీ శ్రేణులే అంతర్గతంగా అంగీకరిస్తుండటం గమనార్హం. అయినా కూడా బీఆర్ఎస్ ముఖ్య నేతలు తమకు కూడా విజయావకాశాలు ఉన్నాయంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా జూన్ 4న తేలిపోవడం ఖాయమని చెబుతున్నారు.
క్యాడర్ ను కాపాడుకోలేక..
పార్టీ ఆవిర్భావం నుంచి కేసీఆర్ ను నమ్ముకొని ఉన్న వారిలో న్యాయం జరిగింది అతికొద్ది మందికే.. అది కూడా కేసీఆర్, కేటీఆర్ కొటరీలో ఉన్న వారికే తప్ప, గ్రామీణ ప్రాంతాల నుంచి జిల్లా స్థాయి నేతలుగా ఎదిగిన వారెవ రికీ కూడా బీఆర్ఎస్ అధినాయకత్వం తగిన ప్రాధాన్యం ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తూ వచ్చింది.
2001 నుంచి 2014 వరకు ఉద్యమ పార్టీగా కార్యకర్తలు కూడా రాష్ట్ర సాధనలో భాగస్వాములై పదవులను ఆశించకుండా పార్టీ కోసం, ఉద్యమం కోసం పని చేస్తూ వచ్చారు. చాలా మంది తమ ఆస్తులను కోల్పోయిన సందర్భాలూ ఉన్నాయి.
అప్పటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించి లాఠీదెబ్బలు, జైలు జీవితం గడిపిన అనేక మంది యువకులు రాష్ట్రం ఏర్పడిన తర్వాత కనుమరుగైన పరిస్థితి నెలకొన్నది. పార్టీ అధికారంలోకి రావడంతో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం మారిపోయింది.
అప్పటి వరకు తెరచాటున ఉన్న పెత్తందారులు, భూస్వాములు, అగ్రవర్ణాలకు చెందిన నేతలందరూ తెరపైకి వచ్చి జిల్లాల వారీగా చక్రం తిప్పడం మొదలుపెట్టారు. కేసీఆర్ బంధువులుగా చెప్పుకునే అనేక మంది కరీంనగర్, సిరిసిల్ల, సిద్దిపేట, జగిత్యాల తదితర జిల్లాల్లో ఆడింది ఆటా.. పాడింది పాటగా సాగించుకున్నారు.
పార్టీ కోసం ప్రాణాలు త్యాగం చేసే వరకు జీవితాలను ధారపోసిన నేతలెవరూ కూడా అధిష్టానం దృష్టికే పోలేదు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎంగా కేసీఆర్ పునర్నిర్మాణంలో తలమునకలై ఉన్నారన్న భావనతో పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా పార్టీ సేవలోనే కాలం గడిపారు. ఆ క్రమంలోనే రెండోసారి పార్టీ అధికారంలోకి వచ్చినా తీరు మారకపోవడం, ఇతర పార్టీల నుంచి వస్తున్న వారికి పెద్దపీట వేస్తూ కీలక పదవులు కట్టబెడుతున్న వైనం అందరిని నొచ్చుకునేలా చేసింది.
బీఆర్‌ఎస్ పార్టీ అధికారంలో ఉండటంతో అధిష్టానాన్ని ఎదురించలేక, ప్రత్యామ్నయ పార్టీలు కూడా సరైన స్థితిలో లేకపోవడంతో కిమ్మనకుండా గడిపారు. ఈ క్రమంలోనే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యర్థుల కంటే సొంతపార్టీ వారే బీఆర్ఎస్ ను ఓడించాలనే ఆలోచన ఫలితంగానే ఆ పార్టీ ప్రతిపక్ష పాత్రకు పరిమితమైందనే టాక్ వినిపిస్తుంది.
ఎంపీ ఎన్నికల్లో కరువైన జోష్…
అసెంబ్లీ ఎన్నికల్లో చతికిలపడిన బీఆర్ఎస్ లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటుకోవాలనే ఆలోచనకు వచ్చింది. అధినేత కేసీఆర్ కరీంనగర్ నుంచే లోక్ సభ ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. జనాలను భారీగా తరలించకలిగినా పార్టీ క్యాడర్ లో జోష్ మాత్రం గతంలో మాదిరిగా లేదన్నది తేలిపోయింది.
