Best Web Hosting Provider In India 2024
Cucumber Egg fried Rice: వేసవిలో విరివిగా దొరికేవి కీరాదోస కాయలు. కీరాదోస రెసిపీలు చాలా తక్కువ మంది తింటారు. నిజానికి వీటిని కూడా ఎక్కువ వంటకాలలో జతగా వండుకోవచ్చు. ఒకసారి కీరదోస ఎగ్ ఫ్రైడ్ రైస్ వండి చూడండి. ఇది మీకు ఎంతో నచ్చుతుంది. ముఖ్యంగా పిల్లలకు ఇష్టమైన వంటకంగా మారిపోతుంది. దీన్ని చేయడం చాలా సులువు. దీంట్లో గుడ్లు కూడా వేస్తాము కాబట్టి బ్రేక్ ఫాస్ట్ లో ప్రోటీన్ అందుతుంది. కాబట్టి కీరాదోస ఎగ్ ఫ్రైడ్ రైస్ ని బ్రేక్ ఫాస్ట్ లో తినేందుకు ప్రయత్నించండి.
కీరా దోస ఎగ్ ఫ్రైడ్ రైస్ రెసిపీకి కావాల్సిన పదార్థాలు
కీరాదోస కాయలు – రెండు
వండిన అన్నం – రెండు కప్పులు
కోడిగుడ్లు – రెండు
ఉప్పు – రుచికి సరిపడా
కొత్తిమీర తురుము – రెండు స్పూన్లు
చిల్లి సాస్ – ఒక స్పూను
సోయాసాస్ – ఒక స్పూను
పచ్చిమిర్చి – నాలుగు
మిరియాల పొడి – అర స్పూను
అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక స్పూన్
కారం – ఒక స్పూన్
కీరాదోస ఎగ్స్ ఫ్రైడ్ రైస్ రెసిపీ
1. కీరాదోసను పైన పొట్టు తీసి సన్నగా కోసి పక్కన పెట్టుకోవాలి.
2. ఇప్పుడు ఒక గిన్నెలో రెండు గుడ్లను కొట్టి అందులోనే ఉప్పు, కారం, మిరియాల పొడి వేసి బాగా కలిపి ఆమ్లెట్ లా వేయాలి.
3. ఆ ఆమ్లెట్ ను ముక్కలుగా చేసి పక్కన పెట్టుకోవాలి.
4. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.
5. ఆ నూనెలో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి తరుగు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి బాగా కలుపుకోవాలి.
6. అందులోనే సోయా సాస్, చిల్లి సాస్ కూడా వేసి బాగా కలపాలి.
7. ఇప్పుడు సన్నగా తరిగిన కీరాదోస తురుమును వేసి ఒక నిమిషం పాటు వేయించుకోవాలి.
8. ఆ తర్వాత ముందుగా వండిన అన్నాన్ని అందులో వేసి రుచికి సరిపడా కాస్త ఉప్పును వేసుకోవాలి.
9. ఆమ్లెట్లో కూడా ఉప్పు వేసుకున్నాం కాబట్టి కొంచెం తక్కువగా వేసుకుంటే మంచిది.
10. ఇప్పుడు ముక్కలుగా చేసుకున్న ఆమ్లెట్ ని కూడా ఇందులో వేసి గరిటెతో కలపాలి.
11. పైన కొత్తిమీర చల్లి ఒక ఐదు నిమిషాల పాటు చిన్న మంట మీద ఉంచి కలుపుతూ ఉండాలి.
12. అంతే టేస్టీ కీరాదోస ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయినట్టే.
ఈ రెసిపీలో మనం వాడిన కీరాదోస కాయలు, కోడిగుడ్లు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి… అన్నీ ఆరోగ్యానికి మేలే చేస్తాయి. కాబట్టి పిల్లలకు ఈ కీరా దోస ఫ్రైడ్ రైస్ చేసి పెట్టండి… బ్రేక్ ఫాస్ట్ లో ఇది అదిరిపోతుంది.