Best Web Hosting Provider In India 2024
Murder Plan For Insurance in Hyderabad : హైదరాబాద్ లోని బేగంబజార్ లో దారుణం చోటు చేసుకుంది. బీమా డబ్బుల కోసం ఏకంగా సొంత అత్త మామలనే చంపేందుకు ఓ కోడలు కుట్ర పన్నింది.
బేగంబజార్ లోని కట్టెల మండిలో ఈ ఘటన చోటు చేసుకుంది. అత్తా మామలు చనిపోతే ఇన్స్యూరెన్స్ డబ్బులు వస్తాయని భావించిన కోడలు… ఓ సుఫారీ గ్యాంగ్ కు డబ్బులిచ్చింది. వారిని చంపేసే బాధ్యత అప్పగించింది. కాగా గురువారం రాత్రి అత్తా మామలు ఇంట్లో ఉండగా….. దుండగులు ఒక్కసారిగా ఇంట్లోకి చొరబడి వారిపై కర్రలు,కత్తులతో విచక్షణారహితంగా దాడికి దిగారు.అడ్డొచ్చిన భర్త పై కూడా దుండగులు కర్రలతో తీవ్రంగా దాడి చేశారు.
అరుపులు, కేకలతో స్థానికులు బయటికి వచ్చేలోపు దుండగులు పరారయ్యారు. అత్త మామ, భర్త తీవ్రంగా గాయపడ్డారు. చుట్టుపక్కన వాళ్లు హుటాహుటిగా పోలీసులకు సమాచారం అందిచారు. వారిని ఆస్పత్రికి తరలించారు. కాగా ఈ దృశ్యాలన్నీ స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.
ఇదిలా ఉంటే పోలీసుల ప్రాథమిక విచారణ ఆధారంగా భార్యను అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సభ్యుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
వ్యక్తిని హత్య చేసిన దుండగులు……
జగిత్యాల జిల్లాల్లో అర్థరాత్రి దారుణం చోటు చేసుకుంది. భూతగాదాల విషయంలో ముసుగు వేసుకొని వచ్చిన కొందరు దుండగులు ఓ కుటుంబం పై దాడి చేసి ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. ఈ దాడిలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
బుగ్గారం మండలం గోపాలపురం గ్రామానికి చెందిన బెస్త శ్రీనివాస్ (36),అతని తమ్ముడు మహేష్ పై గురువారం అర్థరాత్రి కొందరు కత్తులు,కర్రలతో దాడి చేశారు. శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందగా….తమ్ముడు మహేష్ తీవ్రంగా గాయాలపాలై ఆస్పత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు.
గత కొన్ని రోజులుగా బెస్త శ్రీనివాస్ ఇంటి పక్కన ఉన్న స్థలం విషయంలో కొందరితో గొడవలు జరుగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఆటో బోల్తా – ఆరుగురి పరిస్థితి విషమం
ఉపాధి హామీ కూలీలతో వెళుతున్న ఆటో బోల్తా పడిన ఘటన మంచిర్యాల జిల్లా దండేపల్లి మండల కేంద్రంలో శుక్రవారం చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే…. దండేపల్లి శివారులో జరుగుతున్న ఉపాధి హామీ పని కోసం సుమారు 30 మంది కూలీలను ట్రాలీ ఆటో లో వెళుతున్నారు. పని ముగించుకొని తిరిగి ఇంటికి వెళుతున్న తరుణంలో ట్రాలీ ఆటో అదుపు తప్పి పక్కనే ఉన్న కడెం ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటర్ కెనాల్ లో పడింది.
ఈ ప్రమాదంలో మొత్తం ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని అటుగా వెళ్తున్న వాహనదారులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది.
రిపోర్టింగ్ – కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా
టాపిక్