Warangal Naimnagar Bridge : నయీంనగర్ బ్రిడ్జి పనుల పూర్తికి టైమ్ ఫిక్స్ – జూన్​ 15 డెడ్ లైన్​..!

Best Web Hosting Provider In India 2024

Warangal Naimnagar Bridge Works : ఓరుగల్లు నగరంలోని వరంగల్​–కరీంనగర్​ హైవేపై కీలకమైన నయీంనగర్​ నాలా పనులకు అధికారులు డెడ్​ లైన్​ ఫిక్స్​ చేశారు. దాదాపు రూ.90 కోట్ల నిధులతో నయీంనగర్​ నాలా డెవలప్​ మెంట్​, బ్రిడ్జి పనులకు శ్రీకారం చుట్టగా, జూన్ 15లోగా వర్క్స్​ అన్నీ కంప్లీట్​ చేయాలని టార్గెట్​ పెట్టుకున్నారు.

ఇప్పటికే దానికి సంబంధించిన పనులు స్టార్ట్ కాగా, అధికారులు నిర్దేశించుకున్న ప్రకారం ఇంకా నెల రోజుల సమయం మాత్రమే ఉంది. ఓ వైపు అకాల వర్షాలు దంచుతుండటంతో తరచూ పనులకు ఆటంకం కలుగుతోంది. దీంతో వర్షాకాలం ప్రారంభమయ్యే నాటికి నయీంనగర్​ నాలా డెవలప్​ పనులు పూర్తవుతాయో లేదోననే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

మూడేండ్ల కిందట శంకుస్థాపన…

గ్రేటర్ వరంగల్ నగరంలో హనుమకొండ పరిధిలోని నయీంనగర్​ నాలా ఆక్రమణల పుణ్యమాని ఇరుకుగా మారింది. దీంతో వర్షాలు పడినప్పుడల్లా వడ్డేపల్లి చెరువు నుంచి వచ్చే వరద నీటితో ఆ చుట్టు పక్కల ప్రాంతాలన్నీ జలమయం అవుతున్నాయి. వందల కాలనీలు నీట మునిగి జనాలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది.

ఈ క్రమంలోనే గ్రేటర్​ వరంగల్ మున్సిపల్​ కార్పొరేషన్​ ఎన్నికల సమయంలో అప్పటి మున్సిపల్​ శాఖ మంత్రి కేటీఆర్​ 2021 ఏప్రిల్ 12న వరంగల్ నగర పర్యటనకు వచ్చారు. వందల కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన చేశారు. అందులో ప్రధానంగా నయీంనగర్ బ్రిడ్జి పునర్నిర్మాణంతో పాటు నాలా రిటైనింగ్ పనులు కూడా ఉన్నాయి. శంకుస్థాపన చేసిన బీఆర్​ఎస్​ నాయకులు ఆ పనులపై పెద్ద శ్రద్ధ పెట్టకపోవడంతో ఎక్కడిపనులు అక్కడే నిలిచిపోయాయి.

కాంగ్రెస్​ హయాంలో కదలిక…

శంకుస్థాపన చేసి మూడేండ్లు దాటినా నయీంనగర్ నాలా డెవలప్​ మెంట్​ పనులకు మోక్షం కలగలేదు. కాగా కాంగ్రెస్​ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పనుల్లో కదలిక వచ్చింది. నయీంనగర్​ నాలా సమీపంలోనే నివాసం ఉండే, వరంగల్​ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్​ రెడ్డి ప్రత్యక్షంగా సమస్యను ఎదుర్కొన్న అనుభవం ఉండటంతో నాలా పనులపై స్పెషల్​ ఫోకస్​ పెట్టారు. ఈ మేరకు వరదముంపు చర్యల్లో భాగంగా రూ.90 కోట్ల నిధులు కేటాయించి, ఫిబ్రవరి 7న పనులకు శంకుస్థాపన చేశారు. నయీంనగర్ నాలా విస్తరణ, ఆక్రమణల తొలగింపు, ఇరువైపులా రిటైనింగ్​ వాల్స్​ కట్టే పనులకు శ్రీకారం చుట్టారు. వివిధ పర్మిషన్లు పూర్తయిన తరువాత ఏప్రిల్​ 5న బ్రిడ్జిని కూల్చి వేయించారు. అదే కాల్వలో తాగునీటి సరఫరా వ్యవస్థకు సంబంధించిన పైపులైన్లు ఉండగా.. రూ.7 కోట్లు పునరుద్ధరించారు. రూ.8.5 కోట్లతో కొత్త బ్రిడ్జి పనులు చేపట్టారు.

ఇంకా నెల రోజులే గడువు

జూన్​ నెలలో వర్షాలు ప్రారంభమవుతాయనే ఉద్దేశంతోనే ఆలోగానే నాలా రిటైనింగ్ వాల్స్​, బ్రిడ్జి పనులు పూర్తి చేయాలని ఎమ్మెల్యే నాయిని రాజేందర్​ రెడ్డి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. దీంతో అధికారులు నాలా పనులను నాలుగు యూనిట్లుగా విడగొట్టారు.

రాజాజీ నగర్ బ్రిడ్జి ఏరియా, నయీంనగర్ నాలా బ్రిడ్జి, చైతన్య కాలేజీ నుంచి బొక్కలగడ్డ బ్రిడ్జి, కేయూ రోడ్డులోని హనుమాన్ నగర్​ బ్రిడ్జి వద్ద పనులను యూనిట్లుగా విభజించి ఎక్కడికక్కడ ఇన్​ఛార్జులను నియమించారు. ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్​ సిక్తా పట్నాయక్​, గ్రేటర్​ కమిషనర్​ అశ్విని తానాజీ వాకడే పర్యవేక్షిస్తూ పనులు చేయిస్తున్నారు. కానీ ఇటీవల కురుస్తున్న అకాల వర్షాలు నాలా పనులకు అడ్డంకిగా మారుతున్నాయి.

అకాల వర్షాలతో పనులకు ఆటంకాలు కలుగుతుండగా.. అధికారులు నిర్ణయించుకున్న డెడ్​ లైన్​ మాత్రం దగ్గర పడుతోంది. దీంతోనే నిర్ధేశించుకున్న సమయంలోగా పనులు పూర్తవుతాయో లేదోననే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒక వేళ పనులు అసంపూర్తిగా ఆగిపోతే గతేడాది మాదిరిగానే ఈసారి కూడా వరంగల్ నగరం ముంపునకు గురయ్యే ప్రమాదం ఉంది. కాగా ఇంకో నెల రోజుల సమయం మాత్రమే ఉండగా.. ఆలోగా పనులు పూర్తి చేయడంలో అధికారులు సక్సెస్​ అవుతారో లేదో చూడాలి.

(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)

 

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్

WarangalWarangal Lok Sabha Constituency
Source / Credits

Best Web Hosting Provider In India 2024