టీడీపీ దాడులపై గ‌వ‌ర్న‌ర్‌కు వైయ‌స్ఆర్ సీపీ ఫిర్యాదు 

Best Web Hosting Provider In India 2024

విజ‌య‌వాడ‌: పోలింగ్ రోజు, పోలింగ్ తర్వాత వైయ‌స్ఆర్ సీపీపై టీడీపీ చేసిన దాడులపై వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత‌ల బృందం గ‌వ‌ర్న‌ర్‌కు ఫిర్యాదు చేసింది. మంత్రి బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో వైయ‌స్ఆర్ సీపీ బృందం గురువారం రాజ్ భవన్‌లో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌ని కలిసింది. టీడీపీ దాడుల‌పై గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు నేత‌లు ఫిర్యాదు చేశారు. పల్నాడు, అనంతపురం తదితర జిల్లాలలో పోలీసు అధికారుల వైఫల్యంపై కూడా వైయ‌స్ఆర్ సీపీ ఫిర్యాదు చేసింది. గ‌వ‌ర్న‌ర్‌ను క‌లిసిన వారిలో మంత్రి మేరుగ నాగార్జున, ఎమ్మెల్యే పేర్ని నాని, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఎంపీ మోపిదేవి వెంకటరమణ, మనోహర్ నాయుడు, ఇతర సభ్యులు పాల్గొన్నారు.

ఎన్నికల సంఘం పోలీసు అధికారులను భర్తీ చేసిన తర్వాత హింసాత్మక సంఘటనలు పెరిగాయ‌ని, పల్నాడు, అనంతపురం తదితర జిల్లాలతో పాటు వివిధ జిల్లాల్లో పోలీసు అధికారుల లోపాలను కూడా ఫిర్యాదులో ప్రస్తావించారు. నిష్పక్షపాతంగా జరిగే ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించేందుకు ఎన్నికల సంఘం నియమించిన ఐపీఎస్ (రిటైర్డ్) పోలీసు అబ్జ‌ర్వ‌ర్ దీపక్ మిశ్రా పక్షపాతంతో వ్యవహరించడంపై వైయ‌స్ఆర్ సీపీ ఆందోళన వ్యక్తం చేసింది. మిశ్రా టీడీపీ కార్యకర్తలతో కుమ్మక్కయ్యారని, ఎన్నికల ప్రక్రియ సమగ్రతను దెబ్బతీస్తూ తనకు అప్పగించిన బాధ్య‌త‌కు తూట్లు పొడిచాడ‌ని వైయ‌స్ఆర్ సీపీ ఫిర్యాదులో పేర్కొంది. టీడీపీ ప్రయోజనాలను పరిరక్షించడంతోపాటు ప్రతిపక్షాల చేసే హింసను తీవ్రతరం చేసేలా కనిపించిన పోలీసుల ఏకపక్ష తీరును పార్టీ తీవ్రంగా ఖండించింది. దాడుల‌కు కారణమైన వారందరిపై తగిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో గవర్నర్‌ను అభ్యర్థించారు.

బాబు ప్రోద్భలంతోనే దాడులు: మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌
చంద్ర‌బాబు ప్రోద్భలంతోనే టీడీపీ కార్యకర్తలు దాడులకు దిగారు. బాబుతో పాటు హింసకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలి. పోలింగ్ తర్వాత జరుగుతున్న హింస ఆందోళన రేపుతోంది. ఆయా ప్రాంతాల్లో ఉన్న పోలీసుల పనితీరుపై ఫిర్యాదు చేశాం. అబ్జ‌ర్వర్ దీపక్ మిశ్రా పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు. టీడీపీ వాళ్లు ఫిర్యాదు చేస్తే విచారణ లేకుండా చర్యలు తీసుకున్నారు. అబ్జ‌ర్వర్‌గా ఉన్న దీపక్ మిశ్రా పై న్యాయ విచారణ చేయాలి. ఎన్నికల సంఘం నుంచి రిపోర్ట్ తెచ్చుకుని దీపక్ మిశ్రాను మార్చాలని గ‌వ‌ర్న‌ర్‌ను కోరాం.

దీపక్‌ మిశ్రా అధికారులను బెదిరిస్తున్నారు: పేర్ని నాని
ఉద్దేశ పూర్వకంగా  దీపక్ మిశ్రాను ఏపీలో ఎన్నికల కోసం బీజేపీ-టీడీపీ తెచ్చింది. అతని వల్లే ఈ విధ్వంసం. రాష్ట్రంలో టీడీపీ దాడుల‌కు పాల్ప‌డుతున్న ప్రాంతాల్లోని మా పార్టీ నాయ‌కుల‌తో సీఎం వైయ‌స్‌ జగన్ ఇప్పటికే మాట్లాడారు. సంయమనంతో ఉండాలని పార్టీ శ్రేణులకు సీఎం వైయ‌స్ జగన్ సూచించారు. దీపక్ మిశ్రా విజయవాడ వచ్చిన దగ్గర నుంచి టీడీపీ సానుభూతి పరులైన రిటైర్డు అధికారులను కలిశారు. జిల్లా ఎస్పీలను కూడా మిశ్రా బెదిరిస్తున్నారు. పోలింగ్ పూర్తయినా కూడా దీపక్ మిశ్రా ఏపీ వదిలి వెళ్లటం లేదు. జిల్లాల్లో ఉన్న అందరూ అధికారులను లొంగ తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. దీపక్ మిశ్రా స్థానంలో సర్వీస్‌లో ఉన్న అధికారిని ఏర్పాటు చేయాలని గవర్నర్‌ను కోరాం

Best Web Hosting Provider In India 2024