కేసీఆర్, కేటీఆర్ సభలన్నీ కూడా జనాలతో నిండిపోయినా నేతలు ప్రజల నుంచి ఆశించిన స్పందన లభించకపోవడం గమనార్హం. ఒకప్పుడు కంచుకోటగా నిలిచిన కరీంనగర్ లో బీఆర్ఎస్ ఫలితాల తర్వాత ఎలా ఉండబోతున్నది ఊహించడానికి కూడా ఆ పార్టీ వీరాభిమానులు కలవరపడుతున్నారంటే పరిస్థితి ఎలా ఉంటుందో తెలుస్తోంది.
ఒక్క అసెంబ్లీ స్థానం లేకపోయినా బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ సుడిగాలి ప్రచారం చేసి సత్తాను చాటుకోగా, రాత్రికి రాత్రి టికెట్టు దక్కించుకొని వెలిచాల రాజేందర్ రావు కాంగ్రెస్ పార్టీ క్యాడర్ సహకారంతో గట్టి పోటీనివ్వ గలిగారు. బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు రోడ్ షోలు, ర్యాలీ చేపట్టగా బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ ఇటు నామినేషన్ సందర్భంగా గానీ, అటు ప్రచారం ముగింపు రోజున గానీ ఎలాంటి ర్యాలీలు, రోడ్ షోలు నిర్వహించకపోవడం ముందే చేతులెత్తేశారనే ప్రచారానికి ఆజ్యం పోసినట్టైంది. క్యాడర్ నుంచి స్పందన ఎలా ఉంటుందోనన్న భయంతోనే బీఆర్ఎస్ కార్యక్రమాల నిర్వహణకు ఆసక్తి చూపలేదని తెలుస్తోంది.
కాంగ్రెస్, బీజేపీ వైపు చూపులు…
అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు ముగియడంతో ఇక త్వరలో మున్సిపల్, పంచాయతీరాజ్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీలో కొనసాగడం కంటే కాంగ్రెస్, బీజేపీలో ఏదో ఒక వైపు చేరిపోవడమే ఉత్తమమనే దిశగా పార్టీ శ్రేణులు ఆలోచనలు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.
వరుసగా రెండోసారి కరీంనగర్ కార్పొరేషన్ ను దక్కించుకున్న బీఆర్ఎస్ పార్టీ నుంచి కేవలం పక్షం రోజుల్లోనే 14 మంది కార్పొరేటర్లు పార్టీని వీడటం తాజా పరిస్థితులకు అద్దం పడుతోంది. ఫలితాలు వెల్లడైన తర్వాత మరో 20 మంది కార్పొరేటర్లు ఏదో ఓ పార్టీలో చేరిపోవడానికి రంగం సిద్ధం చేసుకున్నారని తెలుస్తోంది.
ఇటు పట్టణ, అటు గ్రామీణ ప్రాంత బీఆర్ఎస్ నేతలందరూ ఎన్నికల సందర్భంలోనే కాంగ్రెస్, బీజేపీతో లోపాయికారి మంతనాలు జరపడం వల్ల బీఆర్ఎస్ కు పోలింగ్ సందర్భంగా మరింత నష్టం జరిగిందనే ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీని అడ్డుకునే క్రమంలోనే కరీంనగర్, పెద్దపల్లి నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ శ్రేణులు చివరి గంట సమయంలో బీజేపీకి మద్దతునిచ్చాయంటూ పుకార్లు షికార్లు చేస్తుండటం గమనార్హం.
నేతల ఆలోచన కూడా అలాగే ఉండటం.. పార్టీ రోజురోజుకు బలహీన పడుతుండటంతో ఫలితాల వెల్లడి తర్వాత బీఆర్ఎస్ మరింత పట్టుకోల్పోవడం ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఉమ్మడి జిల్లాలో ఒక వెలుగు వెలిగిన బీఆర్ఎస్ రెండు దశాబ్దాల తర్వాత తొలిసారిగా గడ్డు పరిస్థితులను ఎదుర్కోవాల్సిన రావడం గులాభీ శ్రేణులు బాదపడుతున్నాయి. ప్రత్యామ్నయ మార్గాలను ఎంచుకుంటున్నారు.
(రిపోర్టింగ్ కేవీ రెడ్డి, కరీంనగర్)
సంబంధిత కథనం
టాపిక్